థంబ్-కాంగ్రెస్ లో అసమ్మతి గోల

By KTV Telugu On 31 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ కాంగ్రెస్‌లో మంటలు మొదలయ్యాయి. ఎన్నాళ్లగానో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఆశావహులు అనేక మంది టిక్కెట్లు రాక భంగపడ్డారు. ఇప్పుడు వారంతా పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పదేళ్ళుగా పార్టీ అధికారంలో లేకపోయినా ఎత్తిన జెండా దించకుండా కష్టపడ్డవారిని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోయి అక్కడ టిక్కెట్ రాక తిరిగివచ్చినవారికి ప్రయారిటీ ఇవ్వడంతో అసంతృప్తి పెల్లుబుకుతోంది. హస్తం గూటిలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం.

కాంగ్రెస్ హైకమాండ్‌ అష్టకష్టాలు పడి రెండు విడతలుగా వంద మంది తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసింది. లెఫ్ట్ పార్టీలకు నాలుగు సీట్లు కేటాయించగా…మరో 15 సీట్లు ఖరారు చేయాల్సి ఉంది. అవి మరింత క్లిష్టంగా ఉండటంతో ప్రస్తుతానికి వాటిని నిలిపివేసి…ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. ఇక ప్రకటించిన సీట్లలో తమకు వస్తుందని ఆశించి భంగపడినవారు పార్టీ నాయకత్వం మీద తిరగబడుతున్నారు. తమకు ఎందుకివ్వలేదంటూ నిలదీస్తున్నారు. అడ్డుపడిన నాయకులను శపిస్తున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆశిస్తే ఒక్కరికే వచ్చిన సందర్భంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి వచ్చిన ఉదాహరణలు చూపించి తమకెందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.

పదేళ్ళుగా కాంగ్రెస్ జెండా పట్టుకుని…పార్టీ కోసం కష్టపడినవారిని కాదని…కాంగ్రెస్ పని అయిపోయిందని భావించి పక్క పార్టీల్లోకి వెళ్లిపోయి…ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశతో తిరిగివచ్చినవారికి టిక్కెట్లు ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవారిలో 20 మందికి టిక్కెట్లు ఇవ్వడంతో…ఆయా స్థానాల్లో పోటీ చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నవారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…ఉప ఎన్నికల్లో ఓడిపోయి…ఇప్పుడు తిరిగివచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఆఖరు క్షణంలో పార్టీలో చేర్చుకుని మునుగోడు టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆ టిక్కెట్ ఆశించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అనుచరుడు చల్లమల కృష్ణారెడ్డి…జిల్లాలో సీనియర్ దివంగత కాంగ్రెస్ నేత కుమార్తె పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు.

హైదరాబాద్‌ జూబిలీ హిల్స్‌ టిక్కెట్ ఆశించిన దివంగత పీ. జనార్థనరెడ్డి తనయుడు విష్ణువర్థన్‌రెడ్డిని కాదని క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారని కాని చివరి క్షణంలో హ్యాండిచ్చారని ఆయన ఆవేదన చెందుతున్నారు. పార్టీ నుంచి పొమ్మనలేక పొగ బెడుతున్నారని మండిపడ్డారు విష్ణువర్థన్‌రెడ్డి.

ఎర్ర శేఖర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లేదంటే నారాయణపేట్ టిక్కెట్ ఆశించారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ ఈసారి తనకే ఇస్తారని ఆశించారు. కాని వెంకట్‌కు ఆశాభంగం అయింది. ఇక హుస్నాబాద్ టిక్కెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డికి కూడా కోరిక నెరవేరలేదు. మహాబూబాబాద్ టిక్కెట్ ను బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, పాలకుర్తి టిక్కెట్ ను తిరుపతిరెడ్డి, అంబర్ పేట్ టిక్కెట్ ను నూతి శ్రీకాంత్, మోతె రోహిత్ ఆశించారు. వీరందరికి వివిధ కారణాలు చూపించి కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్లు ఇవ్వలేదు. టిక్కెట్ రాని నేతలంతా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఇప్పటివరకు ఇచ్చిన వాటిలో కేవలం 20 సీట్లు మాత్రమే దక్కాయి. అదే 20 శాతం లోపు ఉండే అగ్రవర్ణాలకు 53 సీట్లు ఇచ్చారు. బయటి నుంచి వచ్చినవారిలో 20 మందికి టిక్కెట్లు దక్కాయి. కాంగ్రెస్‌లో ఉన్నారా? బయటి నుంచి వచ్చారా అనేది చూడకుండా…కేవలం గెలుస్తారా? లేదా అనే అంశం మీదే రేసు గుర్రాలని నమ్మినవారికే కాంగ్రెస్ టిక్కెట్లు దక్కాయి. అయితే టిక్కెట్లు పొందలేని ఆశావహులు గాంధీభవన్‌లో గలాభా సృష్టిస్తారేమోనని హస్తం పార్టీ పెద్దలు భావించారు. కాని అసంతృప్త నేతలు ఎక్కడికక్కడ తమ ఆక్రోశాన్ని..ఆగ్రహాన్ని వెళ్లగక్కారే గాని పెద్దగా గొడవలేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి