ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ హడావుడి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. న్యాయనిపుణులు కూడా అంతే. ఎందుకంటే అసలు ఇప్పటి వరతూ ఒక్కటంటే ఒక్క కేసు కూడా టెలిగ్రాఫ్ చట్టం కింద పెట్టలేదు. ఎందుకంటే నిరూపించడం అసాధ్యం కాబట్టి. టెక్నాలజీ కనిపించని ఈ కాలంలో ఇంకా అసాధ్యం. ఇప్పుడు ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరుగుతున్నహడావుడిలోనూ ట్యాపింగ్ కేసు కాదు. బ్లాక్ మెయిల్ చేయడం .. డబ్బులు వసూలు చేయడం వంటివి పెడుతున్నారు. అందుకే కేటీఆర్ వెంట్రుక కూడా పీకలేరని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమీ తేల్చక కేసు నిర్వీర్యం అయిపోతే.. రేవంత్ రెడ్డి ఇజ్జత్ నిలబడుతుందా ?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతోంది. అనేక రకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ చాలా డేరింగ్ ప్రకటన చేశారు. వెంట్రుక కూడా పీకలేరు అని సవాల్ చేశారు. కేటీఆర్ ధైర్యానికి చాలా కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. అందులో మొదటిది ఫోన్ ట్యాపింగ్ అనే నేరాన్ని ఇప్పటి వరకూ నిరూపించలేదు. నిరూపించే టెక్నాలజీ ఉందా.. అది మన న్యాయవ్యవస్థను మెప్పిస్తుందా అన్నదానిపై ఎన్నో డౌట్లు ఉన్నాయి. అందుకే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇంత వరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేకపోయారు. ఎందుకంటే..కేసు నమోదుకు అయినా ప్రాథమిక ఆధారాలు ఉండాలి.
ప్రస్తుతం తెలంగాణలో ట్యాపింగ్ ఇష్యూ మీద జరుగుతున్న వ్యవహారం.. విచారణలు ఏవీ నిజమైన ట్యాపింగ్ కేసు కాదు. ట్యాపింగ్ చేసి ఏం చేశారన్నదానిపైనే విచారణ జరుపుతున్నారు. ఫలానా చోట్ల డబ్బులు పట్టుకున్నామని.. వారిని బ్లాక్ మెయిల్ చేశామని .. ఫలానా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని ఆస్తులు రాయించుకున్నారన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వీటి ఆరోపణలకు మూలం ట్యాపింగ్. ప్రత్యేకంగా వార్ రూముల్ని పెట్టుకుని.. ట్యాపింగ్ వ్యవహారాల్ని నడిపించారని స్పష్టంగా తెలుసు. కానీ నిరూపించే ఆధారాలు లేవు. సిరిసిల్ల, పాలకుర్తిలో వార్ రూముల్ని పెట్టారు..ఎవరెవర్ని పెట్టి ట్యాపింగ్ చేశారో కూడాా స్పష్టత ఉంది. కానీ ఆధారాలే లేవు.
తాజాగా పోలీసులు హార్డ్ డిస్క్‌ల గురించి లీకులు ఇచ్చారు. ప్రణీత్ రావు ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని.. హార్డ్ డిస్కుల్ని కట్ చేసి మూసీలో విసిరేశారని .. వాటిని స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు. వాటిని ఎలా రీ ట్రీవ్ చేయాలన్నదానిపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారన్నది లీకుల సారాంశం. నిజానికి అది అసాధ్యమని.. పోలీసుల టెక్నికల్ టీముకి కూడా తెలుసు. అందుకే అప్రూవర్ల గేమ్ ఆడారు. అప్రూవర్ గా మారేందుకు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సిద్ధమయ్యారని ప్రచారం చేశారు. కానీ ఆయన అమెరికా నుంచి రాలేదు. ట్యాపింగ్ గురించి ఆధారాలు సేకరించడం దాదాపు అసాధ్యం కాబట్టే.. ఆయన ధైర్యంగా రాలేదని.. అమెరికాలోనే ఉన్నారని అంటున్నారు.
ట్యాపింగ్ విషయంలో అప్రూవర్లుగా మారి… పరికరాలు ఎక్కడ్నుంచి తెప్పించారు.. ఎవరు తెప్పించారు అనే విషయాలు కనిపెట్టి.. ఆ పరికరాలను స్వాధీనం చేసుకోగలిగితే కొంత మేర ట్యాపింగ్ ను నిరూపించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ ప్రయత్నాలు ఇంత వరకూ ఫలించలేదు. రవిపాల్ అనే సాంకేతిక నిపుణుడు మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఇంత వరకూ ఆయనను పిలిపించలేకపోయరు. అయితే ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న పోలీసుల్ని మాత్రం.. నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేకపోతే ట్యాపింగ్ చేసి వారు చేసిన అక్రమాల విషయంలో ఏసీబీ కేసులు.. ఇతర ఏజెన్సీల కేసులు పెడతామని హెచ్చరికలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకూ ఆ కోణంలోనే విచారణ జరుగుతోంది కానీ.. నిజంగా ట్యాపింగ్ వరకూ కేసులు రాలేదు. ఎందుకంటే.. అది ఎంత క్లిష్టమో వారికి తెలుసు మరి !
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…