టీఆర్ఎస్ నేతల అనాలోచిత తొందరపాటు, పోలీసుల అత్యుత్సాహం మొత్తం వ్యవహారాన్ని నీరుగార్చాయా ? బేరసారాల వ్యవహారంలో గులాబీ దళపతి పరువు పోయిందా ? పార్టీ శ్రేణులెవ్వరూ కామెంట్ చేయొద్దంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేయడం కూడా అందుకేనా ? మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి మంచి అస్త్రం దొరికినట్లేనా ?
రిమాండ్ విధించేందుకు నిరాకరించిన కోర్టు
ముగ్గురు అనుమానితుల అరెస్టు విధానంపై అభ్యంతరం
41సీఆర్పీసీ కింద విచారించాలన్న న్యాయమూర్తి
తక్షణమే విడుదల చేయక తప్పని పరిస్థితి
ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావులను బీజేపీలోకి రావాలంటూ భారీ మొత్తంలో ఆఫర్ చేయడం కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో డీల్ కుదుర్చుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సమాచారం సేకరించి…..రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసేందుకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బృందానికి రోజంతా పట్టింది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వారిని న్యాయమూర్తి నివాసంలో హాజరు పరుచగా.. రాష్ట్ర పోలీసుల మొహం పగిలిపోయే ఉత్తర్వులొచ్చాయి. అదుపులోకి తీసుకున్నప్పుడు నగదు స్వాధీనం కానందున అవినీతి నిరోధక చట్టం కింద రిమాండ్ విధించడం కుదరదని తేల్చిన న్యాయమూర్తి వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఏమైన అనుమానాలుంటే.. 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి ప్రశ్నించాలని సూచించారు. దానితో కోర్టు ఉత్తర్వుల మేరకు ముగ్గురిని తక్షణమే విడుదల చేయాల్సి వచ్చింది…
కోర్టు ఉత్తర్వులను టీఆర్ఎస్ ముందే ఊహించిందా..
పార్టీ నేతలెవ్వరూ కామెంట్స్ చేయవద్దని కేటీఆర్ ట్వీట్
కేసీఆర్ వ్యూహాత్మక మౌనం
గురువారం ప్రెస్ మీట్ పెట్టని సీఎం
కోర్టు ఉత్తర్వులను టీఆర్ఎస్ ముుందే ఊహించినట్లుంది. దిష్టిబొమ్మల దహనం లాంటి పోటా పోటీ కార్యక్రమాలు మినహా.. అగ్రనాయకత్వం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. వేచి చూసే ధోరణిని మాత్రమే పాటించింది. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. ఈ ఘటనలో ఆడియో టేపులను తెప్పించుకున్నారు. మంత్రులు కేసీఆర్, హరీష్ రావుతో మాట్లాడి ఆడియో, వీడియో ఆధారాలతో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించారు అడ్డంగా దొరికిన వారు మొరుగుతూనే ఉంటారన్న కేటీఆర్.. పార్టీ కేడర్ ఎవ్వరూ కామెంట్స్ చేయొద్దని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిందనేందుకు ఆ ఒక్క ట్వీట్ సరిపోతుందనిపిస్తోంది.
పోలీసుల ఓవరాక్షనే దెబ్బకొట్టిందా..
పైసా నగదు పట్టుబడకపోవడంతో పోయిన పరువు
ఫార్మ్ హౌస్ లో తనిఖీల వ్యవహారంపై పోలీసులు తొందరపడ్డారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు ఎమ్మెల్యేలకు తలా వంద కోట్లు ఆఫరిచ్చారన్న ప్రచారంలో నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు ఎంటరైపోయారు. పైగా సీపీ స్టీఫెన్ రవీంద్ర నేరుగా రంగంలోకి దిగారు. రోజంతా ఎంత వెదికినా పైసా దొరక్కపోవడంతో పోలీసులు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అందుకే కోర్టులో అది వీగిపోయింది.
బీజేపీ నేతల కౌంటర్ అటాక్
ఆఠణాకు పనికిరాని ఎమ్మెల్యేలంటున్న కమలం
నలుగురిని తీసుకెళ్లి ఏం చేస్తామని ఎదురు ప్రశ్న
కోర్టు ఉత్తర్వులు రాకముందే బీజేపీకి విషయం అర్థమైంది. టీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్ తో తప్పులో కాలేశారని నిర్ణయానికి వచ్చి కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ముందే టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వాళ్లు కావడంతో టీఆర్ఎస్ నేతల మాటల్లో విశ్వసనీయత కూడా లోపించింది. ఆఠణాకు కూడా పనికిరానివారికి ఎవరైనా వంద కోట్లు ఇస్తారా..అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు సంధించారు. నలుగురిని తీసుకెళితే ప్రభుత్వం మారదని తెలిసిన తర్వాత కూడా అలాంటి పనులు ఎందుకు చేస్తామని డీకే అరుణ ఎదురు ప్రశ్న వేస్తున్నారు..
టీఆర్ఎస్ లో కొత్త భయాలు
మునుగోడు ఫలితంపై అనుమానాలు
జనం ముందు దోషిగా నిలబడ్డామని గుసగుసలు
రెండు రోజుల పరిణామాలతో టీఆర్ఎస్ లో కొత్త భయాలు మొదలయ్యాయి. ఫార్మ్ హౌస్ లో సెన్సేషనల్ న్యూస్ అంటూ రెండు మూడు మీడియా సంస్థలకే లీకేజీలు ఇవ్వడం దగ్గర్నుంచి… నిందితులుగా చెబుతూ ముగ్గురు వ్యక్తులను పోలీసు స్టేషన్ కు తరలించే వరకు అంతా మిస్ హ్యాండ్లింగ్ అయిపోయిందంటూ పార్టీలోనే నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఏదో చేయబోయి పూర్తిగా దెబ్బతిన్నామన్న అనుమానం వారిలో కలుగుతోంది. ఒక అగ్రనేత… అతనితో పాటు పది పదిహేను మందిని కొనేందుకు ప్రయత్నించినట్లుగా నిరూపించగలిగితే.. కథ వేరుగా ఉండేదని… ఇప్పుడిది చిల్లరపనిగా మారిందని ఆందోళన కలుగుతోంది జనం ముందు టీఆర్ఎస్ దోషిగా నిలబడిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉప ఎన్నికకు వారం ముందు ఇలాంటి పనులు చేసి ఇబ్బందులను ఆహ్వానించామని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు…