సిట్‌తో ఇరికిద్దామనుకుంటే సీన్‌ రివర్సయ్యింది!

By KTV Telugu On 26 December, 2022
image

నో ఎంట్రీ బోర్డు పెట్టేసినా సీబీఐ బ్యారికేడ్లు తోసుకుని మరీ రాబోతోంది. బీజేపీ పెద్దలని భలే ఇరికించామని సంబరపడ్డ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేతుల్లోంచి కీలక కేసు జారిపోతోంది. ఫాంహౌస్‌ కేసులో సిట్‌ని ఏర్పాటుచేసి బీజేపీ లింకుల్ని బట్టబయలు చేయాలనుకున్న గులాబీపార్టీ ఆశలపై తెలంగాణ హైకోర్టు నీళ్లు చల్లింది. ఎమ్మెల్యేల బేరసారాల కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేసు ఎంక్వయిరీ సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోతోంది. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి ఓ రకంగా ఊహించని షాకేనని చెప్పొచ్చు.

గులాబీపార్టీ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు బీజేపీ దళారులు ప్రయత్నించారనేది సిట్‌ అభియోగం. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో బేరసారాలు జరుగుతుండగా సైబరాబాద్‌ పోలీసులు ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు సంప్రదించారు. అంతా పైలెట్‌ ఫాంహౌస్‌లో కలిశారు. పార్టీ ఫిరాయిస్తే రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఏ ఇబ్బందీ లేకుండా రక్షణ కల్పిస్తామని బీజేపీ దూతలను చెప్పుకున్నవారు ప్రలోభపెట్టారు. దీంతో ఫరీదాబాద్‌కి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజులు హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫాంహౌస్‌ కేసు విచారణకు ప్రభుత్వం సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన సిట్‌ ఈ కేసుతో ప్రమేయం ఉన్న కొందరికి నోటీసులు ఇచ్చింది. ప్రత్యేక బృందాలు ఢిల్లీ, కేరళ ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు జరిపాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సాక్ష్యాలకోసం కేసులో నిందితుల పాత్రను నిర్ధారించే ఆధారాల కోసం సిట్‌ గట్టి ప్రయత్నాలు చేస్తుండగానే కేసు దర్యాప్తు బాధ్యతను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు విచారణను సీబీఐతో జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సిట్ విచారణపై అనుమానాలున్నాయన్న పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అవకాశం దొరికితే బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ని కూడా విచారించాలనుకుంది సిట్‌. సీబీఐకి అప్పగింతతో ఈ కేసులో చివరికి ఏమీ తేలకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.