బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపు తిరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా సిట్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మరికొందరికి నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ నిందితులతో పాటు బీజేపీ నేతలు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ను రద్దు చేసి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ దశలో కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వాదించారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ ఇప్పటికే చాలా పురోగతి సాధించిందని అందుకే సిట్ తోనే దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల తరఫున రాంచందర్ రావు వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు పెట్టారని కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా బీజేపీ పేరు ప్రస్తావించారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అసలు ఈ కేసును విచారించే అధికారం ఏసీబీకి తప్ప సిట్ కు లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సిట్ జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని స్పష్టం చేసింది.