తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైనపటారం.. లోన లొటారం అన్నట్లుగా ఉందా.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని చెప్పుకుంటున్న పార్టీకి చేతి నిండా సమస్యలున్నాయా ? పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ద్వితీయ శ్రేణి నేతలు ముందుకు రావడం లేదా ? నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయా.
2023లో తమదే అధికారమంటున్న అమిత్ షా
ఆశ బారెడు.. సీన్ మూరెడు
నియోజకవర్గాల కన్వీనర్లలో అసంతృప్తి
బాధ్యతగా పనిచేసేందుకు ససేమిరా
కన్వీనర్ బాధ్యత నుంచి తప్పించాలని కొందరి వేడుకోలు
బూత్ కమిటీ బాధ్యతలకు కూడా పెద్ద సమస్కారం
బతిమలాడి, భయపెట్టి పదవిలో ఉంచుతున్న అధిష్టానం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని బీజేపీ అంటోంది. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించి ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని ఢిల్లీలో ఉండే బీజేపీ అధిష్టానం చెప్పుకుంటోంది. తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేసే రోజు ఎంతో దూరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. వినటానికి చిలక పలుకుల్లా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీల తరపున పనిచేయడానికి ద్వితీయ శ్రేణి నాయకులు ముందుకు రావడం లేదు.
బండి సంజయ్ , డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇలా కొందరు నేతలు పవర్ ఫుల్ డైలాగ్స్ వదులుతున్నప్పటికీ పార్టీ పరిస్థితికి వారి మాటలకు పొంతన కనిపించడం లేదు. ఇంఛార్జ్ పదవులు వద్దు బాబోయ్ అని క్షేత్రస్థాయిలో నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకు చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. వెళ్లి అడిగినా ఓటేస్తారన్న నమ్మకం కలగడం లేదట. మునుగోడు ఉపఎన్నిక చూసిన తర్వాత ధనప్రవాహం లేనిదే గెలవడం కష్టమన్న అభిప్రాయానికి స్థానిక నేతలు వచ్చేశారు. బీజేపీ నేతల దగ్గర అంత డబ్బు లేదు. అధిష్టానం పదవులు ఇచ్చిన తీరు కూడా కింది స్థాయి నాయకులకు బొత్తిగా నచ్చలేదు.
కొంతకాలం క్రితం 119 నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. జంబ్లింగ్ పద్ధతిలో జరిగిన నిమాయకంలో సొంత నియోజకవర్గంలో కాకుండా వేరు ప్రాంతాలకు కన్వీనర్ బాధ్యతలు వచ్చాయి. దానితో కన్వీనర్లుగా వెళ్లిన వారికి అక్కడి కార్యకర్తలు, నేతల నుంచి సహాయ సహకారాలు అందడం లేదు. పైగా వేరు నియోజకవర్గంలో పనిచేస్తే తమ ప్రాంతంలో పరపతి పెంచుకునేందుకు అవకాశం రాదన్న భయమూ వారిలో నెలకొంది. దానితో మొత్తం ప్రక్రియనే మార్చేసి సొంత ప్రాంతాల్లో కన్వీనర్ల నియామకం జరగాలని నేతలు కోరుతున్నారు. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, తెలంగాణ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ కూడా ఒప్పుకోలేదు. పార్టీని పటిష్టం చేయడంలో ప్రూవ్ చేసుకుంటే వాళ్లు కోరుకున్నట్లుగా ఆవకాశం ఇస్తామని చెబుతున్నారు..
బీజేపీ శిక్షణ తరగతుల్లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. తమను కన్వీనర్ బాధ్యతల నుంచి తప్పించాలని లేకుంటే సొంత నియోజకవర్గాలను అప్పగించాలని బీజేపీ నాయకత్వంపై వారు ఒత్తిడి పెంచుతున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగిస్తే గుర్తింపుతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు సులువవుతుందని పెద్దల దగ్గర వాపోతున్నారు. వారి మాటలకు విలువ ఇవ్వాల్సిన అధిష్టానం తీరు మాత్రం వేరుగా ఉంటోంది. ప్రతీ పోలింగ్ బూత్ కు 22 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ప్రత్యేక కమిటీల సాయంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని చెప్పేశారు. దీనితో కన్వీనర్లు నిరాశ చెందుతున్నారు. తమ మాట పట్టించుకునే వాళ్లే లేరని వాపోతుంటే ఈ కొత్త బాధ్యతలేమిటని తలలు పట్టుకుంటున్నారు. స్థానికంగా తమకు పట్టు లేకపోవడం పోలింగ్ కేంద్రానికి 22 మందిని నియమించేంతగా కార్యకర్తల బలం లేకపోవడం వారికి ఇబ్బందిగా మారింది. నియోజకవర్గాల కన్వీనర్లు విషయంలో జిల్లా అధ్యక్షులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. తాము కోరుకున్న వారిని కోరుకున్న నియోజకవర్గాల్లో నియమించుకోలేకపోయామని అంతా అధిష్టానం నిర్ణయమైపోయిందని ఆగ్రహం చెందుతున్నారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ అసంతృప్తి ఎటు దారి తీస్తుందో చూడాలి.