మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు

By KTV Telugu On 19 December, 2022
image

ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిమీద తిరుగుబాటు ప్రకటించారు. ఇటు బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై తిరుబాటు ప్రకటించడం కలకలం రేపింది. మల్లారెడ్డి తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఆయనపై బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేయడం కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. ఎమ్మెల్యే మైనంప‌ల్లి నివాసంలో కుత్బూల్లాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, ఉప్ప‌ల్ ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్‌, మాధ‌వ‌రం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి సమావేశం అయ్యారు. మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఆయన ప్రోటోకాల్‌ పాటించట్లేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని పదవులన్నీ మంత్రి కారణంగా మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

దీనివల్ల తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం విషయంలో తమకు తెలియకుండానే రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించాడని మైనంపల్లి ఆరోపించారు. ఇతర ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయొద్దని మల్లారెడ్డి కలెక్టర్ కు చెప్పాడని అలాగే తాము చేపట్టే పనులకు మంత్రి అడ్డుతగులుతున్నాడని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీకే చెందిన మంత్రి మీద ఈవిధంగా తిరుగుబాటు ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఐదుగురి అసమ్మతి వెనకాల బీజేపీ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన వారే అని గుర్తు చేస్తున్నారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం లేక‌పోతే వీరందరూ కట్టకట్టుకుని బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే అటు బీజేపీ చేరికల కమిటీ తలుపులు బార్లా తెరుచుకుని రా రామ్మని ఆసమ్మతి నేతలను ఆహ్వానిస్తోంది. అందుకే ఈ అసమ్మతిని కేసీఆర్‌ ఎంత త్వరగా చల్లార్చితే ఆ పార్టీకి అంత మేలు జరుగుతుంది.