కాంగ్రెస్ బీఆర్ఎస్‌లు కలిస్తేనే అధికారం

By KTV Telugu On 14 February, 2023
image

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి మంటలు ఆగడం లేదు. పార్టీ లైన్ దాటుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్‌గా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయనే హాట్ కామెంట్స్ చేశారు. బహుశా రేవంత్ రెడ్డి పాదయాత్రను టార్గెట్ చేసుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి కామెంట్స్ కేడర్‌ మనోభావాలను దెబ్బతీయడమేనని రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని అధిష్టానం వేటువేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కొందరు నేతలు ఘాటుగానే విమర్శిస్తున్నారు.

తెలంగాణలో మరో పదినెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర నేతలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అయితే కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ సీనియర్లంతా కలిస్తే 40 నుంచి 50సీట్లు వచ్చే అవకాశముందంటున్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందంటూ వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ నేతలే కాదు బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఏకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు. ఓ పార్టీలో ఉండి మరో పార్టీని గెలిపించమని చెప్పే వారి మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ విమర్శించారు. బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనంటూ దాడి మొదలుపెట్టారు.

రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడోయాత్రకు కొనసాగింపుగా వివిధ రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో కూడాఈ యాత్ర చేస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారు. దాంతో సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ ఒక్కడే గెలిపిస్తానంటే తామంతా ఇంట్లో కూర్చుంటామంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపారు. అయితే ఎంపీ ఎన్నిసార్లు ధిక్కారస్వరం వినిపించినా వేటు వేసేందుకు అధిష్టానం సాహసించడం లేదు. ఎన్నికలకు ముందు అది తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి మాత్రం ఎప్పటిలాగే ప్రాణం పోయినా పార్టీని వీడే ప్రసక్తే లేదనే డైలాగును వదులుతున్నారు. బయటకు పంపే వరకు వేచిచూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తున్నారు.