అవిశ్వాస అస్త్రం

By KTV Telugu On 28 July, 2023
image

ktv telugu;- ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై  విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. కాంగ్రెస్ తో పాటు బి.ఆర్.ఎస్. కూడా తీర్మానానికి నోటీసులు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్  రెండున్నర నెలలుగా భగ్గుమంటూనే ఉంది. దానిపై ప్రధాని ఇంత వరకు నోరు మెదపకపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ అంశంపైనే ప్రభుత్వ వివరణ కోరుతూ ప్రధాని దీనిపై మాట్లాడేలా చేయడం కోసమే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని సంధించాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమే అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అయినా ప్రభుత్వంపై దీన్నొక అస్త్రంగా మలుచుకున్నాయి విపక్షాలు

మణిపూర్ లో అశాంతి రాజ్యమేలుతోంది. అల్లర్లు హింసాయుత దాడులకు తెరతీస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఊరేగించే అకృత్యాలూ చోటు చేసుకున్నాయి. కుకీ- మైతేయ్ తెగల మధ్య మొదలైన పోరు రాష్ట్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకటీ రెండూ రోజులు కాదు రెండున్నర నెలలకు పైగా ఇక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. కోట్లాది రూపాయల ఆస్తులనూ ధ్వంసం చేశాయి అల్లరి మూకలు. ఇంత జరుగుతోంటే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

దీనికోసమే పార్లమెంటులో మోదీచేత మాట్లాడించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. లోక్ సభ లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు,తీర్మానానికి మద్దతుగా విపక్ష ఎంపీలు లేచి నిలబడ్డాయి. తీర్మానం ఆమోదించడానికి అవసరమైన బలం విపక్షాలకు ఉండడంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా  అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తో పాటు చర్చకు అనుమతించారు. అయితే అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత తీర్మానంపై  చర్చకు తేదీని ఖరారు చేసి ప్రకటిస్తామన్నారు స్పీకర్.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణా రాష్ట్రానికి చెందిన  భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా విడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై  బి.ఆర్.ఎస్. మిత్ర పక్షమైన మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ సంతకం చేశారు.

సాధారణంగా తీర్మానానికి నోటీసులు ఇచ్చిన తర్వాత 10 రోజుల లోపు ఎప్పుడైనా తీర్మానంపై చర్చకు తేదీని ఖరారు చేయాల్సి ఉంటుంది. అధికార, విపక్షాల సభ్యులకు ఆ పార్టీల బలాల ఆధారంగా చర్చపై ఎంత సేపు మాట్లాడ వచ్చో వ్యవధిని నిర్ణయిస్తారు. పాలక పక్ష నేతలు ముందుగా విపక్షాలు లేవనెత్తిన మణిపూర్ అంశంపై  మాట్లాడతారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. లేదంటే కొత్త ప్రశ్నలు సంధిస్తారు.

స్పీకర్  చర్చకు తేదీని ప్రకటించిన తర్వాత ముందుగా చర్చ జరుగుతుంది ఆ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఎక్కువ ఓట్లు వస్తే తీర్మానం నెగ్గినట్లు అవుతుంది. అపుడు ప్రభుత్వం కూలిపోతుంది.  అదే సమయంలో  తీర్మానానికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడితే తీర్మానం వీగిపోతుంది. అది ప్రభుత్వ విజయం అవుతుంది. ప్రస్తుతం పార్లమెంటులో బలా బలాను పరిశీలిస్తే  బిజెపి సారధ్యంలోని ఎన్డీయే కూటమికి  332మంది ఎంపీలు ఉన్నారు. అందు చేత ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు.తీర్మానానికి మద్దతు ఇస్తోన్న విపక్షాలకు 141 మంది ఎంపీల అండ ఉంది. వీళ్లంతా తీర్మానానికి మద్దతుగా ఓటు వేసినా  ఎన్డీయే ప్రభుత్వాన్ని కదపలేరు.

తీర్మానం  నెగ్గే అవకాశం లేకపోయినా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి కారణాలు లేకపోలేదు. ప్రజల తరపున వకాల్తా పుచ్చుకున్న విపక్షాలు  తమ వాణిని గట్టిగా వినిపించడంతో పాటు ప్రభుత్వం చేత వివరణ ఇప్పించుకోవాలని భావిస్తున్నాయి. మామూలుగా అయితే ఎంతగా డిమాండ్ చేసినా ప్రధాని మోదీ మణిపూర్ పై మాట్లాడ్డం లేదు. అందుకే బలవంతంగా అయినా  ఆయన చేత పార్లమెంటు సాక్షిగా మణిపూర్ ఘటనలపై  వివరణ ఇప్పించాలన్న లక్ష్యంతోనే అవిశ్వాస తీర్మానాన్ని ఓ అస్త్రంగా మలుచుకున్నాయి విపక్షాలు.

 

 

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి