కాంగ్రెస్‌ కు శత్రువు కాంగ్రెసే

By KTV Telugu On 22 November, 2022
image

టీపీసీసీలో నిత్యం అసమ్మతి జ్వాలలు
అంతర్గత కలహాలతో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌

ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుంది తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. నిత్య అసమ్మతితో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. టీపీసీసీ అధ్యక్చుడు రేవంత్‌రెడ్డి ఒకవైపు అధికార టీఆర్‌ఎస్‌ తో మరోవైపు బీజేపీతో పోరాడుతూనే ఇంకోవైపు సొంత పార్టీలోని అసమస్మతి నేతలతో కూడా తలపాడాల్సిన వింత పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తుంది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఆ పార్టీ నేతలే అడ్డుపడడం కామన్‌ అయిపోయింది. ఒకరంటే ఒకరికి పడదు. అధిష్టానం అంటే లెక్కలేదు. కాంగ్రెస్ లో ఈ అనైక్యతకు ప్రధాన కారణం  రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేయడమే. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఇప్పటికీ ఆ పార్టీలో చాలామంది అంగీకరించలేకపోతున్నారు.

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్‌ ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారానికి రాకుండా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. తనకు పీసీసీ పదవి ఇవ్వకుండా రేవంత్‌రెడ్డికి ఇచ్చారనేది ఆయన అసంతృప్తికి కారణం. తాను ప్రచారం చేసినా చేయకున్నా కాంగ్రెస్‌ గెలవదు అని వ్యాఖ్యానించారు. తనలాంటి హోమ్‌గార్డు కాకుండా ఎస్పీ స్థాయి నాయకులే గెలిపిస్తారని పరోక్షంగా రేవంత్‌రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కి ఓటేయాలని చెబుతున్నట్లు ఉన్న ఒక ఆడియో టేపు కలకలం సృష్టించింది. ఆయనకు అధిష్టానం రెండు సార్లు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు అయినా ఇప్పటివరకు మీద ఎలాంటి చర్యలు లేవు.

ఆ పార్టీ మరో సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ సోకింది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడ కూడా గొడవే ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ క్రమశిక్షణా సంఘంలోని ఇతర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక జగ్గారెడ్డి అయితే రోజూ రేవంత్‌రెడ్డిపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. ఇటీవల టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈజూమ్‌ మీటింగులేమిటి అంటూ జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు హాజరు కాలేదు. దీంతో వారికి తమ పార్టీ కార్యకలాపాల మీద మీద ఉన్న ఆనాసక్తి ఏంటో తెలిసిపోతోంది.

ఆ 11 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులైతే ఇచ్చారు కానీ ఎవరిమీద ఎలాంటి చర్యలు ఉండవు. దీన్ని అలుసుగా తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులు నిత్యం కలహాలతో కాంగ్రెస్‌ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని టీపీసీసీ నిర్ణయించింది. ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టాలని తీర్మానించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలే దీనికి కారణం అనే వాదన కూడా ఉంది. అందుకే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అది అంతంత మాత్రంగా మిగిలిపోతోంది. పార్టీలో సమన్వయం లేనప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వృథాయే అనంటున్నారు విశ్లేషకులు.