పాలేరు నుంచి పోటీకి రెడీ…
తనకు వేరే మార్గం లేదన్న తుమ్మల
ఎన్టీఆర్ వల్లే ఎదిగానంటూ కామెంట్
సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నారా?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీకి రెడీ అంటున్నారు. మరి పోటీ చేసే పార్టీ ఏది అనేది మాత్రం చెప్పడం లేదు. ఆయన అడుగులు టీడీపీవైపు పడుతున్నాయా? సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ కార్యక్రమాల్లో వరుసగా తుమ్మల పాల్గొంటుండటం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తాజాగా మరోసారి టీడీపీ నేతల సమావేశంలో తుమ్మల పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. నేలకొండపల్లి మండలం కొత్తూరులో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించుకోవడం తమ దురదృష్టమన్న స్థానిక నేతలు ఈ సారి పాలేరులో పోటీ చేస్తే పార్టీలకతీతంగా గెలిపించుకుంటామన్నారు. అటు తుమ్మల కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు వేరే మార్గం లేదని తప్పకుండా ప్రజల ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన టీడీపీలోకి వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఖమ్మంలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో టీఆర్ఎస్ సతమతమవుతోంది. కేటీఆర్ సయోధ్య కుదిర్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా నేతలు పట్టువీడడం లేదు. దీనికి తోడు కారు ఓవర్ లోడ్‌తో వెళ్తోంది. పాలేరులో గత ఎన్నికల్లో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి, ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక, అదేసమయంలో టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమవుతున్న కమ్యూనిస్టులు పాలేరుపై కన్నేశారు. ఇటీవల పాలేరులో ఎర్రజెండా ఎగరేస్తామంటూ తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాలేరులో తనకు డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా భావిస్తున్న తుమ్మల కారు దిగే ఆలోచనలో ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అభిమానులను ఏకం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ పక్కా అనే సంకేతాలు పంపుతున్నారు. అయితే తరచూ టీడీపీ సమావేశాల్లో మెరుస్తున్న తుమ్మల కేవలం వారి మద్దతుకోసమే కలుస్తున్నారా లేక ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఏవైనా ఉన్నాయా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబు ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్ పెట్టారు. ఏపీకి సరిహద్దుగా ఉండడం గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాలు ఈ జిల్లాలోనే ఉండడంతో ఖమ్మం కేంద్రంగా రాజకీయం షురూ చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు చంద్రబాబు సహా పార్టీ ముఖ్యనేతలంతా హాజరు కానున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఖమ్మంలో జరగబోయే పబ్లిక్ మీటింగ్ ను లక్ష మందితో సక్సెస్ చేయాలని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలను రప్పించేందుకు ఆలోచిస్తున్నారు. పార్టీకి మళ్లీ జోష్ తెచ్చేలా బహిరంగ సభలో కొన్ని చేరికలు ఉంటాయని లీడర్లు చెబుతున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లిన తమ్ముళ్లను తిరిగి రప్పిస్తామని ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రధానంగా ఖమ్మం, సత్తుపల్లి నుంచి భారీగా చేరికలుంటాయని తెలుస్తోంది. రెండు మూడు నెలల్లో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా తిరిగి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్న మాట.