షర్మిల టార్గెట్ వెనక సీక్రెట్ అదే..!

By KTV Telugu On 3 December, 2022
image

కేసీఆర్ అసలు లక్ష్యం కాంగ్రెస్‌
బీజేపీ లెక్కే కాదంటున్న గులాబీలు
కాంగ్రెస్ ఓట్లు చీల్చే అస్త్రం షర్మిల
అదే జరిగితే టీఆర్ఎస్‌కు లాభం..
ఆ బాణం ఎక్కుపెడుతోంది అందుకే

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఆమె చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. 3,500 కిలో మీటర్లు పాదయాత్ర చేసినా రాని మైలేజ్ ఒక్క సంఘటనతో వెలుగులోకి వచ్చింది. అనుకోని ఓ రోజు నర్సంపేటలో కారు అకస్మాత్తుగా వచ్చి వైఎస్సార్టీపీని ఢీకొట్టడంతో షర్మిల హైలెట్ అయిపోయారు. పాదయాత్ర నర్సంపేట్‌లో కొనసాగుతున్న సమయంలో షర్మిల కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి, ఫ్లెక్సీలు, వైఎస్సార్ విగ్రహాల ధ్వంసంతో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం పోలీసులు కారులో ఉన్న ఆమెను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయడం లాంటి పరిణామాలతో పెద్ద హైడ్రామా నడిచింది. ఇదంతా యాక్సిడెంటల్‌గా జరిగింది కాదనే ప్రచారం మొదలైంది. షర్మిల వెనుక ఉన్నదెవరే అనే చర్చ మొదలైంది. షర్మిల ఏ పార్టీకి పోటీ దారు కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ఆయుధమవుతుంది. మరి ఆ ఆయుధం ఎవరికి ఉపయోగపడుతుంది. ఆమె ఎవరు ఓట్లు చీలుస్తుందనే లెక్కలు వెసుకుంటే వెనుక ఎవరున్నారో అనే విషయం అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు.

ఎప్పుడూ లేనివిధంగా టీఆర్ఎస్ నేతలంతా మూకుమ్మడిగా షర్మిలపై విమర్శలకు దిగడం కవిత- షర్మిల మధ్య ట్వీట్ల వార్ చోటుచేసుకోవడం చూస్తుంటే టీఆర్ఎస్సే ఆమెను హైలెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు తలపండిన మేధావులు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. సరిగ్గా బండి సంజయ్ భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించే రోజే షర్మిలపై దాడి ఘటన చోటుచేసుకుంది. అంతే రాజకీయం మొత్తం టర్న్ తీసుకుంది. అటెన్షన్ మొత్తం షర్మిల వైపు మళ్లింది. ఇదంతా కేసీఆర్‌ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందంటున్నారు కొందరు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే కారును ఢీకొట్టేంత సత్తా కాషాయదళానికి కనిపించడం లేదు. ఎందుకంటే గ్రామస్థాయిలో ఆ పార్టీకి పట్టు లేదు. బీజేపీకి పోటీ చేసేందుకు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరువే. పైకి టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరుగా కనిపిస్తున్నా కేసీఆర్ అసలు టార్గెట్ కాంగ్రెస్‌ మాత్రమేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటు ప్రతీ నియోజకవర్గం అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా కనిపిస్తున్నా కింది స్థాయిలో ఆపార్టీకి కేడర్ ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులున్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుంది. ఇదేవిషయాన్ని టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు కూడా. అందుకే కాంగ్రెస్‌ ఓట్లను చీలిస్తే తమకు అధికారం సులువు అవుతుందనే లెక్కల్లో గులాబీ నేతలున్నారట. అది షర్మిలతోనే సాధ్యమవుతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. షర్మిల పూర్తిగా వైఎస్సార్ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదే ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ సైతం ఓన్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో షర్మిల నాలుగో పార్టీగా ఎంత ఓట్లు చీల్చితే అంత తమకు ప్రయోజనమని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలోని వైఎస్సార్ అభిమానులు, రెడ్డి ఓటర్లు ఎంతోకొంత షర్మిల వెంట వచ్చే అవకాశముంది. అందుకే బీజేపీ తమకు లెక్కకాదని కాంగ్రెస్‌ను దెబ్బకొడితే హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నారట. టీఆర్ఎస్, బీజేపీగా సాగుతున్న పోరులోకి సడన్‌గా షర్మిల ఎంట్రీ ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం కూడా దాంట్లో భాగమేనంటున్నారు. కాంగ్రెస్‌ను కొట్టేందుకు కేసీఆర్ షర్మిలకు మైలేజ్ ఇస్తున్నారో లేక ఆమెను బాణంగా వదిలారో తెలియదు గానీ మున్ముందు రాజకీయం మరింతగా వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.