పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా

By KTV Telugu On 18 November, 2022
image

బీజేపీ ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌
తనపై అరవింద్‌ చేసిన ఆరోపణలకు రియాక్షన్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చినికి చినికి గాలివాన అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌ దర్యాప్తు చేస్తోంది. అటు ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తన కూతురు కవితను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించారు సీఎం కేసీఆర్‌. బీజేపీలో చేరాలని అడిగేవారిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ప్రలోభపెట్టినవారిని ట్రాప్‌చేసి ఆడియో వీడియో టేపులు ఆధారాలుగా సంపాదించిన కేసీఆర్‌ కవితను ఎవరు పార్టీ మారాలని ఎవరు అడిగారో చెప్పలేదు.

కేసీఆర్‌ ఆరోపణలపై బీజేపీ రియాక్టయ్యింది. కేసీఆర్‌నే ఎవరూ దేకరు ఆమె బిడ్డను ఎవరు పట్టించుకుంటారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రేపో మాపో కవితకు ఈడీ నోటీసులు రాబోతున్నాయని ఒకవేళ కవితకు ఈడీ నోటీసులు పంపిస్తే బీజేపీ ఒత్తిడికి కవిత తలొగ్గలేదు కనుకే ఆమెకు ఈడీ నోటీసులు పంపించారని ప్రచారం చేసుకోవడానికే కేసీఆర్‌ ఈవ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్‌ మరో అడుగు ముందుకేసి కవిత మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత తన తండ్రి కేసీఆర్‌ మీద అలిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని మల్లికార్జున ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయం తెలిసే కేసీఆర్‌ తన కూతురిని వెంటబెట్టుకుని లక్నో, ఢిల్లీ టూర్‌కు తీసుకెళ్లారని చెప్పారు. సెకండ్‌ హ్యాండ్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీకి అవసరం లేదన్నారు.

చివరకు కాంగ్రెస్‌ పార్టీ కూడా కవితను చేర్చుకోడానికి ఇష్టపడలేదని చెప్పారు. అరవింద్‌ ఆరోపణలపై కవిత తీవ్రంగా స్పందించారు. ఇంకోసారి తన గురించి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పు తో కొడతానని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. ఇకనుంచి అరవింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తామన్నారు. పద్దతి మార్చుకోకపోతే పట్టుకుని తంతాం, కొట్టి కొట్టి చంపుతాం అని హెచ్చరించారు. కవిత ప్రెస్‌మీట్‌కు కొద్ది నిమిషాల ముందు హైదరాబాద్‌లోని ఎంపి అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. వంద మందికి పైగా ఒక్కసారిగా ఇంట్లోకి దూరి ‌కారు అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటిపై దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు ఎవరూ లేకపోవడం, దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఇంటిపై దాడి, కవిత వ్యాఖ్యలపై బీజేపీ రియాక్షన్‌ ఎలా ఉండబోతుందో చూడాలిక.