కామారెడ్డిలో కేసీఆర్‌కు దడపుట్టించే సవాళ్లు ఇవే !

By KTV Telugu On 30 October, 2023
image

KTV TELUGU :-

కేసీఆర్ తో పోటీ అంటే ఎవరైనా సరే పోచమ్మ గుడి ముందు కట్టేసిన పొట్టేలు లాంటి వారేనని కేటీఆర్ ఇటీవల కామారెడ్డి పర్యటనలో ఉన్నారు. అప్పటికి రేవంత్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారంలోకి రాలేదు. కేసీఆర్‌పై పోటీకి రేవంత్ రెడీ అయ్యారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి..  రేవంతే కనుక కామారెడ్డిలో పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే మొదటి సీటు అదే అవుతుందన్నారు. రెండు పార్టీల నేతల్లోనూ అంతులేని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది ? అక్కడ ఉన్న సమస్యలకు కారణం బీఆర్ఎస్సేనని ప్రజలు నమ్మితే పరిస్థితి  ఎలా ఉంటుంది ? అసలు కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌కు సిద్దిపేట లాంటి కొన్ని  కంచుకోట నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జాబితాలో కామారెడ్డి లేదు. ఎందుకంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు ఉత్తరతెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీలు కళ్లు తిరిగే స్థాయిలో ఉన్నప్పుడు కూడా కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాలు రాలేదు.  అయినా సరే కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంగా కామారెడ్డిని ఖరారు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం కాబట్టి సహజమైన క్రేజ్ వస్తుందని ఇట్టే గెలిచేస్తారని మొదట్లో చాలా మంది అనుకున్నారు. కానీ కామారెడ్డిలో క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసిన తర్వాత ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని అంగీకరించక తప్పదు.

కామారెడ్డి నియోజకవర్గం..  ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉండటం ఖాయమైంది. దీంతో  కామారెడ్డి నియోజకవర్గానికి ఉన్నట్లుండి ఊహించనంతగా హైక్‌ వచ్చేసింది. ఎక్కడ, ఏ మూలన ఎన్నికలపై చర్చ జరిగినా.. కామారెడ్డి రాజకీయమే కీలకాంశమవుతోంది. ఉద్దండులు తలపడుతున్న స్థానంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. గెలు పోటములు ఎలాగున్నా.. నువ్వా నేనా.. అనే స్థాయిలో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. కామా రెడ్డిలో కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి? అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుంచీ ఈ రెండు ప్రధాన పార్టీల కేడ ర్‌ ప్రచార వ్యూహాలతో సమాయత్తమవుతోంది. అభివృద్ధే ఆయుధమన్న పంథాతో ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతున్న భారాస కేడర్‌ తమదే పైచేయి అని ఎలుగెత్తి చాటు కుంటోంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అ న్న నినాదంతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే కామారెడ్డిలో కేటీ-ఆర్‌ బహిరంగ సభ నిర్వ హించి శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. భారీ మెజార్టీ లక్ష్యంగా కేసీఆర్‌ బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్‌ తరపున ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జిల్లా అధ్యక్షుడు ము జీబుద్దీన్‌లు అన్నీ తామై పని చేస్తున్నారు. ఇప్పుడు టీ-పీసీసీ రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌తో పోటీ-కి సై అంటు-న్నారన్న ప్రచారం తో కామారెడ్డి కొత్త రాజకీయ ఒరవడికి వేదికయ్యే అవ కాశం కనిపిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌కు ఎక్కడికక్కడ చెక్‌ పెట్టే యోచనతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది.  ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మొదటి నుంచి పోటీ- చేస్తూ వస్తున్నారు. కేసీఆర్‌ బరిలో ఉన్నప్పటికీ తానే పోటీ- చేస్తానని అనేక సార్లు షబ్బీర్‌ అలీ చెప్పుకొచ్చారు. తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తుండటంతో షబ్బీర్‌ అలీ తప్పుకోక తప్పడం లేదు. రేవంత్‌ రెడ్డి ప్రచారం మొదలుపెడితే కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారబోతుంది.

ఇక్కడి నుంచి 2018లో టీఆర్‌ఎస్‌వ పక్షాన గంపా గోవర్దన్‌, కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్‌ అలీ పోటీ పడగా, గోవర్దన్‌ నే విజయం వరించింది. గోవర్దన్‌ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు.   గోవర్దన్‌ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు.   కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్‌ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్‌ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు.

బీజేపీ పదిహేను వేల ఓట్లు చీల్చుకున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సమాన బలం ఉంటుంది. కానీ కామారెడ్డిలో ఇటీవల మాస్టర్ ప్లాన్ పేరుతో జరిగిన గొడవలు.. దళిత బంధు అవకతవకలు.. డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆశావహులు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు టెన్షన్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో రెండు, మూడు వారాల పాటు కామారెడ్డి మొత్తాన్ని వణించిన ఉద్యమం మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకింగా జరిగింది. కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో  8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ను 2022 నవంబర్​ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్​ జోన్​, గ్రీన్​ జోన్, రీక్రియేషన్​ జోన్​, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్​, ఇల్చిపూర్, టెకిర్యాల్​, లింగాపూర్​, పాతరాజంపేట, రామేశ్వర్​పల్లిలో పాటు సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన  రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్​, రామేశ్వర్​పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్​ లో  బీఆర్​ఎస్ కు  పట్టుంది. కానీ,  మాస్టర్​ ప్లాన్​పై  ఈ గ్రామాల  నుంచే వ్యతిరేకత వచ్చింది.     రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.  ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ,  కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్​  పోగ్రాములు సక్సెస్​ అయ్యాయి. దీంతో  రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. అప్పట్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆసక్తి చూపలేదు. కానీ రైతుల ఆగ్రహంతో మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అధికారికంగా రద్దు కాలేదు.

ఇప్పుడు పరిస్థితిని గమినించిన కేటీఆర్ కామారెడ్డి నుంచి   రైతు జేఏసీ బృందాన్ని పిలిపించుకున్నారు.  మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిందన్నారు.  మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు.   రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. ఇంత వేగంగా స్పందించడానికి కారణాలేమిటో తెలియనంత అమాయకులు రైతులు కాదు.

కామారెడ్డిలో చాలా కాలంగా పనులు పెండింగ్ లో ఉన్నాయి. కామారెడ్డి టౌన్​కు మంత్రి కేటీఆర్​ రూ.45 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​ చేస్తున్నట్లు ప్రకటించారు.  మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల వెడల్పు పనులు, సెంట్రల్​ లైటింగ్​, డివైడర్ల నిర్మాణం,  వార్డులో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు,  కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్​ నిర్మాణాలకు ఈ ఫండ్స్ ఖర్చు చేస్తారు. స్టేడియం కాంప్లెక్స్​ తదితర  పనులకు మిగతా రూ. 20 కోట్లు కేటాయిం చారు. కానీ పనులు ఊపందుకోలేదు. అదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో సమస్యలు ఉన్నాయి. దళిత బంధు కొంత మందికే వచ్చింది. అదీ కూడా బీఆర్ఎస్ నేతలకే దీనిపై దళిత వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇతర పథకాల విషయంలోనూ అంతే. అందుకే .. కామారెడ్డిలో కేసీఆర్‌కు అంత సులువు కాదన్న వాదన వినిపిస్తోంది.

గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయడం కేసీఆర్‌కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆయన కు కామారెడ్డిలో ఊహించనంత సవాల్ ఎదురవడం మాత్రం ఖాయం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి