ఆయన ఫాంహౌస్‌లో స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఇద్దరు స్వాములు ఓ మీడియేటర్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందనేది అభియోగం. ఈ ఎపిసోడ్‌తో పైలెట్ రోహిత్‌రెడ్డి సహా ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ దృష్టిలో హీరోలైపోయారు. అసలేం జరిగిందన్న దానిపై జనానికి కొన్ని డౌట్లున్నా ఆ నలుగురి సీట్లు మాత్రం పదిలం. ఫాంహౌస్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వ వాదనలు, సాక్ష్యాలు చట్టంముందు నిలుస్తాయా అన్నదానిపై ఎన్నో సందేహాలున్నాయి. ఎందుకంటే కేవలం ఫోన్ సంభాషణలు తప్ప ఎక్కడా సొమ్ము దొరకలేదు.
ఆ ముగ్గురినీ అడ్డుపెట్టుకుని బీఎల్ సంతోష్‌లాంటి బడానేత పీక పట్టుకుందామనుకుంది బీఆర్ఎస్. బీజేపీ బిగ్ టూ అమిత్‌షాని కూడా బద్నాం చేయాలనుకుంది. కానీ ఆ టార్గెట్ ఇంకా వర్కవుట్ కాలేదుగానీ ఆపరేషన్ రివర్స్ మొదలైంది. ఫాంహౌస్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీనుంచి శ్రీముఖం అందింది. మొదట కర్నాటక డ్రగ్స్ కేసు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అది గుట్కా వ్యాపారం వెనుక మనీ ల్యాండరింగ్ మ్యాటరని. ఈడీ ముందు హాజరయ్యారు పైలెట్. తనకెలాంటి సంబంధం లేదని ఆయన ఖండించడం లేదు. కేంద్ర దర్యాప్తుసంస్థ కక్షసాధిస్తోందని అంటున్నారు. నందకుమార్‌ని అడ్డుపెట్టుకుని తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
ఎవరీ నందకుమార్ అంటే మళ్లీ మ్యాటర్ ఫాంహౌస్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ దొరికిన ముగ్గురిలో నందకుమార్ ఒకడు. ఈ నందకుమార్ తనను తనను రూ.1.75 కోట్ల మేరకు చీట్ చేశాడంటూ అభిషేక్ అనే వ్యక్తి ఫిర్యాదుచేశారు. ఆయన 7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్‌మసాలా ఓనర్. అభిషేక్, పైలెట్ రోహిత్‌రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. ఆ లావాదేవీలకు సంబంధించే ఎమ్మెల్యేను ఈడీ విచారించింది. నందకుమార్ ద్వారా పాన్‌మసాలా లావాదేవీల కేసులో తనను ఇరికిస్తారని రోహిత్‌రెడ్డి భయపడుతున్నారు.
అభిషేక్ గతంలో మాణిక్‌చంద్ గుట్కాకు హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్. 2015లో సొంత బ్రాండ్‌తో పాన్ మసాలా ప్రొడక్ట్ మొదలుపెట్టాడు. తర్వాత గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించారన్న ఆరోపణలున్నాయి. అందులో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. తెలుగురాష్ట్రాల్లో ఎంతోమందిని మోసంచేసినట్లు అభిషేక్‌పై ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తి తనను మోసంచేశాడంటూ నందుపై ఫిర్యాదుచేయటం దాన్ని అడ్డుపెట్టుకుని ఈడీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని విచారించటం చూస్తుంటే పక్కా ప్లాన్‌తోనే జరుగుతున్నట్లుంది. రెండు కేసుల్లోనూ నందకుమారే కీలకంగా కనిపిస్తున్నాడు. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడూ ఉంటాడని ఊరికే అన్నారా?