ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తుస్సుమంటుందా

By KTV Telugu On 6 December, 2022
image

పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

తెలంగాణ‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు దాఖ‌లు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి గట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎలాగైనా బీజేపీని బజారుకులాగాలని కేసీఆర్‌ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ కేసును సిట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నందకుమార్‌, రామచంద్ర భారతి, సింహయాజిలను అరెస్టు చేశారు. వారిని విచారించిన తరువాత మరికొందరికి నోటీసులు జారీ చేశారు.

బీజేపీ ముఖ్య నేత బి.ఎల్. సంతోష్‌, తుషార్‌, జగ్గూస్వామిలను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. కానీ వారెవరూ విచారణకు రాలేదు. హైకోర్టు ఆదేశాలతో వారికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరోవైపు బీఎల్ సంతోశ్‌ విచారణపై ఉన్న స్టేను హైకోర్టు ఈనెల 13 వరకు పొడగించింది. జగ్గుస్వామిపై సిట్ అధికారులు జారీ చేసిన లుకౌట్ నోటిసులపై ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై కూడా న్యాయస్థానం స్టే విధించింది. తాజాగా ఈ కేసులో అనుమానితులుగా ఉన్న బీఎల్ సంతోష్‌, తుషార్‌, జ‌గ్గుస్వామి, అడ్వకేట్‌ శ్రీ‌నివాస్‌ల‌ను నిందితులుగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్ దాఖలు చేసిన మోమోను కొట్టేసింది.

సంఘ‌ట‌నా స్థ‌లంలో డ‌బ్బు దొర‌క‌లేద‌ని అలాగే మెమోలో పేర్కొన్న నిందితులు అక్క‌డ లేర‌ని కోర్టు పేర్కొంది. సంఘ‌ట‌న స్థ‌లంలో లేని వారిని నిందితులుగా చేర్చ‌డం ఏంట‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టి వేసింది. ఏసీబీ కోర్టు తీర్పుతో సిట్‌ దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. దూకుడు మీదున్న దర్యాప్తుకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది. అటు బీఎల్ సంతోష్‌తో పాటు మిగిలిన నిందితుల‌కు పెద్ద ఊర‌ట దొరికింది. ఈ కేసుపై సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తార‌నేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.