ఎన్నికలకు ముందు మళ్లీ సెంటిమెంట్ అస్త్రం
షర్మిల టార్గెట్‌గా గులాబీ రాజకీయం
ఆ పప్పులేవీ ఉడకవంటున్న రాజకీయ వర్గాలు
షర్మిలను అడ్డుకుంటే..బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?
రేపు మిగతా రాష్ట్రాల్లో కేసీఆర్ తిరగగలరా ?
టీఆర్ఎస్కు సమస్య వచ్చిన ప్రతీసారి కేసీఆర్ సంధించే అస్త్రం సెంటిమెంట్. సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్తోనే రాజకీయాలను లాగుతారనే పేరుంది. పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా దానిపైనే భారం వేసి నెట్టుకొస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. 2014 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ వాదం పేరుతో కేసీఆర్ చేసిన రాజకీయాలను పలువురు గుర్తు చేస్తున్నారు. 2014లో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ మద్దతు తెలిపామని బీజేపీ ప్రమోట్ చేసుకున్నా ప్రజలు కేసీఆర్ నే నమ్మారు. దానికి కారణం ఆయన రగిలించిన సెంటిమెంటే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకట్టడం కేసీఆర్‌కు కలిసొచ్చింది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని సెంటిమెంట్ రాజేసిన గులాబీ దళపతి మంచి ఫలితాలు రాబట్టారు.
ప్రతిసారి ఎన్నికలకు ముందు సెంటిమెంట్ పండించే టీఆర్ఎస్ ఈసారి కూడా దాన్ని తెరపైకి తీసుకొస్తోంది. షర్మిల టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం వెనక జగన్‌ను, అటు చంద్రబాబును లాగే ప్రయత్నం చేస్తోంది గులాబీ దళం. తెలంగాణపై మరోసారి సమైక్యవాదుల కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ లేకుండా చేస్తే తమకు తిరుగుండదనే ఆలోచనతో ఏపీ నాయకులున్నారని చెబుతున్నారు. అయితే ఈసారి ఆ పప్పులేవీ ఉడకనట్టే కనిపిస్తోంది. తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి ఓట్లు దండుకోవడం ఈసారి అంత ఈజీ కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో దూకుడుగా వెళ్తున్న షర్మిలకు చెక్ పెట్టడం కోసం టీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ సెంటిమెంట్ బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన గులాబీ బాస్‌కు షర్మిల విషయంలో చోటుచేసుకున్న ఘటనలతో కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. షర్మిల నాన్ లోకల్ అంటూ చేస్తున్న టీఆర్ఎస్ వాదంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. షర్మిల ఆంధ్రావ్యక్తి అని ఆమెను అడ్డుకుంటామని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు రేపు దేశవ్యాప్తంగా రాజకీయం ఎలా చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ తీసుకున్న గులాబీ నేతలు రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో ఎలా తిరగగలరని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ను కూడా ఇతర రాష్ట్రాల్లో అడ్డుకుంటే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఈ విషయంలోనే గులాబీ దళాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేసేలాగా మారుతున్నాయి.
తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి పదే పదే ఆంధ్రావాళ్లపై ఆరోపణలు చేస్తే అది కేసీఆర్‌కే మైనస్ అంటున్నారు విశ్లేషకులు. రేపు ఏపీలో కూడా కేసీఆర్‌ను అక్కడి పార్టీలు టార్గెట్ చేసే అవకాశముందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సి వస్తే అక్కడి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం కూడా తక్కువేనని చెబుతున్నారు. షర్మిలపై ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేసే ప్రతీమాటకు రేపు ఏపీలో వైఎస్సార్సీపీ నుంచి కౌంటర్ రావడంలో ఆశ్చర్యం లేదంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న టిఆర్ఎస్ ఇక సెంటిమెంట్‌కు పాతరేయక తప్పదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. ప్రాంతీయతత్వంతో వ్యాఖ్యలు చేయడం వల్ల అది కేసీఆర్‌పైనే ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. మున్ముందు ఈ వ్యవహారంలో చోటుచేసుకుంటున్న రచ్చ పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలి.