కవిత వర్సెస్ కోమటిరెడ్డి.. కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్

By KTV Telugu On 22 December, 2022
image

తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని పార్టీని నీడలా వెంటాడుతోంది బీజేపీ. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసే ప్రణాళిక రచిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణ ఎదుర్కొన్న సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు మంత్రి కేటీఆర్‌ను కూడా టార్గెట్ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు. కేటీఆర్ డ్రగ్స్ బానిస అని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. డ్రగ్స్ కేసులను బయటకు తీస్తే కేటీఆర్ కథ బయటకు వస్తుందని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని తిన్నదంతా కక్కిస్తామని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫోనిక్స్ వివాదంలోకి కూడా కేటీఆర్ ను లాగే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫోనిక్స్ సంస్థపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని బీజేపీ నేతలు అటాక్ చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత ఫోనిక్స్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉందిలే గడ్డుకాలం ముందు ముందునా !!..తిన్నదంతా కక్కిస్తాము నంద నందనా..!! అంటూ అరవింద్ ట్వీట్ చేశారు. మరోవైపు గులాబీ పార్టీలోని కీలక నేతలపైనా కమలదళం ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఢిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులో మరో మంత్రి గంగుల కమలాకర్, ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఇటీవల సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ ఛార్జ్ షీట్‌లో కవిత పేరు చేర్చారు. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. ఆమె వాడిన పది ఫోన్ల ధ్వంసాన్ని పేర్కొంది.

ఇదిలా ఉంటే దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ జేబు సంస్థలుగా మార్చుకుంటోందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతూ కుట్రపూరితంగా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏ విచారణకైనా పరీక్షకైనా సిద్ధమని బీజేపీ కుట్రలకు తలొగ్గేది లేదని కమలనాథులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా రెండు పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఓవైపు కవిత-రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ యుద్ధం మరోవైపు బండి సంజయ్ కేటీఆర్‌ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తన కాంట్రాక్ట్‌పై చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రివేంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. ఈడీ చార్జిషీట్‌లో 28సార్లు లిక్కర్ క్వీన్ కవిత పేరు ఉందని రాజగోపాల్ రెడ్డి పోస్ట్ పెట్టగా 28సార్లు కాదు 28వేల సార్లు పెట్టినా అబద్ధం నిజం కాదు అన్నా అంటూ కవిత రిప్లై ఇచ్చారు. అయినా వదిలిపెట్టని రాజగోపాల్ రెడ్డి నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా అంటూ రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

ఇక, జుట్టు, రక్తం శాంపిల్స్ ఇస్తే కేటీఆర్ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిరూపిస్తానని బండి సంజయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఏది కావాలంటే అది ఇస్తా. టెస్టులో ఏమీ లేదని తేలితే కరీంనగర్ చౌరస్తాలో చెబ్బుదెబ్బలు తినేందుకు సిద్ధమా అంటూ సంజయ్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్‌పై స్పందించిన బండి నీ కరాబైన కిడ్నీతో వాళ్లేం చేసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూన్నెళ్ల ట్రీట్ మెంట్ తర్వాత ఇప్పుడు పరీక్షలకు సిద్ధమంటున్నాడని కేటీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తాను తంబాకు తింటున్నట్లు ఆరోపణలు చేసినప్పుడు నీ సంస్కారం ఏడబోయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోయే ప్రమాదముందని కేటీఆర్ భయపడుతున్నారని అందుకే ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని సంజయ్ కౌంటర్ అటాక్ చేశారు.