చీమ చిటుక్కుమన్నా ఎంక్వయిరీ..హే చంద్రశేఖరా!

By KTV Telugu On 2 December, 2022
image

టీఆర్‌ఎస్‌ అనుమానిస్తున్నట్లే జరుగుతోంది. మునుగోడు ఎన్నిక తర్వాత కేంద్ర దర్యాప్తుసంస్థల నిఘా పెరిగింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల వేడి చల్లారలేదు. మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఆయన విద్యాసంస్థల ఉద్యోగులు ఎంక్వయిరీకి క్యూ కడుతున్నారు. అంతకుముందు మరో మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్ ఎంపీ రవిచంద్ర మైనింగ్‌ సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. సోదాల్లో బయటపడ్డ విషయాలను దర్యాప్తుసంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారంలోకి సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది.

గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని గంగుల, రవిచంద్రలకు ఐటీ, ఈడీ నోటీసులిచ్చింది. సోదాల్లో పనామా లింక్స్ వంటి కొన్ని సంచలనాలు బయటపడ్డాయి. ఇప్పుడీ ఎపిసోడ్‌లోకి సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను ఢిల్లీలో తమ ఎదుట హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులిచ్చింది. గ్రానైట్‌ సంస్థల్లో అక్రమాలకు తోడు దర్యాప్తునుంచి బయటపడేందుకు వీరు తెరవెనుక ప్రయత్నాలు చేశారన్న పక్కా సమాచారంతో సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో తుమ్మినా దగ్గినా కేంద్రానికి తెలిసిపోతోందని టీఆర్‌ఎస్‌ నేతలు తలపట్టుకుంటున్నారు.

ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆయన్ని విచారించినప్పుడు గంగుల కమలాకర్‌ కేసు లింక్‌ కూడా బయటపడింది. మంత్రి కమలాకర్‌తో నకిలీ సీబీఐ అధికారి టచ్‌లో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. చాలాకాలంగా ఈ డూప్లికేట్‌ ఆఫీసర్‌ పొలిటికల్‌ లీడర్స్‌కి టచ్‌లో ఉన్నాడు. ఈడీలో హైలెవల్‌ అధికారులు తనకు క్లోజ్‌అని ప్రచారం చేసుకున్నాడు. ఈడీ సోదాల నుంచి ఉపశమనం దొరికేలా చేస్తానని గంగులకు ఆ డూప్లికేట్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. దానికోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. ఈడీ, ఐటీ అధికారులను ప్రలోభ పెట్టడానికి నకిలీ సీబీఐ అధికారిని సంప్రదించారనే సమాచారంతో సీబీఐ సీన్లోకొచ్చేసింది. చేసేదేముంది టైం బాలేనప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది.