తెలంగాణోల ్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనూహ్యంగా వస్తే ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా అనేది చర్చకు పెట్టడమే అసలు మైండ్ గేమ్. ఇందులో ఎవరు లాభపడతారు.. ఎవరు ఓడిపోతారు ?
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గెలుపు కోసం తమ అస్త్రశస్త్రాల సిద్ధం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అంతా సీఎం రేవంత్ రెడ్డి తన భుజాల మీద వేసుకుని 10-12 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి మళ్లీ మోదీ క్రేజే గెలుపు గుర్రమని భావిస్తోంది. గులాబీ పార్టీ గెలుపునకు మాజీ సీఎం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికలలో గెలుపు కోసం ఈ మూడు ప్రధాన పార్టీల అస్త్రం మైండ్ గేమ్ మాత్రమే. గెలుపు తమదేనంటూనే… ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుందని ఓ పార్టీ అంటే, మరో పార్టీ ఈ ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు ఉనికి కోల్పోతాయని జోస్యం చెబుతోంది. అయితే ఈ మూడు పార్టీలు తమదైన శైలిలో మానసిక యుద్ధానికి తెర లేపాయి. ఇందులో ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు సాగుతుందో ఇప్పుడు చూద్దాం.
అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ పెట్టిన బీఆర్ఎస్ మళ్లీ కోలుకోకుండా ఉండేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి బీఆర్ఎస్ క్యాడర్ లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే తప్ప బీఆర్ఎస్ కాదని నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కారు దిగడం ఖాయమని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో నలుగురు మాత్రమే ఉంటారని, మిగతా వారంతా బయటకు రావడం ఖాయమని గులాబీ నేతలను మానసికంగా కృంగదీసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కోమటి రెడ్డి వంటి మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలతో మైండ్ గేమ్ లో దిగారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. ఈ దఫా దశ తిరిగి పది స్థానాలకుపైగా తెలంగాణలో దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు. కాని 4 ఎంపీ స్థానాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో గెలిచి బీజేపీ సంచలనం సృష్టించింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా 10 స్థానాల వరకు గెలుస్తామని కమలం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. కొందరికి టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో బీజేపీ మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని అల్టిమేటం జారీ చేసింది.
బొటా బోటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమేనని కమలం నేతలు తమ అంతర్గత సంభాషణల్లోను చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా అంటూ…పొలిటికల్ మైండ్ గేమ్‌తో అధికార కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు కమలం నేతలు కామెంట్స్ చేస్తున్నారు. క్యాడర్ లో ఉన్న నిరుత్సాహానికి తెర దించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో గందర గోళ రాజకీయాలు ఉంటాయని చెబుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పార్టీ క్యాడర్ ను , లీడర్లను కాపాడుకోవడంతో పాటు ఈ ఎన్నికల్లో గరిష్ట ఎంపీ స్థానాలు గెల్చుకునే వ్యూహంతోనే బీఆర్ఎస్ నేతలు ఈ మైండ్ గేమ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీనే అటు బీఆర్ఎస్,బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని కౌంటర్ ఎటాక్ చేస్తుందా… లేక కమలం, గులాబీ పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ కు చెక్ పెడతాయా అన్నది మాత్రం వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా. అన్ని పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశాయి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారి మైండ్ గేమ్ ఫలించిందని అనుకోవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…