బీజేపీకి లాస్ట్ బస్సూ మిస్ – మోదీ అలా ఎందుకు చేయలేదు…?

By KTV Telugu On 9 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ బీజేపీ పోయిన చోటే వెదుక్కునే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోతోంది. బండి సంజయ్ ను తప్పించి చేసిన చారిత్రక తప్పిదంతో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన బీజేపీ నాయకత్వం తప్పు దిద్దుకునేందుకు పక్కా వ్యూహాలు పాటిస్తున్నా…  అమలులో మాత్రం బస్ మిస్సవుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవసభలో ఆయన ప్రసంగం చూసినా అదే అర్థమవుతుంది.  బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని చాలా మంది ఊహించారు. అలా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో కదలిక వస్తుందని. ..  బండి సంజయ్ ను తప్పించిన అంశం పక్కకుపోతుందని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని సీఎంను చేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. అందుకు బీసీలంతా అత్మగౌరవ సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభకు వచ్చిన ఆయన  బీసీలకు చిరకాలం గుర్తుండిపోయే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. అమిత్ షా చేసిన ప్రకటననే మోడీ మళ్లీ చేశారు. కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి విషయంలో మోడీపై పెట్టుకున్న అంచనాలన్నీ తప్పాయి. బీజేపీ హైకమాండ్  ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా .. రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం  పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.  అభ్యర్థిని కూడా ప్రకటిస్తే…  రూట్ మ్యాప్‌లో ఓ కీలకమైన అడుగు వేసినట్లు అవుతుందని అనుకున్నారు. తెలంగాణ బీజేపీలో బీసీల్లో బలమైన నేతలు ఉన్నారు.  ఆరెస్సెస్ నుంచి ఎదిగి.. రాష్ట్ర స్థాయిలో  కేసీఆర్ తో ఢీ కొట్టే స్థాయికి ఎదిగిన బండి సంజయ్, అలాగే కేసీఆర్ సహచరునిగా ఉండి ఆయననే సవాల్ చేస్తున్న ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు.  అందుకే.. వీరిలో ఒకర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే.. ఎంతో మేలు జరుగుతుందన్న అంచనాలు వచ్చాయి.

భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణ విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉందన్నది  వారి నిర్ణయాలను బట్టి తెలుస్తూనే ఉంది. జనసేనతో పొత్తుల విషయంతో సహా ఇతర నిర్ణయాల  అన్నింటినీ కలిపి చూస్తే  ఏదో ప్లాన్ ఉందని ఎవరికైనా అనిపించకమానదు.  తెలంగాణలో మున్నూరు కాపు సామాజికవర్గం  బీసీల్లో ప్రధానమైన వర్గం.  బండి సంజయ్ అదే వర్గానికి చెందిన వారు. కారణం ఏదైనా బీఆర్ఎస్‌కు ఆ వర్గం వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది.  బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించడం వెనుక వారి మద్దతు ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. . ఇప్పుడు బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ వర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకుంటున్నారు.  అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో పొత్తు కలసి వస్తుందని అంచనా వేశారు.  ప్రధాని మోదీ హాజరు కాబోయే బీసీ ఆత్మగౌరవ సభ కు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. కానీ బండి సంజయ్‌కు మున్నూరు కాపు వర్గానికి నిరాశే ఎదురయింది.

బండి సంజయ్  ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఇంకా ఎదగలేదని భావిస్తే ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు.  బీజేపీ బీసీ సీనియర్ నేతల్లో  ఈటల రాజేందర్ మరో కీలకమైన నేత. బండి సంజయ్ కన్నా సీనియర్ .   కేసీఆర్ తో పాటు నిన్నామొన్నటిదాకా నడిచి అప్పటి టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాత పార్టీ నుంచి అవమానకరంగా బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీ లో చేరి కీలక నేతగా ఎదిగారు. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్ ఆగ్రహంతో  ఉంది. ఇప్పుడు ముదిరాజ్ వర్గానికి ప్రధాని మోదీ సీఎం అభ్యర్థిగా చాన్స్ ఇస్తే వారంతా ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.  స్టేడియంలోకి ఊరేగింపుగా ప్రధాని వచ్చేటప్పుడు.. స్టేజ్‌పై కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు.  కానీ ఎవర్నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు.

తెలంగాణలో మా సీఎం అభ్యర్థి కేసీఆర్ మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే ధైర్యం ఉందా అని .. కేటీఆర్ తరచూ సవాల్ చేస్తూంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ  బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే  .  బీఆర్ఎస్ సవాల్‌కు సమాధానం చెప్పినట్లవుతుంది. మా పార్టీలో బీసీని సీఎం చేయగలం.. మీ పార్టీలో చేయగలరా అని ప్రశ్నించే అవకాశం ఉండేది.  అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా కార్నర్ చేయవచ్చు. ఆ పార్టీ గెలిస్తే.. ఎవరు సీఎం అనే దానిపై పంచాయతీ నడుస్తుంది. ఎలా చూసినా బీసీ సీఎం అనేది కాంగ్రెస్‌లో  వర్కవుట్ కాదు.  అయితే రెడ్డి లేకపోతే దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. బీజేపీ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే… అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్నీ కార్నర్ చేసినట్లవుతుందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. చివరికి ఆ ప్లాన్ నూ బీజేపీ మిస్సయింది.

బండి సంజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే  ఓ వర్గం…  ఈటలను ప్రకటిస్తే మరో వర్గం పార్టీకి పూర్తిగా దూరమవుతుందన్న ఆందోళనతోనే సీఎం అభ్యర్థి ప్రకటనపై మోదీ వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. సభ ముగిసిన తర్వాత  బీసీ సంఘాల తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థిపై వారికి క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. వారికి ఎవరిపేరు చెప్పినా బహిరంగంగా చెప్పకపోతే ఏ మాత్రం రాజకీయంగా ఉపయోగం ఉండదు.  బీజేపీ పెద్దలు తెలంగాణ విషయంలో తడబడుతున్న అంశాన్ని బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేకపోవడమూ బయట పెట్టినట్లయింది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి