గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించి డబ్బులు దండుకున్న వారు శ్రీకృష్ణజన్మస్థానంలో సెటిలైపోవడం ఖాయమని తేలిపోయింది. ఎవరెంత బొక్కారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దీనితో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ దిశగా తొలి దశలో నలుగురిని అరెస్టు చేసింది…
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వివిధ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తుండగా.. గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించి కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు.పథకం పూర్వాపరాలు పరిశీలిస్తే 12 వేల కోట్ల బడ్జెట్‌తో 2017 జూన్ 20న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకం ప్రారంభమైంది. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు గాను లక్షా 25 వేల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను లక్షా 75 వేల రూపాయలకు పెంచారు. అందులో లక్షా 31 వేల 250 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించగా… మిగిలిన సొమ్ము 43 వేల 750 రూపాయలు లబ్ధిదారులు భరించాలని అప్పట్లో రూలు పెట్టారు. ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తూ మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు ఐదు వేలు ఇన్సూరెన్స్ ఇచ్చింది. పొట్టేలుకు ఏడువేల ఇన్సూరెన్స్ అందించింది. గొర్రెలు చనిపోయిన 10 రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు..
గొర్రెల పథకంలో అవినీతి తవ్వేకొద్దీ బయటకు వచ్చింది. ప్రభుత్వ సొమ్మును తినేసేందుకు కనిపించిన ప్రతీ అడ్డదారి తొక్కారు. డబ్బులు ఎలా తినెయ్యెచ్చో ఈ పథకం మంచి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు.
ఇప్పటికి అరెస్ట్ అయిన నలుగురు అధికారులు… ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాళ్లోకి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మల్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.. దీంతో… ఈ వ్యవహారానికి సంబంధించి అవినీతి శాఖ అధికారులు తవ్వే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ రవాణా ఇన్వాయ్యిస్ లు, నకిలీ ట్యాగ్ లు, మరణించినవారికి సైతం గొర్రెలు పంపిణీ చేసినట్లు చూపించారని కాగ్ నివేదికలోనూ, తర్వాత జరిగిన దర్యాప్తులోనూ వెల్లడైంది. ట్రాలీతో ఉన్న వాహనంలో తరలించాల్సిన గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్ లలో సైతం తీసుకువచ్చినట్లు లెక్కలు చూపించారు. ఇదే సమయంలో గొర్రెలను కొనకుండానే కొన్నట్లు లెక్కలు చూపించారు ఇదే సమయంలో ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్ లతో సుమారు 68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ గుర్తించింది. . గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే తరలించినట్లుగా ఏదో ఒక వాహనం నెంబరు వేసి డబ్బులు తినేశారు.
స్కాంలో పాత్రధారులుగా ప్రస్తుతానికి నలుగురు అధికారులను అరెస్టు చేశారు. అందులో భాగస్వాములు చాలా మందే ఉన్నారని ఏసీబీ గుర్తించింది. దశలవారీగా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తారని చెబుతున్నారు. ఈ పాత్రధారుల వెనుక సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మరి స్కాం విచారణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…