ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిదేళ్లయ్యింది. ఇరు రాష్ట్రాల్లో ప్రజలు విడిపోయి కలిశారు. ఎవరి రాష్ట్రాలకు వాళ్లు అడ్రెస్సులు చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, స్టాట్యూటరీ బాడీస్ మాత్రం ఇంకా రాష్ట్రాన్ని విడదీసినట్లుగా లేవు. రెండు రాష్ట్రాలను ఇంకా ఆంధ్రప్రదేశ్‌గానే గుర్తిస్తున్నాయి. ఈ సంగతి ఎన్నికల సంఘం, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖను బట్టి తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తించేందుకు సుముఖంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాసింది. త్వరలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దానితో ఉబ్బితబ్బిబైన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కొందరైతే ఈసీ పంపిన లేఖను పట్టుకుని డ్యాన్స్ చేశారు. అంతలోనే కొందరు ఏదో పొరపాటు ఉందని గ్రహించారు. అదీ మామూలు పొరపాటు కాదు.
కేసీఆర్‌కు ఈసీ రాసిన లేఖలో అడ్రెస్ ఒక పెద్ద సమస్యగా మారింది.బంజారా హిల్స్ అడ్రెస్ రాస్తునే రాష్ట్రం పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ అని ముద్రించారు. దానితో ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్‌లో ఉందా అని కొందరు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అని ఎలా రాస్తారని కొందరు అంటుంటే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా గుర్తించారని మరి కొందరు అంటున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థల్లో రాష్ట్రం అడ్రెస్ మార్పులు చేయకపోవడమే కారణమని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈసీ చేసిన పొరపాటుకు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే అది పొరపాటు మాత్రమే.