తెలంగాణాలో రాష్ట్రపతి పాలన

By KTV Telugu On 5 April, 2023
image

అందరూ అనుకుంటోన్నట్లు ఈ ఏడాది చివర్లో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవా నిర్ణీత గడువు ముసిగిన తర్వాత తెలంగాణాలో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందా బిజెపి నేత టి.జి.వెంకటేష్ చెబుతోన్నదాన్ని బట్టి ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణాలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. డిసెంబరు 11న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది డిసెంబరు 10 తో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. అంటే రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆ లోపే ఎన్నికలు జరిగి డిసెంబరు 7 లోగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. ఆ లెక్కన ఈ ఏడాది డిసెంబరు మొదటి వారంలోపే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల కోసమే బి.ఆర్.ఎస్. కాంగ్రెస్ బిజెపిలు హోరా హోరీ పోరాటానికి సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా అప్పుడే నగారా మోగినట్లు మూడు రాజకీయ పార్టీలూ ఎత్తులు పైఎత్తులతో సందడి చేస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. కామ్రేడ్లు అయితే ఎవరితో పొత్తు పెట్టుకోవాలా అని తర్జన భర్జనలు పడుతున్నారు. విజయం తమదే నంటే తమదే అంటూ కాంగ్రెస్ బిజెపిలో పోటాను పోటీగా ధీమాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ లో అయితే కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కూడా ఊహించేసుకుంటున్నారు.

అందరూ ఇంత బిజీగా ఉన్న తరుణంలో బిజెపిలో ఉన్న మాజీ టిడిపి ఎంపీ టి.జి.వెంకటేష్ ఓ బాంబు పేల్చారు. ఆయన చాలా కాలం తర్వాత మీడియా ముందు ప్రత్యక్షమై తెలంగాణాలో వచ్చే డిసెంబరులో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు లేవన్నారు. అదేంటి సార్ అని మీడియా వాళ్లు ఆశ్చర్యంగా అడిగితే ఆయన అంతే నిర్వికారంగా ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిసిన వెంటనే తెలంగాణాలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంత పెద్ద కబురు అంత కూల్ గా చెప్పారేంటని మీడియా వాళ్లు వెర్రిమొగాలేసి చూసే సరికి టి.జి.వెంకటేష్ ఏ మాత్రం ఎక్స్ ప్రెషన్స్ బయటకు కనపడనీయకుండా అవును 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికలతో పాటు తెలంగాణాకు కూడా ఎన్నికలు జరగచ్చు అన్నారు. రాష్ట్రపతి పాలన ఎందుకండీ సారూ అంటే అప్పుడు కేసీయార్ గత ఎన్నికలను ముందస్తుకు తీసుకు వచ్చిన ఘట్టాన్ని రివైండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎన్నికలు జరిగాయి. ఆ లెక్కన తర్వాతి ఎన్నికలు 2019 లో జరగాల్సి ఉన్నాయి. కానీ తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీయార్ మాత్రం ఆరు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కేసీయార్ అలా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల తెలంగాణాకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి రావడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసరంగా కోట్లాది రూపాయల భారం పడిందని వెంకటేష్ అంటున్నారు. అందుకే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణా ఎన్నికలను తిరిగి 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహిస్తే మరోసారి తెలంగాణా ఒక్క రాష్ట్రానికీ ఎన్నికలకోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఎన్నికల సంఘం ఆలోచిస్తోందని వెంకటేష్ అంటున్నారు. ఆ లోపు తెలంగాణాలో ప్రభుత్వం లేకుండా ఉంటే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెడతారన్నది ఆయన వాదన. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కొంత కాలంగా కేంద్రంలోని బిజెపి నినాదం ఇస్తోన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలతో పాటే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ఆలోచన దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది బిజెపి. జమిలి ఎన్నికలు జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బిజెపి వాదిస్తోంది. లేదంటే ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నామని కమలనాధులు అంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎంత సేపూ ఎన్నికల రాజకీయాలపైనే దృష్టి సారించాల్సి వస్తోందని బిజెపి అంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో అయిదేళ్లకు ఒక సారి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది తమ ఆలోచనగా వారు చెబుతున్నారు.

జమిలి ఎన్నికలు అమలు చేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే బెంగాల్ లో ఎన్నికలు జరిగి రెండేళ్లు అవుతోంది. ఏపీలో ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తయ్యింది కాబట్టి 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందులు ఉండవు. కానీ అదే 2024 ఎన్నికలతో పాటు బెంగాల్ బిహార్ తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం కుదరదు. అంతెందుకు గుజరాత్ కు కొద్ది నెలల క్రితమే ఎన్నికలు జరిగాయి . మళ్లీ అయిదేళ్ల తర్వాతనే గుజరాత్ ఎన్నికలు సిద్దమవుతుంది. అంచేత జమిలి ఎన్నికలు ఆచరణలో సాధ్యం కాకపోవచ్చునంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. తెలంగాణాలో బిజెపి బలం ఆ పార్టీ నేతలు ఊహించినంత బలంగా లేదు. కొద్ది నెలల క్రితం కొన్ని ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు, గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి సత్తా చాటిన సమయంలో తెలంగాణాలో ఇక మనకి తిరుగులేదని కమలనాధులు ధీమాకి వచ్చారు. తెలంగాణాలో బి.ఆర్.ఎస్. కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని తమకి తాము చెప్పుకున్నారు. ఆ హైప్ ను కొనసాగించడానికే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు. దానికోసం నరేంద్ర మోదీ అమిత్ షాలతో పాటు దేశం నలుమూలల నుండి బిజెపి సీనియర్లు తరలి వచ్చారు. ఆ హడావిడి అంతా చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బిజెపియే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనిపించేలా బిజెపి నేతలు హల్ చల్ చేశారు.

అయితే రోజులు గడిచే కొద్ది తాము ఊహించింది నిజంగా నిజం కాదని తేలడానికి వారికి ఎక్కువ కాలం అవసరం లేకపోయింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బిజెపిలో చేర్చుకుని మునుగోడులో సత్తా చాటాలని అనుకున్నా అది వర్కవుట్ కాలేదు. దీంతో బిజెపి అగ్రనేతలు ఆలోచనలో పడ్డారంటున్నారు. ఇదే సమయంలో చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. తెలంగాణా అంతటా కాంగ్రెస్ నేతల యాత్రలకు సభలకు తిరుగులేని స్పందన లభిస్తోంది. ఈ ఊపును చూసిన బిజెపి నేతలు బహుశా ఎన్నికలను ఆలస్యం చేస్తేనే బెటరని భావించి ఉండచ్చని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్ది ప్రస్తుత పాలక పక్షంపై వ్యతిరేకత పెరుగుతుంది. పైగా రాష్ట్ర పతి పాలనలో ఎన్నికలు జరిగితే పాలక పక్షానికి ఎలాంటి అడ్వాంటేజీలు ఉండవు. చాలా సమయం ఉంటుంది కాబట్టి అప్పటికి బిజెపిని కూడా బలోపేతం చేసుకోవచ్చునన్నది కమలనాధుల వ్యూహంగా చెబుతున్నారు. ఈ కారణం చేతనే తెలంగాణాలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరక్కపోవచ్చునని టి.జి.వెంకటేష్ చెప్పి ఉంటారని వారు భావిస్తున్నారు. అయితే టి.జి.వెంకటేష్ మాటలను మాత్రమే పట్టుకుని ఓ అంచనాకు రావడంలో అర్ధం లేదని మరి కొందరు అంటున్నారు. ఎన్నికలు కచ్చితంగా షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర పతి పాలన విధించే పరిస్థితులు తెలంగాణాలో లేవని బి.ఆర్.ఎస్. నేతలు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.