కేబినెట్ విస్తరణపై రాహుల్ ను ఒప్పించిన రేవంత్

By KTV Telugu On 8 October, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో చర్చించి.. తాను సూచించిన పేర్లకు గ్రీన్ సిగ్నల్ పొందారు. దసరా తర్వాత మంచి రోజున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల పేర్లపై పూర్తి గోప్యత పాటిస్తున్నప్పటికీ… కొన్ని లీకులతో కొంత మేర స్పష్టత వచ్చింది. అయితే ఆరు స్థానాలకు ఏడేనిమిది మంది పేర్లు ప్రచారానికి రావడమే ఇప్పుడు పెద్ద అయోమయ పరిస్థితికి కారణమవుతోంది.

ఒకటి లేదా రెండు స్థానాలు ఖాళీ పెట్టేసి మిగిలినవి భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతవరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మల్ రెడ్డి రంగారెడ్డి, పీ. సుదర్శన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ అందులో ఒకరికి మాత్రమే కేబినెట్ బెర్త్ దక్కే ఛాన్సుందని చెబుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడైనా రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్న హామీ లభించినట్లు వార్తలు వచ్చాయి. మరి రాజగోపాల్ రెడ్డి సంగతేమిటో చూడాలి. శ్రీహరి ముదిరాజ్ తో పాటు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, మాజీ క్రికెటర్ మొహ్మద్ అజారుద్దీన్ పేర్లు బలంగా బయటకు వస్తున్నాయి. వారిద్దరకీ ఇస్తే.. నిజామాబాద్, హైదరాబాద్ కోటా కూడా భర్తీ చేసినట్లవుతుందని లెక్కలేస్తున్నారు…

హైడ్రా వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు చెబుతున్నారు. భాగ్యనగర రాజకీయాల్లో పార్టీ పూర్తిగా వీకై పోయిందన్న వాదనల నడుమ… జనంలోనూ, అనుచరగణంలోనూ విశ్వాసాన్ని పొందేందుకు హైదరాబాద్ నుంచి కనీసం ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు బహిరంగంగానే అంగీకరిస్తున్నాయి. ఇచ్చిన గ్యారెంటీలు నిలబెట్టుకోలేకపోవడం, కొన్ని తాజా పరిణామాలు పార్టీని డిఫెన్స్ లో పడేయ్యడంతో రేవంత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోంది. పైగా కేటీఆర్ తో గొడవలో మంత్రి కొండా సురేఖ కాస్త ఓవరాక్షన్ చేసి… నాగార్జున కుటుంబాన్ని, సమంతను వివాదంలోకి లాగారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. దిద్దుబాటుచర్యగా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే చేస్తే ఉమ్మడి వరంగల్ నుంచి మరో నాయకుడికి మంత్రివర్గంలోే చోటు దొరుకుతుంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి