తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శాంతికుమారిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ కావడంతో ఆయన స్థానంలో శాంతికుమారిని నియమించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డ్ సృష్టించారు.
సోమేష్‌కుమార్ వెంటనే ఏపీ కేడర్‌కి రిపోర్ట్ చేయాలని హైకోర్టు బెంచ్ ఆదేశించటంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకంపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె వెంటనే బాధ్యతలు స్వీకరించి సీఎంని కలుసుకున్నారు.
సీఎస్‌గా నియమితులైన శాంతికుమారి ఇప్పటిదాకా అటవీశాఖ స్పెషల్ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్నారు. ఆమె 2025 ఏప్రిల్ వరకూ పదవిలో కొనసాగే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మహిళా అధికారిణి వైపే మొగ్గు చూపింది. గతంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం శాంతికుమారికి ఉంది. శాంతికుమారి 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. శాంతికుమారి నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా అరవింద్‌కుమార్, రామకృష్ణరావుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిద్దరితో పాటు రజత్ కుమార్, రాణి కుమిదిని, శశాంక్ గోయల్, వసుధా మిశ్రా, అశోక్ కుమార్, సునీల్‌శర్మ సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నారు. ఏపీకి చెందిన రామకృష్ణారావు సీఎస్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించినా చివరికి శాంతికుమారివైపే ప్రభుత్వం మొగ్గుచూపించింది. శాంతికుమారి గతంలో సీఎంవో పనిచేశారు. మూడు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
మూడేళ్లుగా చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోని సివిల్ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పుతో న్యాయస్థానం ముగింపు పలికింది. హైకోర్టు తీర్పు రాగానే కేంద్రం శరవేగంతో స్పందించింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని గంటల్లోనే కసరత్తు పూర్తిచేసి చివరికి శాంతికుమారిని కొత్త సీఎస్‌గా నియమించింది.