TSRTC దివాలానే మిగిలిందా

By KTV Telugu On 9 May, 2024
image

KTV TELUGU :-

రాజకీయ నాయకులు  ఉచిత హామీలతో  ప్రజలకు ఎంత చేటు చేస్తున్నారో ఓ స్పష్టమైన ఉదాహరణ తెలంగాణ ఆర్టీసీ. ఆర్టీసీని ఆర్టీసీలాగా ఉంచకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో విలీనం అంటూ గత ప్రభుత్వం హడావుడి చేస్తూ.. కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో  ఆర్టీసీ సగం ఊపిరి తీసేసింది. ఇప్పుడు నెలకు 350  కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నామని చెబుతున్నారు కానీ.. అంత సొమ్ము ఇస్తే ఆర్టీసీకి కష్టాలు ఉండేవి కావు.  ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలిచ్చుకోలేని స్థితికి చేరిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉనికి ఇబ్బందుల్లో పడింది. ప్రజారవాణా  చిక్కుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. ఎంత ఆక్యుపెన్సీ వచ్చినా ఎప్పుడూ నష్టాల్లోనే ఉండే ఆర్టీసీకి మూలిగే నక్కపై తాటిపండులా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ హామీ  పథకం పడింది.  ఆదాయం సగానికి పడిపోయింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కనీసం విధి విధానాలు ఆలోచించకుండా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఫలితంగా  ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలో కూడా లెక్కలు వేయకుండా పథకం అమల్లోకి వచ్చేసింది.  ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు జీత, బత్యాలు ఇవ్వటానికి సంస్ధ దగ్గర డబ్బులు లేవు. ఉచిత పథకంకు ముందు ప్రతిరోజు ఆర్టీసీకి సుమారు 17 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే నెలకు దాదాపుగా ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రెండు వందల కోట్ల వరకూ డీజిల్ కోసం ఖర్చయ్యేది. ఇతర ఆదాయం జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకు సరిపోతుంది.

ఉచిత ప్రయాణం పథకం ప్రకటించిన తర్వాత ఆదాయం పడిపోయింది. ఇప్పుడు రోజుకు పది కోట్లు రావడమే గగనంగా మారిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.  మహిళలు టిక్కెట్లు తీసుకోవడం లేదు. కేవలం మగవాళ్లు మాత్రమే టిక్కెట్లు తీసుకుంటున్నారు.  వీళ్ళవల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే బస్సులు ఆడవాళ్ళతో నిండిపోతుండటంతో మగవాళ్ళకు బస్సుల్లో చోటు ఉండటంలేదు. అందుకని మగవాళ్లు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. ఫలితంగా టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం డీజిల్ ఖర్చులకూ సరిపోని పరిస్థితి ఏర్పడింది.  డీజల్  సరఫరా చేసే సంస్ధలు  ఆర్టీసీకి 48 గంటలు మాత్రమే డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నాయి.  దీంతో రోజూ డబ్బుల కోసం  వెదుక్కోవడం ఆర్టీసీకి సమస్యగా మారింది.

నిజానికి ప్రభుత్వం ఉచిత ప్రయాణం కింద ఆర్టీసీకి డబ్బులు రీఎంబర్స్ చేయాలి.  ప్రతి నెలా ఠంచన్ గా వాటిని చెల్లిస్తేనే ఆర్టీసీ మనుగడ కొనసాగుతుంది. ప్రభుత్వం ఇస్తోంది కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఇస్తోంది. ఫలితంగా  ఆర్టీసీ ఒడిదుడుకుల్లో కొనసాగుతోంది.  కనీసం రూ. మూడు వందల కోట్ల వరకూ ప్రభుత్వం ప్రతి నెలా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. అదేమి చిన్న్ మొత్తం  కాదు. కానీ తప్పదు  ప్రభుత్వం ప్రతినెలా రీఎంబర్స్ కూడా చేయటంలేదు. వచ్చే ఆదాయం ఆగిపోయినా, ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేయకపోయినా  ఆర్టీసీ మనుగడకు ప్రమాదం ఉన్నట్లే. ప్రభుత్వం ఒక్క ఉచిత ప్రయాణానికే కాదు.. వివిధ వర్గాలకు ఇంతకు ముందు నుంచే రాయితీలు ఇస్తోంది.  వాటిని సరిగ్గా రీఎంబర్స్ చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఉచిత హామీతో పూర్తిగా ప్రభుత్వమే ఆ భారం మోయాల్సి ఉంది.

గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ అది సాంకేతికంగా సాధ్యం కాదు. అందుకే ఉద్యోగుల్ని విలీనం చేస్తామని బిల్లు తెచ్చారు. పాస్ అయింది. గవర్నర్ ఆమోదించారు.  కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఉద్యోగులందర్నీ ప్రభుత్వంలోకి విలీనం చేసుకుని జీతాలు ప్రభఉత్వమే చెల్లిస్తే ఆర్టీసికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. వచ్చే ఆదాయం మొత్తం ఆర్టీసీ డీజిల్ కు.. నిర్వహణకు ఖర్చులకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.  అయితే అవి కూడా సరిపోతాయా లేదా అన్న సందేహాలు ఉన్నాయి.  ఉచిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. అమలు చేసేస్తున్నారు. మహిళల బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు. నష్టపోతోంది, నాశనమైపోతోంది ఆర్టీసీ సంస్ధ మాత్రమే.

అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్ధిక పరిస్దితి మీద ఉచిత హామీ అమలు కారణంగా మరింత దయనీయంగా తయారవుతోంది.  ఆర్టీసీ ప్రజలకు దూరమైతే ఆ  భారం పడేది ప్రజల మీదే. ఇప్పుడు ఉచితంగా ప్రయాణిస్తున్న వారు తర్వాత ప్రైవేటు వాహనాలకు అంతకు మించి కట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది.

ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత హామీలు ఎప్పుడూ ఉచితం కాదు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే అమలు చేస్తారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించినప్పుడే  ఆర్టీసీ లాంటి సంస్థలు మనుగడ సాగిస్తాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి