విద్య, వైద్యం ఉచితంగా అందించే దేశాలు సుభిక్షంగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలు కష్టపడి సంపాదించే సొమ్ము అంతా ఈ రెండింటి కోసమే పెట్టాల్సి వస్తోంది. తినీ తినక.. పిల్లల్ని చదివించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒక్క నెల సంపాదన కంటే.. ఒక్క నెల పిల్లవాడి చదువు ఖర్చు ఎక్కువైపోతోంది. ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి. పోనీ ప్రభుత్వ విద్య అయినా అందుబాటులోకి తెస్తున్నారా అంటే.. బలవంతంగా ప్రైవేటు స్కూళ్ల వైపు వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఇది ప్రభుత్వాల చేతకాని తనం కాదా ?
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు 50 వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు. ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల కోరిక ప్రైవేట్ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు తాము తక్కువ కాదంటూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇదే సంప్రదాయానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్ అంటూ మరికొంత నొక్కుతున్నాయి.
విద్యాహక్కు చట్టం సెక్షన్-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్-11 ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1, 2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్-12 ప్రకారం టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఒక్కటి కూడా స్కూల్స్ పాటించడం లేదు.
తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్ట్రాలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్ నిర్వచించబడింది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్ధాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.
అప్పులు చేసైనా ప్రజలు కూడా ప్రైవేటు స్కూళ్లలోనే చేర్పిస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకపోవడమే. ప్రభుత్వాలు కూడా ప్రజలకు నమ్మకం కలిగించకుండా… ప్రైవేటు స్కళ్లలో చదువుకోండి.. మాపై భారం తగ్గుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఫీజుల నియంత్రణ జోలికి కూడా పెద్దగా వెళ్లడంలేదు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ఆదాయంలో పాతిక శాతానికిపైగా లాగేస్తున్న ప్రభుత్వం విద్య, వైద్యం వంటి వాటి విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించడం లేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…