టిక్కెట్ టిక్కెట్ – కాంగ్రెస్‌లో కుల క్యాంపులు!

By KTV Telugu On 10 October, 2023
image

KTV TELUGU :-

బీసీ నేతలకు అత్యధిక టిక్కెట్లు ఇవ్వాలని నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో మకాం వేసి రాజకీయం చేసి పార్టీ పెద్దలను కలిశారు. చెప్పాలనుకున్నది చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యత కమ్మ సామాజికవర్గం తీసుకుంది. రేణుకా చౌదరి నేతృత్వంలో ఓ బృందం సంప్రదింపులు జరుపుతోంది. రేపు మరో సామాజికవర్గం.. ఇలా అందరూ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పంచాయతీలకు వెళ్తున్నారు. ఇదంతా చూస్తూంటే.. కాంగ్రెస్ లో కుల చిచ్చు ప్రారంభమవుతోందేమో… అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కాస్త తరచి చూస్తే.. రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం నడిపిస్తున్నారన్న అనుమానాలు బలంగా ఇతర పార్టీల్లో వస్తున్నాయి. ఎందుకంటే..  కాంగ్రెస్ లో ఈ కుల క్యాంపులన్నీ బీఆర్ఎస్ టిక్కెట్ల కేటయింపు లెక్కల్ని తెరపైకి తెస్తున్నాయి.

కులం అనేది రాజకీయాల్లో మొదటి అంశం. చాలా మంది ప్రజలు బయట సమాజంలో బతడకానికి కులాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాల్లో పెళ్లిళ్లు కులాంతరంగా జరపడానికి వెనుకాడటం లేదు. కానీ ఈ అభ్యుదయం రాజకీయాల్లో మాత్రం ఉండటం లేదు. పైగా అంతకంతకూ పెరుగుతోంది. కులాల ప్రకారం ప్రాతినిధ్యం కావాలని.. జనాభా ప్రాతిపదికన నిధులు.. అధికారాలు ఇవ్వాలని పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతోంది. టిక్కెట్ల కేటాయింపుల్లో ఏకపక్షంగా ఉండే ప్రాంతీయ పార్టీల్లో .. తమకు  ప్రాధాన్యం ఇవ్వాలని అడిగే వారు ఉండదు. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలో అలా కాదు. పైగా.. సొంత నేతలే గ్రూపుల్ని తయారు చేసి అడిగిస్తారు. ఇప్పుడు అలాంటి రాజకీయమే కాంగ్రెస్‌లో నడుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ సామాజికవర్గాల పేరుతో గ్రూపులు తెరపైకి వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కసరత్తు ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఎవరెవరికి టిక్కెట్ ఇవ్వాలో దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ సారి టిక్కెట్ల కేటాయింపులో స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.  సునీల్ కనుగోలు సర్వే బృందాలతో ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారు.  పార్టీ అభ్యర్థలును ఖరారు చేసిన చోట..  పోల్ స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తున్నారు. అభ్యర్థి బలహీనంగా ఉన్నాడనుకున్న చోట..  బలమైన అభ్యర్థుల కోసం స్వయంగారంగంలోకి దిగుతున్నారు.  తర పార్టీల నుంచి అయినా బలమైన అభ్యర్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వరుసగా టిక్కెట్ కోసం పార్టీలో చేరే నేతలు పెరుగుతున్నారు. భువనగిరి నుంచి కంభం అనిల్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి ఇలా గెలుస్తారు.. బలమైన అభ్యర్థి అనుకున్న వారిని వదిలి పెట్టకుండా పార్టీలోకి ఆకర్షిస్తున్నారు.   ఎన్నికల షెడ్యూల్ వచ్చి న తర్వాతి రోజే మొత్తం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపు కాంగ్రెస్ సామాజికవర్గాల పేరుతో అలజడి కనిపిస్తోంది. గ్రూపులుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి తమకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నారు.

బీసీలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 34 సీట్లు ఇస్తామని ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఇరవై లోపు సీట్లే ఇవ్వడం..  ముదిరాజ్ వంటి కీలక సామాజికవర్గాలకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి ఉంది. వారందర్నీ ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి బీసీలకు టిక్కెట్లు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం ముఫ్ఫై సీట్లు బీసీలకు గ్యారంటీగా ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు .,. ఢిల్లీ వెళ్లి  నాలుగురోజుల పాటు హడావుడి చేశారు. పార్టీ నాయకుల నుంచి హామీ పొంది వచ్చారు. తాజాగా  కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కమ్మ   సామాజికవర్గం నేతలు సమావేశాలు పెడుతున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ అసలు ప్లాన్ ఉందని  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  కమ్మ సామాజిక వర్గానికి 12 సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ కమ్మ నేతల బృందం ఏఐసీసీ నేత, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో భేటీ అయ్యింది. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కో రారు. విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారని, బృందానికి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. రేపు రెడ్డి సామాజికవర్గం లే్కపోతే.. మరో వర్గం వెళ్లి తమ డిమాండ్లను వినిపించినా ఆశ్యర్యం లేదు.

కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తున్న వారికి ఆ పార్టీలో సామాజికవర్గాల చిచ్చు ఏర్పడిందని అనుకుంటారు. కానీ.. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అనుమానాలు కూడా బలంగానే ఉన్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్ టిక్కెట్ల లో సామాజిక సమతుల్యం లోపించడమేనని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ముందుగానే టిక్కెట్లు ప్రకటించడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అసలు సామాజిక రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.

కాంగ్రెస్‌లో సామాజికవర్గాల చిచ్చు పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి వచ్చే లాభం ఏమిటన్నది కొంత మందికి వచ్చే డౌట్. అక్కడే రాజకీయం ఉంది.బీఆర్ఎస్ కంటే అన్ని సామాజికవర్గాలకు ముఖ్యంగా ఇతర పార్టీల ఓటు బ్యాంకులుగా ఉన్న సామాజికవర్గాలకు తాము ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చుకోవాలని హైలెట్ చేయాలంటే..  కొంత రాజకీయం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్‌లో బీసీ, కమ్మ రాజకీయ నేతలు చేస్తున్న హడావుడి దీనికోసమేనని భావిస్తున్నారు. బీసీలకు  బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి.. ఆ విషయాన్ని హైలెట్ చేసుకోవడానికే బీసీ నేతలతో ఢిల్లీలో డిమాండ్లు వినిపించారని.. టిక్కెట్లు ప్రకటించిన  తర్వాత వారు.. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లన్ అమలు చేస్తున్నారని అంటున్నారు.

అలాగే కమ్మ సామాజికవర్గం సంప్రదాయంగా టీడీపీకి ఓటు బ్యాంక్ గా ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తుందా లేదా .. చేసినా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న దానిపై స్పష్త లేదు. వారి ఓటు బ్యాంక్ బీఆర్ఎస్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం  ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు రేణుకా చౌదరి నేతృత్వలో కొత్త రాజకీంయ జరుగుతోందని అంటున్నారు. తుమ్మల సహా.. ఎలాగూ.. కొంత మంది కమ్మ సామాజికవర్గం నేతలకు టిక్కెట్లు కేటాయిస్తారని .. అలా కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకుని వారందర్నీ ఆకట్టుకునేలా చేసేందుకు ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఆ పార్టీ టిక్కెట్ల ప్రకటనలో సామాజిక న్యాయం లోపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి మెజార్టీ సీట్లు దక్కాయి. 115  స్థానాల్లో రిజర్వుడు సీట్లు పోను మిగిలిన నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాల్లో  సర్సాపూర్,  జనగామ, మల్కాజిగిరి స్థానాల్లో రెడ్లకే చాన్సిస్తున్నారు. అంటే 43 టిక్కెట్లు ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే దక్కబోతున్నాయి. వెలమలకు 10, కమ్మ వర్గానికి ఐదు, వైశ్య, బ్రాహ్మణులకు ఒక్కొక్కటి కేటాయించారు. మొత్తం బీసీ వర్గాలకు ఇరవై రెండు కేటాయించారు. ఇందులో మున్నూరు కాపు వర్గానికే పది దక్కాయి. దీంతో సామాజిక సమీకరణాలు తప్పాయని..తాము అలా కాదని..కాంగ్రెస్ నిరూపించాలనుకుంటోంది. అందుకే సామాజికవర్గాల వారీగా అంతర్గత డిమాండ్లు చేయించి.. తగినంత ప్రాధాన్యం ఇచ్చామని ..ప్రచారం చేసుకునే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.

రాజకీయ పార్టీ  ఏదైనా  రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కారణం ఏదైనా బీార్ఎస్ పార్టీకి కల బలం తక్కువ. వెలమలు ఆ పార్టీకి అండగా ఉన్నప్పటికీ వారి సంఖ్య తక్కువే. సెంటిమెంటే బీఆర్ఎస్‌కు కవచ కుండలాల్లా ఉన్నాయి. కానీ వాటి పవర్ తగ్గుతోంది.అందుకే రెడ్డి సామాజికవర్గంతో పాటు బీసీలను దగ్గర చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దళితులు , కాంగ్రెస్ వైపు ఉంటున్నారు. వారిలో కొంత చీలిక తేవడానికైనా దళితబంధు లాంటి పథకాలు ప్రవేశ పెట్టారు. మొత్తంగా ..  కాంగ్రెస్ టిక్కెట్ల ప్రకటన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన సామాజిక న్యాయంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అందులో అడ్వాంటేజ్ కోసమే కాంగ్రెస్ ఇలా సామాజిక వర్గాల డిమాండ్లను తెరపైకి తెస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రాజకీయాలు ఆషామాషీగా చేయలేరు. అంతా ప్రీప్లాన్డ్ గా చేసుకుని… హఠాత్తుగా జరిగిపోయిందని అనిపించుకోవాలి. ఈ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని అనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి