దేశ వ్యాప్తంగా బిజెపి అమలు చేసిన వ్యూహాన్నే బి.ఆర్.ఎస్. తెలంగాణాలో అమలు చేస్తోన్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వివిధ రాష్ట్రాల్లో బిజెపి లబ్ధి పొందింది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి లబ్ధిపొందాలని బి.ఆర్.ఎస్. నేతలు పథక రచన చేసినట్లుంది. అయితే ఇది బూమెరాంగ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పండితులు. భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో తనకు సంప్రదాయ బద్ధంగా ఉండే హిందూ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ కాంగ్రెస్ కు సొంతమైన ముస్లిం ఓట్లకు గండి కొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతోంది. ఇలా ముస్లిం ఓట్లను చీల్చేందుకే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న మజ్లిస్ పార్టీని ఎన్నికల బరిలో దింపుతోంది బిజెపి.
నిజానికి బిజెపి-మజ్లిస్ పార్టీలు పైకి పరస్సర విరుద్ధ సిద్ధాంతాలు లక్ష్యాలు కలిగిన పార్టీలు. బద్ధ విరోధ పార్టీలు కూడా అటువంటిది బిజెపి విజయం కోసం మజ్లిస్ పరోక్షంగా సాయం అందించడంపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. మజ్లిస్ ను బిజెపికి బి టీమ్ గా అభివర్ణిస్తున్నారు చాలా మంది. అది మజ్లిస్ కో కోపం తెప్పిస్తోంది. తాము తమ రాజకీయ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలోనే దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నామని మజ్లిస్ చెబుతోన్నా దాన్ని ఎవరూ నమ్మడం లేదు. మజ్లిస్ ను అడ్డుపెట్టుకునే బిహార్ లో ఆర్జేడీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంది బిజెపి. ఈ వ్యూహం చాలా బాగుందనుకున్న కేసీయార్ తెలంగాణాలో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుంది. ఎందుకంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ బి.ఆర్.ఎస్. మంత్రి కేటీయార్ ల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకోవడం ఆవెంటనే తాము వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించడం జరిగిపోయాయి.
ఇదంతా మ్యాచ్ ఫిక్సింగే అని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఎందుకంటే మజ్లిస్-బి.ఆర్.ఎస్. లు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. రెండుపార్టీల మధ్య అవగాహన కూడా బానే ఉంది. కాంగ్రెస్ కు పడాల్సిన ముస్లిం ఓట్లను గండికొట్టేందుకే కేసీయార్ చాణక్య నీతి ప్రదర్శించి మజ్లిస్ పార్టీని వీలైనన్ని ఎక్కువ స్థానాల నుంచి బరిలో దింపాలని భావించి ఉంటారని దాన్నే అక్బరుద్దీన్ చేత చెప్పించి ఉంటారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఒక వేళ మజ్లిస్ పార్టీ నిజంగానే 50 స్థానాల్లో పోటీ చేస్తే మజ్లిస్ అభ్యర్ధులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో ముస్లిం ఓట్లను కొల్లగొడితే అది ఎవరికి నష్టం. కాంగ్రెస్ కే నష్టమని బి.ఆర్.ఎస్. లెక్కలు వేసుకుంటోంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ లెక్క కరెక్ట్ కాదంటున్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణా జిల్లాల్లో ముస్లింలు బి.ఆర్.ఎస్. కే ఓటు వేస్తున్నారు. వారు కాంగ్రెస్ కు దూరమై చాలా కాలమైంది. ఇపుడు మజ్లిస్ అభ్యర్ధులను రంగంలోకి దింపితే వారికి పడే ఓట్లన్నీ కూడా కచ్చితంగా బి.ఆర్.ఎస్. వే అంటున్నారు రాజకీయ పండితులు. అంటే అంతిమంగా మజ్లిస్ ను బరిలో దింపడం వల్ల బి.ఆర్.ఎస్. కే నష్టమని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే మజ్లిస్ వర్గాల వాదన మరోలా ఉంది. తాము బి.ఆర్.ఎస్. కో బిజెపికో లబ్ధి చేకూర్చేందుకు సిద్ధంగా లేమంటున్నారు ఆ పార్టీ నేతలు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్ నియోజక వర్గాలను తమకు వదిలేయాలని బి.ఆర్.ఎస్. నేత కేసీయార్ ను మజ్లిస్ నేతలు కోరినట్లు చెబుతున్నారు. దానికి ఆయన సుముఖంగా లేకపోవడం వల్లనే ఒత్తిడి పెంచేందుకు 50 చోట్ల పోటీచేస్తామని మజ్లిస్ ప్రకటించి ఉండచ్చన్నది వారి వాదన. ఎందుకంటే రాజేంద్రనగర్ లో సగానికిపైగా ఓట్లు ముస్లింలవే. జూబ్లీ హిల్స్ లోనూ ముస్లిం ఓటు బ్యాంకు చాలా బలంగా ఉంది. ఆ రెండు చోట్లా మజ్లిస్ అభ్యర్ధులు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. విడి విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు మేలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టే బి.ఆర్.ఎస్. అభ్యర్ధిని బరిలో దించకుండా అక్కడ మజ్లిస్ కు మద్దతు ఇస్తే బాగుంటుందన్నది మజ్లిస్ నేతల వాదనగా తెలుస్తోంది. మొత్తానికి కారణాలు ఏవైనా మజ్లిస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతోందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.