టార్గెట్ హరీష్ రావు ! ఎందుకో..?

By KTV Telugu On 30 June, 2024
image

KTV TELUGU :-

వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలన్నది  పాత సామెత. ఇప్పుడు కూడా నేరుగా, నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్లు ఇదే సూత్రాన్ని పాటిస్తారు. కొడితే సమ ఉజ్జీనే కొట్టాలి.  ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని  వాళ్లు డిసైడైపోతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తీరు ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. ప్రత్యర్థుల్లో అందరి పనైపోయిందని, ఇక మిగిలినదీ తనతో సమానంగా పోటీ పడే హరీష్ రావు మాత్రమేనని ఆయన భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా హరీష్ రావును ఆయన టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు కూడా అలాంటి ఆదేశాలే వెళ్లినట్లుగా  చెబుతున్నారు….

ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ అధికారంలో ఉండటం, సీఎం సహా పలువురు నేతలు తరచూ   ఢిల్లీ వెళ్లడంతో ఎక్కువ స్టేట్ మెంట్లు హస్తిన నుంచి వస్తున్నాయి. ఎవరి మీద విరుచుకుపడాలన్నా కాంగ్రెస్  నేతలు ఢిల్లీలోనే స్టేట్  మెంట్స్ ఇచ్చే పరిస్తితి ఉంది. ఈ క్రమంలోనే ఒక  ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కావాలనేదే మాజీ మంత్రి హరీష్ రావు కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపించారు.  హరీష్ రావు ట్రాప్‌లో కేసీఆర్ ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కష్టమన్నారు. కేసీఆర్ పొలిటికల్‌గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకుని పోరాడారన్నారు. కోర్ ఏరియాను వదలలేదని తెలిపారు. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఆ పని చేయడం లేదన్నారు.హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ బతుకుతుందన్నారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారని.. అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు. హరీష్ రావు ఎప్పుడూ ఏదో సంక్షోభాన్ని సృష్టించి తనకు అనుకూలంగా ఆ ఇష్యూను మలుచుకుంటారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాకపోతే హరీష్ రావే మాట్లాడతారని.. అందుకే హరీష్ వ్యూహ్యాత్మంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ కుటుంబానికి హరీష్ కు మధ్య విభేదాలు సృష్టించడమే రేవంత్ ఉద్దేశం కావచ్చు. హరీష్ ను కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన  నాయకుడిగా  పరిగణించడమే ఇందుకు కారణం కావచ్చు. హరీష్ ను దెబ్బకొట్టగలిగితే బీఆర్ఎస్ ను పడుకోబెట్టడం కష్టమేమీ కాదన్న ఫీలింగుతో కాంగ్రెస్  తెలంగాణ పెద్దలు పావులు కదుపుతూ ఉండొచ్చు….

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావు స్పెషల్ టార్గెట్ గా ఉండేవారు. ఉమ్మడి మెదక్ జిల్లా నేత జగ్గారెడ్డి నిత్యం హరీష్ పై విరుచుకుపడుతూ ఉండేవారు. మంత్రి అయిన హరీష్  అవినీతికి కేరాఫ్  అడ్రెస్ గా మారారని, కాంగ్రెస్ పార్టీని  ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారని అంటుండేవారు. అక్రమ సంపాదనలో హరీష్ నెంబర్ వన్ అని కూడా జగ్గా రెడ్డి ఆరోపిస్తుండేవారు. రాష్ట్రంలో అధికారం మారి కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కువ విమర్శించినదీ హరీష్ రావేనని చెప్పాలి. అసెంబ్లీలోనూ, బయట  కాంగ్రెస్ ను ఎవరైనా  ఉతికి ఆరేశారంటే అదీ హరీష్ రావే అవుతారు. కాంగ్రెస్ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఆయన నిలదీస్తుంటారు. రైతు రుణమాఫీతో పాటు అన్ని హామీలను ఆగస్టు 31లోగా అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేసేందుకు కూడా సిద్ధమని హరీష్ రావు సవాలు చేయడంతో కాంగ్రెస్ కొంత ఇరాకాటంలో పడిన మాట వాస్తవం. పైగా తను మాటమీద నిలబడటం ఖాయమని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేతలంతా మూకుమమ్మడి ఎదురుదాడి చేసినా హరీష్ రావు వెనుకంజ వేయలేదు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలోనే హరీష్ ను రేవంత్  రెడ్డి  టార్గెట్ చేశారనుకోవాలి…

కేటీఆర్ అసమర్థుడని, ఆయన డమ్మీ అని రేవంత్  రెడ్డి నిత్యం ఆరోపిస్తుంటారు. ఏదైనా సరే హరీష్ రావే సమర్థుడని, ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీకి ముప్పు పొంచి ఉందని ఆయన అనుమానిస్తుంటారు. అందుకే మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ వారికి టార్గెట్ అవుతున్నారు.  పైగా మాటకు మాట ద్వారా కొంత  డైవర్షన్ కు కూడా అవకాశం ఉంటుంది.  రాజకీయాల్లో కావాల్సింది కూడా అదే కదా…..