భారత రాష్ట్ర సమితితో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దూసుకుపోతారా ? గులాబీ దళపతి సహేతుకంగా ఆలోచించారా ? మొండిధైర్యంతో ముందుకెళ్తున్నారా ? బీఆర్ఎస్ సత్తా చాటుతుందా ? కొత్త సీసాలో పాత సారా అవుతుందా ?
బీఆర్ఎస్ పార్టీని గుర్తించిన ఈసీ
సంబరాల్లో గులాబీ శ్రేణులు
ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం
బీజేపీ ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం
2024 నాటికి బీజేపీని గద్దె దించడమే లక్ష్యం
తెలంగాణ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రచారం
ఉత్తరాది ప్రజలకు దళితబంధు వరమవుతుందంటున్న కేసీఆర్
టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుకున్న పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నంగా విశ్వసనీయత కోసం భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో ఆయన వేసిన తొలి అడుగు సక్సెస్ అయ్యింది. ఇకపై గులాబీ పార్టీ దూడుకు వేరుగా ఉంటుంది. పార్టీ ప్రచారం కోసం, ఢిల్లీలో ఉనికి కోసం రాజధానిలో ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని సిద్ధం చేస్తున్నారు. సొంత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం నుంచే పనిచేస్తుంది. ఢిల్లీలో ఎవరు పనిచేయాలో కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసేశారు. ఇకపై ఢిల్లీ ప్రతినిధులు వేగం పెంచాలని, భావసారుప్య పార్టీలతో నిత్యం టచ్ లో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇప్పుడున్న జాతీయ పార్టీల ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ ను స్థాపించారనుకోవాలి. నిజానికి కేసీఆర్ ప్రాంతీయ వాది. ఆ ప్రాంతీయ వాద నినాదం నుంచే ఆయనలో జాతీయవాదం పుట్టిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలను అణిచివేస్తున్న తీరు ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేందుకు కమలం ప్రయత్నాలు చూసి విసిగిపోయిన తెలంగాణ సీఎం జాతీయ పార్టీ దిశగా అడుగులు వేశారు. ఎవరికో భయపడుతూ బతికే కంటే మన పార్టీనే విస్తరిస్తే సరిపోతుందన్న ఆలోచనతో ఆయన బీఆర్ఎస్ కు బీజం వేశారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ ,బిహార్లోని ఆర్జేడీ, జేడీయూ, పశ్చిమ బెంగాల్ ను పాలింటే తృణమూల్, ఒడిశాలోని బిజు జనతాదళ్ ప్రాంతీయ పార్టీల స్థాయి నుంచి జాతీయ పార్టీలుగా ఎదగలేకపోతున్నాయని కేసీయార్ గుర్తించారు. అందుకే మోదీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆయన దూకుడుకు కళ్లెం వేయగలిగేది తానొక్కడేనని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల హక్కుల పోరాటానికి కూడా జాతీయ పార్టీ అవసరమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.
తాజా పరిణామాలు కూడా కేసీఆర్ కు కలిసొచ్చాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. గుజరాత్లో గెలవడానికి మోదీ ప్రకటించిన లక్షా 37 వేల కోట్ల ప్రాజెక్టులేనని కేసీఆర్ పార్టీ వాదిస్తోంది. అది ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. దానితో మోదీ ప్రభ మసకబారే టైమ్ వచ్చిందని 2024 నాటికి బీజేపీని గద్దె దించడం సులభమేనని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు కొన్ని పార్టీల నుంచి కొందరు నేతల వైపు నుంచి మద్దతు లభించింది. జెడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడు ఎంపీ తిరుమావలవన్ గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింహ్ వాఘేలా సంఘీభావం ప్రకటించారు. రెండు నెలల క్రితం పార్టీని ప్రకటించినప్పటి నుంచి కొందరు నేతలు ఫోన్లు చేసి మద్దతు తెలుపుతున్నారు.
ఇల్లు అలగ్గానే పండుగ కాదు పార్టీ పెట్టగానే అధికారం రాదు. సుదూర తీరంలో ఉన్న గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. భావసారుప్యత ఉన్న పార్టీలను తనతో చేతులు కలిపేందుకు ఒప్పించాలి. ఓటర్లలో విశ్వాసం కల్పించాలి. ఒక్క తెలంగాణ రాష్ట్రం కాకుండా మిగిలిన 28 రాష్ట్రాల్లో కూడా కేసిఆర్ ను స్వాగతించాలి. కేసిఆర్ పెట్టబోతున్న కొత్త జాతీయ పార్టీ అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిరూపించాలి. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న డిఎంకే కాంగ్రెస్తో పొత్తులో ఉంది. ఆ పార్టీ టీఆర్ఎస్లో కలిసే అవకాశం లేదు. అన్నాడిఎంకే సొంతపార్టీలోనే అనేక లుకలుకలు. ప్రస్తుతం ఆపార్టీ బీజేపీ జట్టులోనే ఉంది. అంటే తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా సొంత బలం మీద బీఆర్ఎస్ ముందుకు సాగాలి.
కర్ణాటకలో కేసీఆర్ పార్టీతో చేతులు కలిపేందుకు జేడీఎస్ ఒప్పుకోవాలి. పార్టీ ప్రారంభించిన రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినంత మాత్రాన సమర్థిస్తారన్న నమ్మకం లేదు. దేశంలో అన్ని చోట్ల ఉనికిని కోల్పోతున్న లెఫ్ట్ పార్టీలు కేరళలో మాత్రమే బలంగా ఉన్నాయి. అక్కడ కేసీఆర్ కు బలాన్నిచ్చేందుకు ఆ పార్టీలు ఎందుకు ప్రయత్నిస్తాయి. మహారాష్ట్రలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలైన శివసేన, ఎన్సీపీ ఇప్పటికే తమ తమ ఉనికిని చాటుకునేందుకు మరింత ప్రయత్నం చేస్తున్నాయి. మరి మహారాష్ట్రాలో కేసిఆర్ జాతీయపార్టీని ఆ రెండు పార్టీలు ఆహ్వానిస్తాయా? ప్రస్తుత పరిస్థితుల్లో లేదనే చెప్పుకోవాలి. ఒడిశా నేత నవీన్ పట్నాయక్ ఎప్పుడూ కేసీఆర్ ను పట్టించుకున్నది లేదు. ఇక్కడ ఉత్తరాదిలో ప్రాంతీయశక్తులతో పాటు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్న దాఖలాలు లేవు. అయినా కేసీఆర్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.
కేసీఆర్ రూటు వేరు. అది సంక్షేమం రూటు. సంక్షేమ పథకాలతో పాటు డబ్బులు కుమ్మరించడం ద్వారా జనాన్ని తన వైపుకు తిప్పుకోగలమని ఆయన విశ్వాసం. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు లాంటి పథకాలకు విస్తృత ప్రాచుర్యమిస్తే ఉత్తరాది పేద, దిగువ మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే వీలుందని ఆయన విశ్వాసం. ఉత్తర ప్రదేశ్, బిహార్లో పేదరికం ఎక్కువగా ఉంది. ఓబీసీలు, దళితులు తిండికి లేక, ఉపాధి అవకాశాలు దొరక్క వలసపోతున్నారు. అలాంటి వారిని తన పథకాల ప్రకటనలతో ఆకట్టుకోగలనని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ మినహా ఎక్కడా దళితబంధు లాంటి పథకం లేదని చెబుతున్నారు. అలాంటి పథకం ఒకటి ప్లాన్ చేస్తే ఏకమొత్తంగా తనకు ఓట్లు వస్తాయని కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు. దానికి తోడు ఉత్తరాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీల పట్ల జనం విసుగు చెందారు. వాళ్లు అరాచకవాదులుగా మారిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే గత్యంతరం లేక జనం బీజేపీకి ఓటేస్తున్నారు. ఆ రాజకీయ శూన్యతను వాడుకుంటే గెలుపు సులభమేనని కేసీఆర్ కు ఒక నమ్మకం.
అసెంబ్లీ ఎన్నికలు త్వరగా పూర్తి చేస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లొచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తుండొచ్చు. 2024 లోక్ సభ ఎన్నికలకు కొంత టైమ్ ఉన్నందున ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ తమ విధానాలను ప్రచారం చేసుకోవచ్చనుకుంటున్నారు. ఆలిండియా పార్టీగా తాము చేయబోయేదేమిటో జనానికి చెప్పబోతున్నారు. ఉత్తరాది రైతు నాయకులు తమకు మద్దతుగా ప్రచారానికి వస్తారని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. అందుకే రైతులకు ఏం చేయబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పాలి. మాటలకు చేష్టలకు పొంతన ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఏదైనా సాధ్యం.