ఇప్పుడు రేవంత్ వంతు – మైండ్‌గేమ్‌కు వణుకుతున్న బీజేపీ !

By KTV Telugu On 30 January, 2023
image

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రోలర్ కోస్టర్ లా మారుతున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఇతర పార్టీల నేతలతో ముఖ్యంగా బీజేపీతో ఓ ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు సంచలనంగా మారుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రచారం కూడా దీనికి ఊపు ఇస్తోంది. మారుతున్న పరిణామాలతో బీజేపీ ఎక్కువ టెన్షన్‌కు గురవుతోంది.

విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బండి సంజయ్ వెళ్లారు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక తనకు ప్రాధాన్యత లేదని విజయశాంతి ఫీలవుతున్నారు. ఈ భావన తొలగించడానికి ఆయన విజయశాంతి కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వెళ్లడమే ఆశ్చర్యం అనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. అసలు పార్టీ నుంచి ఎవరు వెళ్లారంటే గుర్తొచ్చేది దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లాంటి వాళ్లు మాత్రమే. వారేమీ బీజేపీ నేతలు కాదు. అవసరం కోసం వచ్చి చేరారు. అదే సమయంలో ఈటల రాజేందర్ పార్టీలో కోవర్టులున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అటు ఈటల రాజేందర్ ఇటు బండి సంజయ్ పిలుపుల మధ్యలో అసలు రాజకీయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

బీజేపీలో పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు. తాను చేరికల కమిటీ ఇంచార్జ్ గా ఉన్నా తనపై కుట్ర చేస్తున్నారని ఎవరూ చేరకుండా చేస్తున్నారని దీని వెనుక కోవర్టుల పాత్ర ఉందని ఈటల రాజేందర్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ అసంతృప్తి బయట పడటంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ప్రారంభించారు. ఈటల లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ సరైనదని సందేశం పంపుతున్నారు. ఆయనను మాత్రమే కాదు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ తో పాటు విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేశారు. వీరి లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని ఆయన అంటున్నారు. నిజానికి వీరంతా బీజేపీలో చేరారు కానీ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గడిపేస్తున్నరు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా రేవంత్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని బీజేపీపీలో చేరిన వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌కు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

నిజానికి రేవంత్ రెడ్డి వీరెవర్ని నేరుగా ఆహ్వానించడం లేదు. వారి లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ను ఓడించాంటే బీజేపీతో కాదని అంటున్నారు. ఆ లక్ష్యం చేరుకోవాలంటే కాంగ్రెస్ గూటికి రావాలంటున్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరుతారని గతంలోనే ప్రచారం జరిగింది. వివేక్ ది అయితే కాంగ్రెస్ డీఎన్ఏ. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో భారీగా చేరికలు ఉండబోతున్నాయని ఢిల్లీలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

మరో వైపు తెలంగాణ బీజేపీలో ఇవిగో చేరికలు అవిగో చేరికలు అన్నారు. కానీ చివరికి ఉన్న వారు కూడా జంపయ్యే పరిస్థితి కనిపించడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్ ఎవరూ వెళ్లవద్దని వెళ్లిపోయిన వాళ్లు రావాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు. అసలే బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా పెద్ద మిషన్ పెట్టుకుని పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు. ఈ లోపు రేవంత్ రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూండటంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకూ బీజేపీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇక చేరడమే తరువాయి అనుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. రివర్స్ లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటే బీజేపీ ఇప్పటి వరకూ తెచ్చుకున్న హైప్ ను పూర్తిగా కోల్పోతుంది. రేసులో లేకుండా పోతుందనే ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.

మొత్తంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోమటిరెడ్డి దారిలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందరూ రేవంత్ నాయకత్వంలో నడుస్తామని చెబుతున్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేలా చేసుకుని అడ్వాంటేజ్ సాధించారు. ముందు ముందు రేవంత్ రెడ్డి ఇదే దూకుడు చూపించి కాంగ్రెస్ కు పాదయాత్ర పాజిటివ్ వైబ్స్ కలసి వస్తే మంచి రోజులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.