మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారు.. దాదాపు పాతిక సంవత్సరాలు రాష్ట్రంలోనూ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన తుమ్మల ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారు. తన ప్రత్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత కూడా తుమ్మల ఎందుకు యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందా..ఇదో వ్యూహాత్మక ఎత్తుగడగా భావించారు.
కేసీఆర్ గేమ్ ప్లాన్ లో తుమ్మల భాగమయ్యారన్న చర్చ జరుగుతోంది. కొంతకాలం మౌనంగా ఉంటూ ఖమ్మం జిల్లా రాజకీయాలను గమనించాలని కేసీఆర్ సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. సిట్టింగులకు టికెట్లిస్తామని కేసీఆర్ ప్రకటన తుమ్మలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉండటంతో తాను చెప్పేంత వరకు ఎలాంటి నిర్ణయమూ ప్రకటించవద్దని తుమ్మలను కేసీఆర్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి దానితో ఇప్పుడు తుమ్మల గత్యంతరం లేక మౌనంగా ఉండిపోయారని చెబుతున్నారు. కేసీఆర్ ఏం చెబితే అదీ అన్నట్లుగా తుమ్మల తలూపుతున్నా….. రాజకీయ భవిష్యత్తుపై ఆయనకు బెంగ పట్టుకుందని అనుచరులు అంటున్నారు..
తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేచర్ ఉన్న నాయకుడు. ఆయన వస్తున్నారంటే వందల మంది ఎదురు చూసేంత పెద్ద లీడర్. జనంలో ఉంటూ జనానికి మంచి చేయాలనుకునే నాయకుడాయన. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో టీడీపికంటూ ఒక స్థాయిని, స్థానాన్ని సంపాదించిపెట్టన నేత కూడా ఆయనే. అలాంటి తుమ్మల వరుస ఓటములతో కొంత వెనక్కి తగ్గారు. రాజకీయ చౌరస్తాలో నిలబడి ఎటు వెళితే మంచి రూటు అవుతుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ప్రస్తావించాల్సింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లోనే ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు అనతి కాలంలోనే జిల్లాలో ప్రభావవంతమైన లీడర్‌గా ఎదిగారు. వామపక్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలోనూ తనదైన శైలిలో రాజకీయాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి పట్టు దక్కేలా చేశారు.
పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. చిన్నవయసులోనే మంత్రి అయిన వారిలో ఆయన కూడా ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు గులాబీ పార్టీలో చేరారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా లేని తుమ్మల నాగేశ్వరరావును ఏకంగా మంత్రిని చేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలో కొనసాగేలా చూసుకున్నారు. కానీ, 2016లో పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఖాళీ అయిన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. 2018 వరకు మంత్రిగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు.. అదే సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే మళ్లీ పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. దాంతో తుమ్మల నాగేశ్వరరావు హవా ఆ నియోజకవర్గంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది.
ఏడాదికాలంగా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడం మినహా ఆయన చేస్తున్నదేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని చెబుతున్నప్పటికీ ఆ పని సాధ్యమా అన్న అనుమానాలు తుమ్మల అనుచరుల్లో కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తుమ్మల వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరని సన్నిహితులే అంటున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాట నిజమే అయితే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. నిజానికి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనను పనిగట్టుకుని ఓడించారని తుమ్మల ఆవేదన చెందారు. అదే సంగతిని సీఎం కేసీఆర్ కు కూడా చెప్పారు. వ్యక్తిగతంగా కేసీఆర్ కు మిత్రుడైన తుమ్మలను ఏదో విధంగా అకామడేట్ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నది నిజం. ఆ సంగతి తెలిసే తుమ్మల మౌనంగా ఉన్నారని లేకపోతే మళ్లీ టీడీపీలోకో, బీజేపీలోకో వెళ్లిపోయేవారని కొందరి వాదన.
సిట్టింగులందరికీ టికెట్ ఒట్టిమాటేనని ఒక వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే తుమ్మలకు పాలేరు టికెట్ ఖాయం. పైగా వైఎస్సార్టీపీ నేత షర్మిల కూడా పాలేరులో పోటీ చేసే విషయంపై పునరాలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దానితో తుమ్మల గెలుపు కూడా సులభమే అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. లేనిపక్షంలో 2014 నాటి పాత ఫార్ములా ఒకటి ఉండనే ఉంది. తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉంది. ఏమో ఏమైనా జరగొచ్చు. గుర్రం ఎగరా వచ్చు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..