తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూన్ మెుదటి వారం నుంచే వర్షాలు కురవగా.. ఆగస్టులో మాత్రం అంతగా కుర్వలేదు. ఇక సెప్టెంబర్ నెలలో అతివృష్టి గా భారీ వర్షాలు కురిశాయి పలు చోట్ల వరదలతో పంట నష్టం జరిగింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు తీవ్రంగా నష్ట పోయాయి. ఆ జిల్లాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. రాష్ట్రంలో నేటి నుంచి రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతం నుంచి లక్షద్వీప్ వరకూ ఒక ద్రోణి ఏర్పడిందని.. లక్షద్వీప్ దగ్గర మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మేఘాలు వస్తూ, పోతూ ఉంటాయని వెల్లడించారు. సాయంత్రం 4 తర్వాత ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల అర్థరాత్రి వరకు కూడా జల్లులు పడొచ్చునని చెప్పారు.
నేడు మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో పాటుగా భారీ ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు.
ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమవుతుందని అధికారులు తెలిపారు. సాయంత్రం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఒకవైపు అతివృష్టి ఇంకో వైపు అనావృష్టి అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదు కాగా ఇంకొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిసినా నీళ్లు మాత్రం భూమి పొరల్లోకి ఇంక లేదు. నీరు పోయిన సంవత్సరం కంటే ఎక్కువ లోతులో ఉన్నట్లు తెలుస్తుంది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…