అమర నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణలో సైతం అపూర్వ స్పందన వచ్చింది. కాంగ్రెస్ ను మట్టి కరిపించి టీడీపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పార్టీ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది.ఇప్పుడు మాత్రం వర్తమానం, భవిష్యత్తు రెండూ ఆగమ్యగోచరమై మీనమేషాలు లెక్కిస్తోంది….
తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు మాత్రం గుడ్డిదీపంలా ఎప్పుడు ఆరిపోతుందా అన్న చందంగా తయారైంది. పార్టీలో నాయకులంతా పక్కకు జారి.. చెప్పుకోదగ్గ లీడర్ లేని పరిస్థితి కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల వేళ.. అసలు తెలంగాణలో పోటీ అన్న మాటే ఆ పార్టీ నేతల నోట వినిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నేతృత్వ పార్టీ పోటీ చేయలేదు. పవన్ కల్యాణ్ చేసినంత ధైర్యం కూడా ఆ పార్టీ చేయలేదన్న అసంతృప్తి టీడీపీ కమిటెడ్ కేడర్లో కనిపిస్తోంది. ఐనా అధినాయకత్వం పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. ఉదయం లేస్తే హైదరాబాద్ లో తిరిగేందుకే ఇష్టపడే టీడీపీ నాయకులు తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణానికి మాత్రం ఇష్టపడటం లేదు. ద్వితీయ శ్రేణి నేతలను ఉత్తేజ పరిచే చర్యలు లేవు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు లేవు.
టీడీపీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. టీడీపీలో ఉన్న నేతలు మాత్రం అంతగా డెవలప్ కాలేని పరిస్థితి ఉంది. రేవంత్ మనోడే అని చెప్పుకోవడం మినహా పార్టీ సాధించిందేమీ లేదు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు…
ఎల్ రమణ టీటీడీపీ అధ్యక్షుడిగా ఉండేవారు. సడన్ గా వెళ్లి బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ తీసుకున్నారు. రాజకీయ ఆకాంక్షలు, అనివార్యతలూ ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే ఆయన ఖమ్మంలో ఓ సభ పెట్టి చంద్రబాబును ఆహ్వానించారు. సభకు జనం భారీగానే తరలి వచ్చారు. తర్వాత ఏమైందో తెలీదు కానీ, మరో భారీ సభ జరగలేదు. తెలంగాణలో తిరిగేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించలేదు. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామన్ని అధిష్టానం ప్రకటించడంతో చిర్రెత్తుకొచ్చిన జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చిందన్న ప్రచారమూ ఉంది. జగన్ రెడ్డి పక్షం వహించిన కేసీఆర్ ను ఓడగొట్టేందుకు టీడీపీ నేతలు, తెలంగాణలో పార్టీ మద్దతుదారులు వేసిన స్కెచ్ తోనే బీఆర్ఎస్ మట్టి కరిచిందని చెబుతారు. అందుకే కేసీఆర్ ఓడిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా టీడీపీ అభిమానులే సంతోషించారు. మాతో ఇంకోసారి పెట్టుకోకు అన్నట్లుగా కాలర్ ఎగరేశారు. అంతవరకు బాగానే ఉంది. మరి తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమిటంటే మాత్రం సమాధానం లేదు. పార్టీ నేతలు ఫుల్ టైమ్ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టి తెలంగాణను వదిలేశారని క్షేత్రస్థాయి కేడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఏపీలో పార్టీ నిలబడటం ముఖ్యం, అక్కడ గెలవడం ముఖ్యం.. దాని కోసం తెలంగాణ రూపంలో డైవర్షన్ వద్దన్నట్లుగా టీడీపీ అధిష్టానం తీరు ఉందని చెబుతున్నారు. ఈ తీరు తెలంగాణ కేడర్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. నియోజకవర్గాల్లో పార్టీకి మంచి పేరు ఉందని, కొంతమేర ఓటు బ్యాంకు కూడా ఉందని అలాంటప్పుడు బరిలోకి దిగడంలో తప్పులేదని అభిప్రాయపడే వారున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో చేరినందున తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వడం ఖాయమే అవుతుంది. పనిలో పనిగా రెండు సీట్లు అడగటంతో తప్పు లేదు కదా అన్నది ఇప్పుడు కేడర్ ను వేధిస్తున్న ప్రశ్న…
తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించడం కష్టమేమీ కాదు. కొంచెం కష్టపడాలంతే. పనిచేసే నేతలకు అధిష్టానం చేయూత ఇవ్వాలి అంతే. మరి ఆ పనిచేస్తారా..లేక పూర్తిగా చేతులు ఎత్తేస్తారా..అంటే.. లోక్ సభ ఎన్నికల తర్వాతే అసలు సంగతి బయట పడుతుంది…. చూద్దాం… చంద్రన్న ఏం చేస్తారో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి