టి-కాంగ్రెస్ అంటే తెలుగుదేశం కాంగ్రెస్సా?

By KTV Telugu On 20 October, 2023
image

KTV TELUGU :-

వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమన్న ధీమా తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వంలో దూకుడు పెంచుతోంది. దాంతో పాటే దురుసుతనమూ పెరుగుతోంది. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీలో మొదట్నుంచీ ఉన్న సీనియర్లకు  మొండి చేయి చూపించడమే కాకుండా వారిని అవమానకరంగా పార్టీ నుండి బయటకు పంపేస్తున్నారన్న విమర్శలూ పెరుగుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై   టికెట్ రాని సీనియర్లు జూనియర్లూ కూడా నిప్పులు చెరుగుతున్నారు. అయితే  పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా  గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలన్న ఫార్ములాను అమలు చేస్తున్నామే తప్ప పార్టీలో ఎవరినీ అవమానించడం లేదని రేవంత్ అంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. గులాబీ, కమలం పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై సమరశంఖం పూరించాయి. కాని కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్యుద్ధంలో మునిగి తేలుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తొలిగా ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో కొత్తగా పార్టీలో చేరినవారికే 11 సీట్లు కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది, ఆగ్రహం కలిగించింది. ఒక కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వరంటూ జరిగిన ప్రచారానికి విరుద్ధంగా ఉత్తమ్‌కుమార్ దంపతులిద్దరికీ టిక్కట్లు దక్కాయి. అదేవిధంగా రాత్రికి రాత్రి పార్టీ మారిన మైనంపల్లి హనుమంతరావుకు ఆయన కుమారుడికి రెండు టిక్కెట్లు దక్కాయి. మొత్తం చంద్రబాబు మనుషులందరికీ కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఇస్తున్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు సామాజికవర్గమే కాదు..ఆయనకు నమ్మినబంటు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకి రాగానే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఖమ్మం టిక్కెట్ ఇచ్చేలా రేవంత్‌ చక్రం తిప్పారు. నిజామాబాద్‌లో రాజకీయాలు విరమించి సైలెంట్‌గా ఉంటున్న మాజీ టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావుతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ భేటీ జరిపారు. ఆయన్ను కూడా పార్టీలోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చి చంద్రబాబుకు నమ్మినబంట్లుగా ఉంటూ…ప్రస్తుతం అక్కడ సీట్లు రానివారినందరినీ కాంగ్రెస్ లోకి  తీసుకువచ్చి టిక్కెట్లు ఇప్పించడానికి రేవంత్‌ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ  ప్రకటించిన 55 సీట్లలో గద్వాల టిక్కెట్‌ను స్థానిక నేతలను కాదని బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన జడ్‌పీ చైర్మన్ సరితకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా మల్కాజ్‌గిరి, మెదక్ సీట్లు మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుక్కి ఇవ్వడాన్ని కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేవంత్ రడ్డి అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్నారంటూ అటు గాంధీభవన్‌లోను…ఇటు గన్‌పార్క్‌ దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.పార్టీలోని సీనియర్ నేతలు తమ కుటుంబాలకు టిక్కెట్ల కోసం రేవంత్‌ ఎలా వ్యవహరిస్తున్నా సైలెంట్‌గా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చేస్తే వారంతా గెలుపు గుర్రాలైపోతారా? పార్టీని నమ్ముకుని ఉంటున్నవారు పనికిరాకుండా పోతారా అంటూ రేవంత్ మీద దండెత్తుతున్నారు అసంతృప్తులు. అసలు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవిలోకి వచ్చిందే అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకునేందుకంటూ మండిపడుతున్నారు. తన మనుషులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికే పార్టీలో పనిచేస్తున్నవారికి సర్వేలో ఆదరణ లేదంటూ దొంగ సర్వేలు ప్రచారం చేస్తున్నారని..కొత్తగా వచ్చినవారికి అంత ప్రజాదరణ ఉంటే వారు అంతుకుముందు ఉన్న పార్టీలో సీటు ఎందుకివ్వలేదనే ప్రశ్నలు వేస్తున్నారు.

మొత్తంగా టీ కాంగ్రెస్ తొలి జాబితా తీవ్ర వివాదాస్పదంగా మారింది. పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీలోకి కొత్తగా వచ్చినారికి ఆనందాన్ని పంచగా..ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్నవారికి దుఖాన్ని కలిగించింది. అందుకే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరి నాయకులు కోరుతున్నట్లు కొత్తవారికి ఇచ్చినవాటిపై పునరాలోచన చేస్తార? రెండో లిస్ట్‌ కూడా ఇలాగే తయారు చేస్తారా అనే చర్చ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నేత, మాజీ మంత్రిని అత్యంత అవమానకరంగా పార్టీ నుండి బయటకు పంపడం ఘోరమైన తప్పిదమే అంటున్నారు సీనియర్లు. ఇవన్నీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి