దటీజ్ రేవంత్

By KTV Telugu On 12 December, 2023
image

KTV TELUGU :-

రేవంత్ రెడ్డి  పదవీ బాధ్యతలు చేపట్టి వారం రోజులు కూడా కాలేదు. కానీ ఆయనపై ప్రజలు పెట్టుకున్న అపోహలన్నీ  తేల్చేస్తున్నారు. కేసీఆర్ గత పదేళ్లుగా ఆయనను టార్గెట్ చేసిన వైనం చూసి అధికారంలోకి వస్తే..  ఆంధ్ర తరహాలో ప్రతీకార రాజకీయాలు ఉంటాయని అనుకున్నారు. ఏపీలా అవుతుందని కొంత మంది ఆందోళన చెందారు. కానీ.. కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తున్న వైనం చూసి ప్రతిపక్ష నేతగా రేవంత్ వేరు… ముఖ్యమంత్రిగా రేవంత్ వేరు అన్న అభిప్రాయానికి వస్తున్నారు.   రేవంత్ ఇమేజ్ మేకోవర్  మారిపోతోంది.

పగ, ప్రతీకారాలే పాలన అనుకునేవారు అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో  ఆంధ్రప్రదేశ్ కళ్ల ముందే కనిపిస్తోంది.  అంతకు ముందు ఐదేళ్లలో అక్కడి ప్రభుత్వం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడం కాకుండా మరో యాభై ఏళ్ల పాటు కోలుకోకుండా అప్పులు చేసి.. కనీసం రోడ్లు కూడా వేయకుండా…   సంక్షేమం పేరుతో ప్రజల్ని పేదల్ని చేసి ప్రభుత్వంపై ఆధారపడేవారిలా  మార్చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా ఉంది.  రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ కూడా అలాగే అవుతుందని కొంత మంది భయపెట్టారు.  భయపెట్టాలని చూశారు. అయినా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ అందరి భయాలను పటాపంచలు చేశారు రేవంత్ రెడ్డి.

నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్ రెడ్డి  ట్రాప్ కెమెరాలకు దొరికినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన చాలెంజ్ వైరల్ అయింది. కేసీఆర్ అంతు చూస్తానని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ఎన్ని సార్లు అరెస్టు చేశారో లెక్కే లేదు. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసినందుకు తనను డిటెన్షన్ సెంటర్‌లో పెట్టారని రేవంత్ రెడ్డి ఇంటర్యూల్లో చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. కుటుంబం మొత్తానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు.   రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కష్టాలకు ఆయనకు అంత కసి ఉండటం సహజమేనని అధికారంలోకి వస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి  అందరి అంచనాలను తారుమారు చేశారు.  ముఖ్యంగా కేసీఆర్ బాత్ రూంలో జారిపడి గాయపడిన ఘటన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ తీసుకున్న చొరవ ఆయనలోని కొత్త నేతను ప్రజల ముందు ఆవిష్కరించింది. ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారిని  ప్రత్యేకంగా వైద్య సాయం కోసం నియమించారు. ఆదివారం తానే స్వయంగా వెళ్లి పరామర్శించారు.

రేవంత్ రెడ్డి వైపు నుంచి ఇలాంటి ప్రతి స్పందన వస్తుందని ప్రజలు ఊహించలేదు. కేసీఆర్ పై తనకు ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవన్నట్లుగా ఆయన సాదాసీదాగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.  అధికార పార్టీ నేతగా ముఖ్యమంత్రిగా ఆయన త్వరగా విలువల్ని వంట బట్టించుకున్నారని ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్ష నేత గాయపడితే నేరుగా వెళ్లి పరామర్శిచారు. అవునన్నా.. కాదన్న ఆయన తెలంగాణకు పదేళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారు.  తెలంగాణ చరిత్రలో కేసీఆర్ కు ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. తన విషయంలో వ్యవహరించిన విధానంపై వ్యక్తిగతంగా కోపం ఉన్నా ప్రభుత్వాధినేతగా మాత్రం రేవంత్ రెడ్డి తన హుందాను కాపాడారు. ఆయనపై ప్రజలు వేసుకున్న అంచనాలను తారుమారు చేశారు.

నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష సాధింపు చర్యలకు వెంటనే పాల్పడి ఉంటే…  మైనస్ అయ్యేది. కేసీఆర్ ఫ్యామిలీకి సానుభూతి పెరిగేది. అందులో సందేహమే ఉండదు.  రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని అనుకోవడం రాజకీయ అమాయకత్వం. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఏం చేసినా రేపు వారిలో సగమైనా జేజేలు కొట్టకపోతారా అని ప్రజా కంటక పనులు ఈవీఎం చేస్తే.. బటన్ నొక్కి ఇంటికి పంపేస్తారు. ఆ మార్పు రావడానికి ఏళ్లు ..పూళ్లు అక్కర్లేదు. కొంత సమయం చాలు. రాజకీయాల్లో ఈ కొంత సమయం ఒక రోజా.. ఒక నెలా.. ఒక ఏడాది అనేది చెప్పలేం. అది ఒక నిమిషం కూడా కావొచ్చు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ముఖ్యమంత్రిగా అధికారం తలకెక్కించుకోక ముందే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పసిగట్టారని అనుకోవచ్చు.

రేవంత్ రెడ్డి హంబుల్ నెస్ చూసి ఇక కేసీఆర్, కేటీఆర్  అందరూ సేఫ్ అయ్యారని అనుకోవడానికి లేదు. ప్రభుత్వ పరంగా జరిగిన అవినీతిని ఆయన సమయానుకూలంగా బయట పెడతారని ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి … అవినీతిపై కేసులు , అరెస్టులు అనే అంశాల కన్నా ముందు ప్రజల ముందు నిజాలు ఉంచాలనుకుంటున్నారని అనుకోవచ్చు.  గత ప్రభుత్వం దాచి పెట్టిన వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలలనుకుంటున్నారు.    ఇప్పటికే  2014 నుంచి ఇప్పటివరకు జరిగిన నిధుల కేటాయింపు, విద్యుత్‌ శాఖలోని  85 వేల కోట్ల అప్పుల గురించి బయటకు వెల్లడించారు.  దీనిపై  శాసనసభ సమావేశాల్లో పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ పరిస్థితి చెప్పాలని అనుకుంటున్నారు.  తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిదిమేశారని..  అందుకే ఆ విషయంలోనూ ప్రజల ముందు పూర్తి వివరాలు ఉంచాలనుకుంటున్నారు.   ప్రజలు కట్టే పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలా వినియోగించిందనే విషయమాన్ని వెల్లడించనున్నారు.

ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో  ముందుకెళ్లి ఆభాసుపాలయ్యే కంటే, ఆచితూచి అడుగులేస్తూ అవినీతిని బయటపెట్టాలనుకుంటున్నారని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.   విద్యుత్‌ వ్యవహారంలో సమీక్ష సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పిలిచినా రాలేదు. తనను పిలవలేదంటున్నారు.    బీఆర్‌ఎస్‌ పతనానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణం.  కాగ్‌ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1.26 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. అయినా పనులు నాణ్యంగా జరగలేదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటే ఇందుకు నిదర్శనం.  దీనికోసం ఖర్చుపెట్టిన వ్యయంలో కనీసం 30 నుంచి 40 శాతం నిధులు అవినీతేనని భావిస్తున్నారు.  మాజీ ముఖ్యమంత్రిపై ప్రతికారంతో కాకుండా విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కోణంలో  నిజాలను ప్రజల ముందు ఉంచనున్నారు.

నిజానికి దూకుడుగా వెళ్లడం కంటే ప్రజల ముందు ఇంత అవినీతి జరిగింది అని వివరాలను ఉంచడమే అసలు ప్రతీకారం తీర్చుకున్నట్లు. అంతే కాదు.. రేవంత్ రెడ్డి తమపై జాలి చూపిస్తున్నారన్న ఓ భావన కూడా కేసీఆర్ ఫ్యామిలీని వెంటాడేలా చేస్తుంది. తాము ఎంతో వేధించిన వ్యక్తి ఇప్పుడు  పదవిలో ఉండి కూడా తమను క్షమించేశారని లేదా.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదని.. అనిపిస్తే.. అది మానసికంగా కూడా ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. రేవంత్ రెడ్డి ఇలా ఆలోచిస్తున్నారో లేదో కానీ ఆయన ఇమేజ్ మాత్రం ప్రజల్లో అంతకంతకూ పెరుగుతోంది.

అధికారం అనే మత్తు ఆవహించిన వారికి.. తాము కరెక్టే చేస్తున్నామని ఎదుటి వారు చేసేది మాత్రమే తప్పు అని అనిపిస్తుంది. దాన్నే అధికార మత్తు కళ్లను కప్పేయడం అంటారు. ఇది ఎప్పుడు దిగుతుందంటే… అధికారం పోయాకే దిగుతుంది. అప్పటి వరకూ… ఎవర్నీ లెక్క చేయరు.. ఎలాంటి పరిణామాల్నీ పట్టించుకోరు.  అలాంటి మత్తు తనకు ఎక్కకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు. ఇది ఆయనకు మేలు చేస్తుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి