తెలంగాణకు తానే దిక్కు అన్న కేసీఆర్ వాదనను దెబ్బకొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు పూర్తిగా చెరిపేయ్యాలన్న ప్రయత్నమూ ఆయన చేస్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పాలనాకాలం నాటి అవినీతిని ఎండగడుతూనే తెలంగాణపై కేసీఆర్ ముద్ర లేకుండా చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకే తెలంగాణ చిహ్నంలో మార్పులు చేశారు. ఈ క్రమంలో తొందరపాటుగా తప్పులు జరిగిన మాటక వాస్తవం. అందుకే చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతకీ పాత లోగోకు, కొత్త లోగోకు ఉన్న తేడాలేమిటన్న చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంది……
రాష్ట్ర ఏర్పాటనేది కేసీఆర్ ఒక్కరు వల్లే సాధ్యం కాలేదనే భావనను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ అధికారిగా చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు తొలగించేసింది. కొత్తగా అమరవీరుల స్థూపాన్ని,రెండు వైపుల రెండు వరి కంకులను జత చేసింది. తద్వారా రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరుల త్యాగానికి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం ఉద్యమకారులు, అమరవీరులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ, రేవంత్ రెడ్డి వారికిప్పుడు సముచిత స్థానం కల్పించారని చెప్పుకోవడం కూడా వారి ఉద్దేశమే… ఈ క్రమంలో కేసీఆర్ కు చెక్ పెట్టేసినట్లైంది. పైగా నిజాం, కాకతీయ రాజుల పాలనకు పెద్ద పీట వేసిన కేసీఆర్ పదేళ్ల పాటు ఉద్యమకారులను దూరం పెట్టారని చెప్పడం కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశంగా చెప్పాలి..అంతేకాక కాళేశ్వరం లోతుపాతులను ఎత్తి చూపి..ఆ ప్రాజెక్టుపై తరువాత ఎంక్వయిరీ చేయించడం ద్వారా సాగునీటి విషయంలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ పెద్దగా చేసింది ఏం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు సక్సెస్ అయ్యారు. మొత్తానికి తెలంగాణకు తానే పెద్ద దిక్కని చెప్పుకున్న కేసీఆర్.. సంగతి ఏంటో తేల్చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.
అసలు కొత్త లోగోలో ఉన్నట్లుగా చెబుతున్న చిహ్నాల్లో ఉన్నదేమిటి. బయటకు లీకైన లోగోకు, పాత లోగోకు మౌళికంగా ఉన్న తేడా ఏమిటి. అధికార చిహ్నంలో మార్పుల గురించి బీఆర్ఎస్ శ్రేణులు గాయగత్తర ఎందుకు చేస్తున్నాయి. వాటిపై లొల్లి చేయాల్సినంత సీన్ ఉందా….
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఇంకా తెలంగాణ చిహ్నం నమూనాను విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో ఒక బొమ్మ మాత్రం తిరుగుతోంది. అది వరి కంకులున్నాయి. ఆ క్రమంలో అది కొంత మేర ఐక్యరాజ్యసమితి చిహ్నాన్ని పోలి ఉంది. కేసీఆర్ పాలనా కాలం నాటి చిహ్నంతో మూడు భాషలు…అంటే ఆంగ్లం, తెలుగు, ఉర్దూలో రాసి ఉంటే.. ఇప్పుడు కొత్తగా హిందీ కూడా వచ్చి చేరింది. రెండింటిలోనూ మూడు సంహాలు దాని కింద రాసి ఉన్న సత్యమేవజయతే కామన్ అని చెప్పక తప్పదు. పాత చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమయ్యాయి. కొత్తగా అమర వీరుల స్థూపం ఎంట్రీ ఇచ్చింది. అది తెలంగాణ అమర వీరులకు జోహార్లు అర్పించడమేనని చెప్పుకునేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్న వేళ.. అధికారపార్టీని బీఆర్ఎస్ కార్నర్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే చార్మినార్, కాకతీయ తోరణం మతచిహ్నాలు కావు, వాటిని అధికార చిహ్నంలో ఉంచడం మతసామరస్యానికి సంకేతమూ కాదు… అవి రాచరికపు చిహ్నాలు కాబట్టి, ఆ ఆనవాళ్లను తొలగించడమే రేవంత్ రెడ్డి సర్కరు భావన అంటున్నారు కాబట్టి… మరి అశోక చక్రం, నాలుగు సింహాల బొమ్మ రాచరికపు ఆనవాలు కాదా అని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత చిహ్నాల్లో రెండు బొమ్మలను ఎందుకు తొలగించిందన్నది కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది. చార్మినార్ తెలంగాణ ప్రైడ్ కాదు, అది అప్పట్లో తెలంగాణ సంస్థానంలో ప్రబలిన ప్లేగు నుంచి జనాన్ని కాపాడిన తర్వాత అక్కడ ఒక స్మారకాన్ని నిర్మించారు.పైగా అప్పటి తెలంగాణ రాజ్యం వేరు, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం వేరు. అప్పటి తెలంగాణలో మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాంతాలూ ఉన్నాయి…కాకతీయ సామ్రాజ్య పరిపాలన రాజధాని తెలంగాణలో ఉండవచ్చుగాక, కానీ అప్పటి వాళ్ల సామ్రాజ్యం వేరు, ఇప్పటి తెలంగాణ వేరు… ఇప్పటి తెలంగాణ అంటే 1969 నుంచీ సాగిన ఉద్యమ పోరాటాల ఫలితంగా ఉన్న భౌగోళిక తెలంగాణ ఇప్పటి దృశ్యమని చెప్పాలి. అందుకే కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తెలంగాణ అస్థిత్వ చిహ్నాలుగా పరిగణించాల్సిన పనీ లేదన్నది ఒక వాదన. అది కొందరి మనోభావం కూడా కావచ్చని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఒక వర్గం తెలంగాణ యూత్ ను బీఆర్ఎస్ రెచ్చగొట్టి రచ్చ చేస్తుందన్న ఫీలింగ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ఉండొచ్చు. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ వాదులు ఒక సింటిమెంట్ గా మార్చేసి చాలా రోజులైంది. ఓరుగల్లు, కరీంనగర్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం సాగిన మాట వాస్తవం. అందుకే వ్యూహాత్మకంగా చిహ్నం విడుదలను రేవంత్ ప్రభుత్వం వాయిదా వేసి ఉండొచ్చు…
సోషల్ మీడియాలో కొందరు ఇంకో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదీ రెడ్డి వర్సెస్ వెలమ ఆధిపత్య పోరుగా కొందరు పుంఖానుపుంఖాలుగా రాసేస్తున్నారు. అది కూడా నిజం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెలమలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత లేదు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబంపైనే ఆగ్రహం తప్పితే అందులో సామాజిక సమస్యలేమీ లేవని చెప్పాలి. అయితే మార్పు సాధ్యమా, మార్పు మంచికేనా అన్నది కార్యాచరణకు దిగిన తర్వాతే తెలుస్తుంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…