తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పార్టీల నేతలు ఇప్పుడు తమ సొంతవారి కంటే పక్క పార్టీ జనంపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. పైగా పక్క రాష్ట్రంలో అధికార పార్టీని తెగ పొగిడేస్తున్నారు. అది తెలంగాణ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ ఐనా సరే వారి నోట ఒక్కటే మాట వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈజ్ గ్రేట్ అని వాళ్లు చెప్పేస్తున్నారు. అదేదో అసంకల్పితంగా అంటున్నారనుకుంటే కూడా పొరబాటే. బుద్ధిపూర్వకంగానే అంతా అంచనా వేసుకునే వాళ్లు ఆ మాట అంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….
టీడీపీ విషయంలో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి విస్మయానికి గురి చేస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీని బూచి గా చూపించారు ఆ పార్టీనే ఇప్పుడు తీరు మార్చుకుంది. టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపైనా.. బీఆర్ఎస్ నేతలు పొగడ్తలు కురిపిస్తున్నారు. పోనీ.. ఇలా చేస్తున్నవారేమైనా చిన్న నాయకులు అనుకుంటే పొరపాటే.. బీఆర్ఎస్ అగ్రనాయకులు. కేటీఆర్, హరీష్ రావులే.. టీడీపీపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. బొగ్గు గనుల వేలం విషయంలో కేటీఆర్ ఇప్పుడు టీడీపీని గుర్తుచేసుకుంటున్నారు. సింగరేణికి వేలం లేకుండా .. గనులు కేటాయించలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో 16 సీట్లు దక్కించుకున్న టీడీపీని , సీఎం చంద్రబాబును చూసి.. రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని.. కేటీఆర్ హితబోధ చేస్తున్నారు.విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రవేటీకరణ కాకుండా..కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని తెలంగాణలో కాంగ్రెస్కు 8 మంది, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా.. సింగరేణిని కాపాడలేక పోతున్నారని.. కేటీఆర్ ఆరోపణలు సంధించారు.. ఇక, ఇదే విధంగా హరీష్ రావు కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. టీడీపీని చూసీ బుద్ధి తెచ్చుకోవాలనే రేంజ్ లో ఆయన మాట్లాడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ అంటే బీఆర్ఎస్ నేతలు ఎగిరెగిరి పడేవారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.అప్పటి చంద్రబాబు ఓటమిని బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు గైడెన్స్ కోసం టీడీపీ వైపుకు చూస్తోంది. బహుశా ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న సంగతి బీఆర్ఎస్ కు గుర్తు వచ్చి ఉండొచ్చు. అప్పట్లో ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ గా ఉండేది…
కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఒక వైపు చంద్రబాబును పొగుడుతున్నారు. మరో వైపు టీడీపీ మూలాలున్న నేతలను హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారు.. ఇదీ రాజకీయ అవసరమే అనుకోవాలి…
బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..అనూహ్యంగా చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. ఏపీ సీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తారని, తాను కేవలం 12 గంటలు పనిచేస్తానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇకపై తాను, తమ రాష్ట్ర అధికారులు 18 గంటలు పనిచేస్తామని ఆయన చెప్పడం ద్వారా టీడీపీ అభిమానులను బుట్టలో వేసుకున్నట్లయ్యింది, ఇటీవలే ఆయన టీడీపీలో రాజకీయంగా పుట్టి చాన్నాళ్ల క్రితం బీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పారు. ఎన్నికల ముందు నిజామాబాద్ జిల్లాకే చెందిన మండవ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ కండువా కప్పారు. ఇదంతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకేనని చెప్పాలి. అక్కడ సెటిలర్లు అధిక సంఖ్యలో ఉంటారు. వారిలో 90 శాతం మంది టీడీపీ సానుభూతిపరులని చెప్పుకోవాలి…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ కనిపించకపోయినా రాష్ట్రంలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తోంది. టీడీపీ కేడర్ ను తమ వైపుకు లాక్కోవాలని రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…