వంద సార్లు కేసీఆర్‌ కాళ్లు మొక్కుతా !

By KTV Telugu On 22 November, 2022
image

ఇటీవల సీఎం కాళ్లు మొక్కిన హెల్త్‌ డైరెక్టర్‌
తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన శ్రీనివాసరావు

రాజకీయాల్లోకి రావాలంటే ఏదో ఒక పార్టీలో చేరి ప్రజా సేవ చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. పార్టీ పెద్దల అనుగ్రహం ఉంటే ఏదో ఒక పదవి కూడా రాకమానదు. ఇదంతా జరగాలంటే చేతినిండా డబ్బుండాలి. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడాలి. ఉద్యమాలు చేయాలి. అయినాసరే వారు అనుకున్నది సాధిస్తారా అంటే గ్యారంటీ లేదు. అందుకే కొందరు ఓ షార్ట్‌కట్‌ మెథడ్‌ కనిపెట్టారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోడం కోసం కాళ్లు మొక్కే సిద్ధాంతాన్ని కనిపెట్టారు. కాళ్లు మొక్కడం ద్వారా పెద్దలను కాకా పడితే ఏదో ఒక పదవి రాకుండా పోతుందా అనేది వారి ఆలోచన. ఇటీవల ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రాజకీయాలపై మోజు పెరిగిపోయింది. ఈ ధోరణి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు ఇంతకు ముందు బ్యూరోక్రాట్లు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి రాణించారు.

ఈమధ్య ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి కూడా త్వరలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్య కొందరు ఉన్నతాధికారులు కాళ్లు మొక్కడం ద్వారా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఆమధ్య సిద్ధిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకి ఎక్కారు. అప్పుడు కలెక్టర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు 2016లో కూడా వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కేసీఆర్‌ కాళ్లు మొక్కారు. ఇలా ఐఏఎస్​ ఆఫీసర్లు రాజకీయ నాయకుల కాళ్లు మొక్కడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయిపోయారు.

ఇప్పుడు తెంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శల పాలయ్యారు. ఒకసారి కాదు రెండు సార్లు అత్యంత వినయంగా వంగి కాళ్లు మొక్కడం చూసి జనం ఆశ్చర్యపోయారు. కొత్తగూడం నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారని అందుకే కేసీఆర్‌ కాళ్లు మొక్కుతూ ఆయన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాసరావు మీద విమర్శలొచ్చాయి. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో తనకు తాను దేవతగా అభివర్ణించుకున్న ఒక మహిళ నిర్వహించిన ఓ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెల్త్‌ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని అప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు శ్రీనివాసరావు. కేసీఆర్ తన దృష్టిలో తెలంగాణ బాపు. ఆయన పాదాలకు నమస్కరిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఒక్కసారి వంద సార్లైనా కేసీఆర్‌ కాళ్లు మొక్కుతా అని ప్రకటించారు. కేసీఆర్‌తో ఫోటో దిగడం, ఆయన పాదపద్మాలను తాకడం తన అదృష్టంగా భావిస్తాననే విషయాన్ని ఇదివరకు కూడా చెప్పానన్నారు. శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయాల్లోకి వెళ్లడం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.