నోటీసులివ్వగానే అయిపోదు..అసలు కథ ముందుంది!
నోటీసులిచ్చుకోండి..అరెస్ట్ వద్దు. ఫాంహౌస్ కేసు ట్విస్టు!
ఫాంహౌస్ కేసులో ఎలాగైనా బీజేపీ పెద్ద తలకాయల జుట్టు దొరకబట్టాలనుకుంటోంది టీఆర్ఎస్. సీపీ ఆధ్వర్యంలోని సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తూ నోటిసులిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కి నోటీస్‌తో మరో అడుగు ముందుకేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పుడు ఏకంగా ఈ ఎపిసోడ్లో అందరినీ వెనకుండి నడిపించిన వ్యక్తిని టార్గెట్ చేసింది. 21న విచారణకు హాజరుకావాలని బీఎల్సంతోష్కి నోటీసులు ఇచ్చింది.
బీఎల్ సంతోష్ జాతీయ రాజకీయాల్లో పవర్ఫుల్ లీడర్. ఫాంహౌస్ నిందితులు చెప్పుకున్న ‘వన్, టూ’లు కూడా సంతోష్ చెప్పినట్లు వినాల్సిందే. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. సంఘంలో పెద్దమనిషి. ఫాంహౌస్ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన పేరొచ్చినప్పుడే అంతా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఏకంగా నోటీసులదాకా వెళ్లింది. నవంబరు 21న విచారణకు రావాలని బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. అందులో ఫోన్ నెంబర్ని కూడా IMEIతో పాటు ప్రస్తావించింది. విచారణకు సహకరించకపోతే అరెస్ట్ తప్పదని ఆ నోటీసులో హెచ్చరించింది.
బండి అనుచరుడితో పాటు బీఎల్ సంతోష్‌కి నోటీసులివ్వడంపై బీజేపీ కోర్టుకెక్కింది. వీరిద్దరికీ కేసుతో సంబంధంలేదని వారికి నోటీసులు రద్దుచేయాలని కోరింది. నోటీసులిచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదంటూ సిట్ కూడా పిటిషన్ వేసింది. వీటిని విచారించిన హైకోర్టు నోటీసులిచ్చేందుకు సహకరించాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. అదే సమయంలో మళ్లీ ఆర్డర్స్ ఇచ్చేదాకా బీఎల్ సంతోష్‌ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. తమ జోలికొస్తే ఎంత పెద్దోళ్లయినా వదిలిపెట్టేది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగానే సంకేతాలిస్తోంది. బీజేపీ ప్రముఖులను టచ్ చేయడం ద్వారా పుట్టలో వేలుపెడితే కుట్టకుండా వదిలిపెట్టమని హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటికే సిట్ ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో అనుమానితుల కోసం గాలించింది. ఫాంహౌస్ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ముగ్గురూ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఎల్ సంతోష్‌కి కూడా ఆ పరిస్థితి వస్తే అది బీజేపీకి పెద్ద దెబ్బే. కేంద్రంలో కీలకమైన ఇద్దరికీ ఆప్తుడైన వ్యక్తిని చట్టం చట్రంలో ఇరికిస్తే జాతీయరాజకీయాల్లో కేసీఆర్‌కి అదో ప్లస్‌పాయింట్ అవుతుంది. లిక్కర్ స్కామ్‌లో తన కూతురిని ఇరికించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మరింత ఇరిటేట్ అవుతున్నారు కేసీఆర్. అందుకే విజయమో వీరస్వర్గమో అన్నట్లు మొండిగా ముందుకెళ్తున్నారు.