టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో డీల్ అంతా ఒక డ్రామా అని అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రగతి భవన్లో రూపుదిద్దుకున్న స్క్రిప్టు ప్రకారం నడిపించిన సినిమా అని విమర్శించారు. మునుగోడులో ఓటమి తప్పదనే అనుమానంతో కేసీఆర్ ఈ కుట్రకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలు తెలియాలంటే…సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచేత విచారణకు తాము సిద్ధం అని బీజేపీ సవాల్ చేసింది. ఈ డీల్‌లో ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు కాబట్టి ఈ కేసు పరిధి ఒక రాష్ట్రం దాటి విస్తరించింది కాబట్టి… కేంద్ర ఏజెన్సీలతోని దర్యాప్తు జరపించాలని డిమాండ్ చేసింది. సీబీఐ మీద అనుమానం ఉంటే సుప్రిం కోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఈ కుట్రకు కథ..స్క్రీన్ ప్లే… దర్శకత్వం మొత్తం కేసీఆర్ ఆని ఆరోపిస్తున్నారు. ఫామ్‌హౌస్‌కు పోలీసుల కంటే ముందే మీడియా చేరుకోవడం, రాత్రికి రాత్రే టీఆర్ఎస్ నాయకులు ధర్నాలకు, ఆందోళనలకు పిలుపునివ్వడం చూస్తుంటే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దేనికి పనికిరాని ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం వంద కోట్లు ఖర్చు పెట్టేంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండు మూడు మీడియా ఛానల్స్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రెస్‌మీట్ లేట్కావడంపై ఆయన మాట్లాడుతూ మిమిక్రీ ఆర్టిస్టులు ఇంకా దొరకలేదేమో అని సెటైర్ వేశారు. ఈ కేసులో మధ్యవర్తిగా ఉన్న నందకుమార్ అనే వ్యక్తి టీఆర్ఎస్కు సంబంధించినవాడేనని, కేసీఆర్ కుటుంబ సభ్యులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. ఆ పామ్‌హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది…ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసింది వాళ్లే, బాధితులు వాళ్లే…ఇంతకంటే డ్రామా ఇంకేమైనా ఉంటుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.