తెలంగాణ వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అధికార విపక్షాలు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇతరుల కంటే ధీటుగా వేడుకలు జరిపిందుకు ప్రయత్నిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, అసలు తెలంగాణ తెచ్చిందే తాము అన్న సందేశమివ్వాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఎవరు పైచేయిగా నిలుస్తారన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న…..
జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.తెలంగాణ ఇచ్చిందీ కాంగ్రెస్ అన్న సందేశాన్ని మరోసారి జనంలోకి తీసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగులోనూ సీఎం రేవంత్ ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వేడుకలకు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు. త్వరలోనే వేదిక ఖరారు చేయడం, నిర్వహణ తీరుపై అజెండాను సిద్ధం చేసుకోవడం లాంటి పనులు చేపడతారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని వేడుకలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ఏర్పాటు వెనుక కీలక పాత్ర వహించిన నేతగా ఆమెను సన్మానించాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియాకు ఆహ్వానపత్రం అందిస్తారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ వహించిన భూమికను వివరిస్తారు. సోనియా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను ఏర్పాటు చేశారని, దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం ఏర్పడినా వెనుకాడలేదని పీసీసీ నేతలు ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదని, 1200 మంది విద్యార్థులు, యువత, తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాల వల్లే వచ్చిందని ఊరూరా చెప్పబోతున్నారు. పైగా పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్…తెలంగాణ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుని ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీశారని, అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేశారని కాంగ్రెస్ అంటోంది….
గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఆ పార్టీ దాదాపుగా చిన్నాభిన్నమైంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బే తగిలిందని అంటున్నారు. ఫలితాలు వస్తే గానీ పూర్తి వివరాలు తెలియవు. ఈ నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా మళ్లీ పుంజుకోవాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు….
కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించే ఉత్సవాలకు ధీటుగా బీఆర్ఎస్ సైతం తెలంగాణ భవన్‌లో వేడుకలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించే ఆ పార్టీ నేతలు.. ఆయన చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని చెబుతారు. ఆ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని కొనసాగించేందుకు వీలుగా..ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రామ్‌ను తలదన్నే రీతిలో వేడుకలు నిర్వహించాలనే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో తొలిసారి తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన హీరోగా నిలబెట్టాలనుకుంటున్నది. పదేండ్ల పాలనా ఫలాలను ప్రదర్శించడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్యమానికి ఊపిరులూదిన ఘట్టాలన్నింటినీ ప్రజలకు తెలిసేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను పెట్టి ప్రజల్లోకి బలమైన మెసేజ్‌ను తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే అది సాధ్యపడేది కాదని జూన్ 2 నుంచి ప్రచారం చేయబోతున్నారు.
సోనియా సెంట్రిక్ గా జూన్ 2 వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. కేసీఆర్ ను ప్రశంసిస్తూ కార్యక్రమాలు రూపొందించాలని బీఆర్ఎస్ తీర్మానించింది. ఇరు వర్గాలు తమ భవిష్యత్ కార్యాచరణకు రాష్ట్రావతరణ వేడుకలను వాడుకోవాలని చూస్తున్నాయి. జనం ఎవరి మాట విశ్వసిస్తారో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…