తెలంగాణాలో తీన్మార్

By KTV Telugu On 3 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ చాలా బిజీగా ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా ఆలోచనలు చేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు రక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు తోచిన వ్యూహాలు పన్నుతున్నాయి. సొంత పార్టీలో క్యాడర్ ను ఉత్సాహ పరిచేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. మూడు పార్టీల లక్ష్యం ఒక్కటే . ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవడమే అందరి అజెండా. ఈ రేసులో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బి.ఆర్.ఎస్. హ్యాట్రిక్ కొడుతుందని గులాబీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఈ సారి అధికారం మాదే మమ్మల్ని ఏ శక్తీ ఆపలేదని కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. బి.ఆర్.ఎస్., కాంగ్రెస్ లకు ఝలక్ ఇచ్చి అధికారంలోకి వస్తున్నాం చూసుకోండని కమలనాథులు అంటున్నారు.
మరో పది రోజుల్లోనే బహుశా తెలంగాణాలో ఎన్నికల నగారా మోగుతుంది. డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రేసులో దూసుకుపోవాలంటే అభ్యర్ధుల జాబితాలు విడుదల చేయాలి. ఇందులో బి.ఆర్.ఎస్. అందరికన్నా చాలా ముందంజలో ఉంది. ఇంచుమించు నెల క్రితమే బి.ఆర్.ఎస్. ఏకంగా 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించింది. మిగతా నలుగురు అభ్యర్ధుల జాబితాను రేపో మాపో విడుదల చేయడానికి కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీలో జరుగుతోంది. స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఆశావహుల జాబితాను జల్లెడ పట్టింది. ఇక బిజెపి అయితే చాపకింద నీరులా కసరత్తులు చేసుకుంటూ పోతోంది.

తెలంగాణా బిజెపిలో జోష్ నింపేందుకు బిజెపి నాయకత్వం చాలా కసరత్తులే చేస్తోంది. పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా తో పాటు జేపీ నడ్డాలు తెలంగాణాలో విస్తృతంగా పర్యటించేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ-షాలు వినూత్న కార్యక్రమాలు, రోడ్ షోలతో క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపనున్నారు. అదే విధంగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అన్నింటినీ మించి కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లను తలదన్నేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాలని బిజెపి భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారంటీలతో ఓటర్లను ఊరించేస్తోంది. ఈ మధ్యనే తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు విజయభేరి సభతో జనంలోకి చొచ్చుకుపోయారు. కాంగ్రెస్ వైపు గాలి కనిపిస్తోందని భావిస్తోన్న ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వలసలు పోతున్నారు. బి.ఆర్.ఎస్. నేతలు మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం తాజాగా కాంగ్రెస్ లో చేరారు. నల్లగొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుననారు.

అభ్యర్ధుల జాబితాను చాలా ముందుగా విడుదల చేసిన బి.ఆర్.ఎస్. అప్పట్నుంచీ ప్రజల్లోనే ఉంది తెలంగాణా ప్రగతి దశాబ్ధి ఉత్సవాల పేరిట పార్టీ నేతలు నిత్యం జనంతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగానే పార్టీ సీనియర్ నేత మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ బిజెపిలు కోలుకోలేని విధంగా త్వరలోనే ప్రజలు మెచ్చే మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వస్తున్నామని హరీష్ రావు ప్రకటించారు. ఆ మేనిఫెస్టో ప్రజలకు పండగ కాబోతుందని..కాంగ్రెస్, బిజెపిలకు మాత్రం అది బాంబే అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్, బిజెపిలకు ఓటేస్తే తెలంగాణా ఆగమాగం అయిపోతుందని బి.ఆర్.ఎస్. హెచ్చరిస్తోంది. అమలవుతోన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీయారే మళ్లీ రావాలని పిలుపు నిస్తున్నారు.
బిజెపిలోకీ వలసలు వస్తున్నాయి. మాజీ మంత్రులు జె.చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్ లు భారతీయ జనతా పార్టీలో చేరారు. చిత్తరంజన్ దాస్ 1989 ఎన్నికల్లో దివంగత ఎన్టీయార్ పైనే గెలిచి జెయింట్ కిల్లర్ గా అవతరించారు. ఆ క్రమంలోనే మంత్రి కూడా అయ్యారు. ఇక కృష్ణాయాదవ్ టిడిపిలో మంత్రిగా పనిచేశారు. అయితే స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంత కాలానికి ఆయన ప్రధాన రాజకీయ పార్టీలో అడుగు పెట్టినట్లయ్యింది. టిడిపి హయాంలో కృష్ణాయాదవ్ కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి