తెలంగాణా కాంగ్రెస్ గేర్ మార్చేసింది. కర్నాటక ఫలితాన్ని తెలంగాణాలో రిపీట్ చేయాలనుకుంటోన్న హస్తం పార్టీ నేతలు తెలంగాణాలో ఆకర్ష పథకాన్ని అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీ నుండి వీడి ఇతర పార్టీల్లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలందరూ తిరిగి కాంగ్రెస్ గూటిని చేరాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ కోసం అవసరమైతే తాను పది మెట్లు కిందకు దిగడానికి కూడా రెడీయే అన్నారు రేవంత్ రెడ్డి. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. రాజకీయాల్లో దీన్నే కలసి ఉంటే కలదు అధికారం అంటారు. పొరుగునే ఉన్న కర్నాటకలో సర్వేల అంచనాలను సైతం మించిపోయి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తీరు తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో హుషారు పెంచేసింది. కర్నాటకలో భిన్న ధృవాల్లాంటి డికే శివకుమార్, సిద్ధరామయ్యలు చేతులు కలపడం వల్లనే పార్టీ విజయం సాధ్యమైందని భావిస్తోన్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు అదే వైఖరిని తెలంగాణాలోనూ కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఈగోలను పక్కన పెట్టి పార్టీలో అందరినీ కలుపుకుంటూ పోతేనే విజయం సాధించగలుగుతామన్న భావనలో ఉన్నారు.
పార్టీలోని సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించాలన్న వ్యూహాన్ని కాంగ్రెస్ పెద్దలు సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుణ్ని చేయడం నచ్చక అలిగి రచ్చ రచ్చ చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చివరకు పార్టీకి గుడ్ బై చెప్పి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన సంగతి తెలిసిందే. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు జి.వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి లతో పాటు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని రేవంత్ రెడ్డే స్వయంగా కాంగ్రెస్ లోకి తిరిగి ఆహ్వానించడం విశేషం. ఈ క్రమంలోనే పార్టీ కోసం తాను పది మెట్లు దిగడానికి కూడా సిద్ధమే అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ వైఖరిని పార్టీలోని ఇతర నేతలు మెచ్చుకుంటున్నారు. అటు రాజకీయ పండితులు సైతం రేవంత్ రెడ్డి ఈగో పక్కన పెట్టి తనతో గొడవ పడి తనను విమర్శించి పార్టీ నుండి వెళ్లిపోయిన రాజగోపాల రెడ్డిని కూడా సాదరంగా పార్టీలోకి పిలవడం చాలా మంచి పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీయార్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలన్న రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్. నుండి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ ను కూడా ఆహ్వానించడం గమనార్మం. ఈ క్రమంలోనే ఆయన పొంగులేటి జూపల్లి కృష్ణారావులకు ఇప్పటికే కాంగ్రెస్ లోకి రావలసిందిగా ఆహ్వానాలు పంపారు. కేసీయార్ ను ఓడించడమే లక్ష్యంగా ఉన్న రాజకీయ నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలన్నది రేవంత్ రెడ్డి పిలుపు వెనుక ఉన్న ఆంతర్యంగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి డి.కె.అరుణ, హైదరాబాద్ కు చెందిన మరో సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డిలను సైతం రేవంత్ రెడ్డి త్వరలోనే కలుస్తారని అంటున్నారు. గతంలో జరిగినవి మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి రావాలని వారిని కోరనున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన కొత్తలో పార్టీలో ఉన్న సీనియర్లను కాదని బయటి పార్టీలోంచి వచ్చిన వారికి ఏడాదికే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటని రేవంత్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సీనియర్లు అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. దానికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ హోం గార్డులు ఎన్ని సంవత్సరాల సర్వీసు కొనసాగించినా ఎఎస్పీలు కాలేరని వ్యాఖ్యానించారు. ఇది చాలా మంది సీనియర్లకు మంట తెప్పించింది. ఆ సమయంలోనే తాము ఇక హోంగార్డులుగా కొనసాగలేం అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, మర్రిశశిధర రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై మండి పడ్డ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటూ రేవంత్ ను ఖాతరు చేయకుండా ఉంటున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రం తాను పార్టీ మారతానంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు. తనపై కావాలనే రేవంత్ రెడ్డి, బి.ఆర్.ఎస్.లు దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాలరెడ్డి ఆరోపిస్తున్నారు. తాను కేసీయార్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే మోదీ విధానాలు నచ్చి బిజెపిలో చేరానని స్పష్టం చేశారు.
అయితే రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు వేరులే అంటున్నారు విశ్లేషకులు. పార్టీ మారేది లేదు అని గట్టిగా అంటున్నారంటే పార్టీ త్వరలోనే మారతారని అర్ధం చేసుకోవాలని వారంటున్నారు. తాను గతంలో నోరు జారడం వల్ల పార్టీకి దూరమైన వారిని పార్టీలోకి రప్పించే క్రమంలోనే అవసరమైతే తాను పది మెట్లు దిగి రావడానికి కూడా సిద్ధమని.. తన మాటల వల్ల హర్ట్ అయిన నేతలకు సారీ చెప్పి తన తప్పు ఒప్పుకుంటానని రేవంత్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మంచి పరిణామమని అంటున్నారు. దీనికి సీనియర్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే జూన్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా,రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణా పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలోనే మాజీ కాంగ్రెస్ నేతలందరినీ కాంగ్రెస్ లో చేర్చుకోడానికి సన్నాహాలు చేసి కలిసొచ్చే వారిని సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ లో చేర్చుకునే కార్యక్రమం నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఈ దిశగా పావులు కదుపుతున్నారని భోగట్టా. కర్ణాటక విజయం తో పెరిగిన ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణాయే అగ్రస్థానంలో ఉంటుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్కకు సైతం ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చారని ఏ ఒక్కరినీ దూరం చేసుకోకుండా ముందుకు సాగాలని సూచించినట్లు చెబుతున్నారు. గతంలో దూరం చేసుకున్న వారిని కూడా తిరిగి పార్టీలోకి తెచ్చే బాధ్యతను కూడా రేవంత్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలుంటాయంటున్నారు రాజకీయ పండితులు. కొద్ది రోజుల క్రితమే బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత మహేశ్వర రెడ్డి పరిస్థితి ఇపుడు కుడితిలో పడ్డ ఎలకలా మారిందంటున్నారు. చేరి ఎన్నో రోజులు కాలేదు కాబట్టి బిజపిని వీడలేరు. ఎందుకంటే ఇపుడు పార్టీ మారితే అది మహేశ్వర రెడ్డి విశ్వసనీయత దెబ్బతింటుంది. అందుకే ఆయన పరిస్థితులను నిశితంగా గమనిస్తూ మౌనంగా ఉండిపోయారు.
బిజెపిలో ఇమడలేకపోతోన్న ఈటల రాజేందర్ కూడా డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉంటుంది? బిజెపిలోనే కొనసాగితే మంచిదా లేక పూర్వాశ్రమం అయిన బి.ఆర్.ఎస్.కి వెళ్లాలా అన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే బి.ఆర్.ఎస్.లో చేరే అవకాశాలు తక్కువే అంటున్నారు. తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని భావిస్తే మాత్రం ఈటల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపచ్చని అంచనా వేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో తెలంగాణా బిజెపిలో చేరికల కమిటీకి పెద్ద పనేం ఉంటుంది అన్న భావనలో ఈటల ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే వాతావరణం ఉందని అనిపిస్తే మాత్రం మాజీ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డితో ఉన్న ఈగోలను కూడా పక్కన పెట్టి ఏదో ఓ శుభ ముహూర్తాన కాంగ్రెస్ లో చేరి” సొంత గూటికి వచ్చాం” అని మీడియా ముందు చిరునవ్వులు చిందించడం ఖాయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటక పరాజయంతో తెలంగాణా బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలు సైతం ఇపుడు కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు.