కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. దేశాన్ని కుదిపేస్తుందనుకున్న ఫాంహౌస్ ఎపిసోడ్ కామెడీ సిన్మాలా మారిపోయింది. ముగ్గురొచ్చి నలుగురితో కాసేపు మాట్లాడితే సరిపోతుందా? సాక్ష్యాలుండొద్దూ? ఫోన్లలో సవాలక్ష మాట్లాడుకుంటారు అంతమాత్రాన ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ కుట్ర జరిగిందంటే సరిపోతుందా? రేవంత్రెడ్డి ఓటుకునోటు కేసే కాస్త నయం. బ్యాగులోంచి నోట్లకట్టలు తీసి సర్దే వీడియోలైనా రికార్డ్ అయ్యాయి. ఈ కేసులో అదీ లేదు. అందుకే బీజేపీ వాదనకే బలం చేకూరింది. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించడానికి కారణాలపై హైకోర్టు సుదీర్ఘ కారణాన్నే వెల్లడించింది. తీర్పు ప్రతుల్లో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు పోలీసులు, ప్రభుత్వం దగ్గర సమాధానాలు కష్టమే. కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేయడానికి కారణాలు వివరిస్తూ 98 పేజీల తీర్పును హైకోర్టు విడుదల చేసింది. కొన్ని విషయాల్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనంటూ ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు ఆక్షేపించింది. విచారణ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు మీడియాకి, ప్రజలకి చేరిపోవడాన్ని తప్పుపట్టింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతం కావటంతో సిట్ ఎంక్వయిరీ పారదర్శకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లనే పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ పోలీసులు నమోదుచేసిన కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డితోపాటు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, న్యాయవాది భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వాటిపై సుదీర్ఘవాదనల తర్వాత కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు తన తీర్పులో అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరిచింది. సంచలనంకోసం వీడియోల లీకులిచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి ఈ తీర్పుతో నోటమాటరావడం లేదు.