గులాబీపార్టీ పుట్టిందే తెలంగాణ సెంటిమెంట్‌తో. అధికారంలోకి రాకముందు భావోద్వేగాల్ని రగిలించినా రాష్ట్ర సాధన తర్వాత వరసగా రెండుసార్లు గెలుపు గుర్రం ఎక్కినా పార్టీ పేరులోని తెలంగాణ బలంతోనే. కానీ సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదనుకున్నారో జాతీయపార్టీలో ప్రాంతీయ పేరు సెట్ కాదనుకున్నారో కానీ కేసీఆర్ పార్టీ పేరులో ఇప్పుడు తెలంగాణం లేదు. భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది గులాబీపార్టీ. రాజకీయ ప్రత్యర్థులకు ఈ నిర్ణయంతో గట్టి ఆయుధాన్ని అందించారు కేసీఆర్. తెలంగాణవాదాన్ని వదిలేశారన్న విమర్శకు తావిచ్చారు. టీఆర్ఎస్లా బీఆర్ఎస్ హిట్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించబోతోంది. అయితే కేసీఆర్ వదిలేసుకున్న తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకునేందుకు వేరే శక్తుల ప్రయత్నాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ తెరపైకొస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాదుగానీ తెలంగాణ పేరుతో అదే రంగు జెండాతో కొత్త పార్టీ పురుడుపోసుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. షార్ట్ కట్లో టీఆర్ఎస్ అని వచ్చేలా కొత్త పార్టీ డిజైన్ ఉండబోతోంది. ఆ పార్టీ పేరు తెలంగాణ రైతు సమితి కావచ్చు. తెలంగాణ రక్షణ సమితిగా కూడా ఉండొచ్చు. ఇప్పటికే గుర్తింపు పార్టీగా ఉన్న తెలంగాణ రాజ్య సమితి కొత్త రూపంతో తెరపైకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు.
కొత్త పార్టీ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయంటున్నా వాళ్లెవరన్న క్లారిటీ ఇంకా లేదు. అయితే టీఆర్ఎస్గా ప్రజల్లోకి వెళ్లేదుకు నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్నారు. పార్టీనే కాదు జెండా రంగు కూడా కేసీఆర్ పార్టీకి దగ్గరగా ఉంటుంది. బ్రైట్ పింక్ లేదా ఫుల్ పింక్ పెట్టుకోవాలన్నది ఆలోచనట. అంటే సింబల్ తప్ప మిగిలినవన్నీ అచ్చుగుద్దినట్లు కేసీఆర్ జెండాలాగే ఉండబోతున్నాయన్నమాట. పార్టీ పేరునే మార్చేశాక కేసీఆర్ తెలంగాణవాదం వర్కవుట్ కాకపోవచ్చు. అందుకే అదే ఎజెండాతో కొత్తపార్టీ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కి దూరమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీ వెనుక కీలకంగా ఉన్నారంటున్నారు. కేసీఆర్ పార్టీకి దూరమయ్యాక ఆత్మీయభేటీలు రాజకీయ వ్యూహాలతో ఖమ్మం జిల్లాలో ఆయన సవాలు విసురుతున్నారు. కొన్నాళ్లక్రితం ఉన్నట్టుండి ఆయన ఇంటి ముందు తెలంగాణ రైతు సమితి పేరుతో ఫ్లెక్సీలు కూడా కనిపించాయి. ఇతర పార్టీలనుంచి ఆహ్వానాలు ఉన్నా ఇప్పటిదాకా పొంగులేటి ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీనుంచి ఫలానా అభ్యర్థులు ఉంటారంటూ బహిరంగసభల్లోనే ప్రకటించేశారు. పైకిచెప్పకపోయినా ఆయన కొత్త పార్టీ ఏర్పాట్లలో ఉన్నట్లుంది. ఆయనతో పాటు మరికొందరు ముఖ్యులు కూడా కొత్త టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి రాళ్లెత్తే పనిలో ఉన్నారు.