డబ్బులు దొరకలేదంతే.. బోలెడన్ని సాక్ష్యాలు!
ఫాంహౌస్ కేస్‌లో ఏ చిన్న ఆధారాన్నీ వదలడం లేదు తెలంగాణ పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో దొరికిన ముగ్గురే కాదు తెరవెనుక ఇంకా ఎవరెవవరున్నారో కూపీలాగుతున్నారు. మాకేం సంబంధం అంటూనే బీజేపీ సీబీఐ దర్యాప్తుకి డిమాండ్ చేస్తోంది. తెలంగాణగడ్డకొచ్చి మోడీ తీవ్ర విమర్శలు చేసిన తర్వాత కేసీఆర్ సర్కార్ ఫాంహౌస్ కేసుని మరింత సీరియస్‌గా తీసుకుంది. సీపీ ఆధ్వర్యంలోని సిట్ అన్ని ఆధారాలను శాస్త్రీయంగా నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలు సిద్ధంచేస్తోంది. తాజాగా ఫాంహౌస్ కేసులో ఓ డాక్టర్ పాత్ర బయటపడింది. కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి సన్నిహితుడైన కేరళ డాక్టర్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఫాంహౌస్ కేసులో మరో నిందితుడిగా ఉన్న నందకుమార్ హోటల్లో సోదాలు జరిగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఈ కేసుతో సంబంధమున్న ఎవరినీ వదిలేది లేదన్న సంకేతమిస్తోంది సర్కారు. లిక్కర్ స్కామ్‌లాగే ఫాంహౌస్ కేసులో కొత్త కొత్త ట్విస్టులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం దేశవ్యాప్తంగా ఏడు బృందాలతో ఆపరేషన్ కొనసాగిస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల నెట్‌వర్క్‌ని సిట్ ట్రేస్ చేస్తోంది. ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతి ఉండే ఫరీదాబాద్, ఆయన తరచూ వెళ్లే కేరళలోనూ సిట్ సోదాలు చేస్తోంది.
కాల్‌డేటా, ఆడియో రికార్డులతో ఫాంహౌస్ నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఆ ముగ్గురి కాల్స్‌లో రికార్డయిన నెంబర్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిపినవారిని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రలోభపెట్టినవారి సంభాషణల్లో జాతీయస్థాయి ప్రముఖుల పేర్లు ఉండటంతో సిట్ బృందం న్యాయ నిపుణులతో సమావేశమవుతోంది. ఇప్పటికే కేసీఆర్ సంచలన ఆడియో రికార్డులను సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులు, డీజీపీలు, మీడియాకు పంపించినప్రింట్ మీడియా అధినేతలు, న్యూస్‌ఏజెన్సీలు, బార్ అసోసియేషన్లకు పంపించారు. దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలని, బీజేపీ తెరవెనుక ఎలాంటి రాజకీయాలు నడుపుతోందో అందరికీ తెలియాలని ఈ పనిచేశారు. ఫాంహౌస్ కేసు నిలబడదన్న ఊహాగానాలకు తెరదించేలా తెలంగాణ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.