తెలంగాణలో నిరుద్యోగుల బతుకు గాల్లో దీపమేనా

By KTV Telugu On 18 March, 2023
image

సర్కారు కొలువొస్తే జీవితం సెటిలైపోతుంది. ఆరుపదుల వయసు వచ్చేదాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనుండదు. అందుకే రాత్రింబవళ్లు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కోసం అంత కష్టపడుతుంటారు నిరుద్యోగులు. కోచింగ్‌సెంటర్లు లైబ్రరీల చుట్టూ తిరుగుతుంటారు. కొందరు పట్టువదలని విక్రమార్కుల్లా పదేపదే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదో రోజు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. వంద ఉద్యోగాలుంటే లక్షమంది పోటీపడే రోజులివి. అలాంటిది కష్టపడే పన్లేకుండా ముందే పేపర్‌ చేతికిదొరికితే ఓ ఇరవయ్యో పాతిక లక్షలో పెట్టడానికి ఎంతమంది లేరు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగ నియామకాల క్వశ్చన్‌ పేపర్ల లీకేజీతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఓ తలమాసినోడు పేపర్లని పప్పుబెల్లాల్లా అమ్మేశాడు. తన శారీరక సుఖంకోసం ఉద్యోగాలను నడిబజారులో వేలానికి పెట్టాడు. వాడి బలహీనతను తెలుసుకున్న కొందరు వగలాడులు తమ వన్నెచిన్నెలు ప్రదర్శించి సొమ్ము చేసుకున్నారు. వినటానికే అసహ్యంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్ని పరీక్షల పేపర్లు రద్దయ్యాయో తెలీదు. అడ్డదారుల్లో ఎంతమంది ఉద్యోగాలు కొట్టేసి సర్కారు అల్లుళ్లలా సెటిలయ్యారో తెలీదు. కానీ ఇప్పటికే కష్టపడి నిరుద్యోగులు రాసిన పరీక్షల్ని మరోమార్గం లేక రద్దుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ డీఏవో పరీక్ష పేపర్లను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. పోయినేడాది సెప్టెంబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. రద్దు చేసిన ఈ పరీక్షని జూన్‌ 11న మళ్లీ నిర్వహిస్తారు.

పరీక్షల రద్దు వ్యవహారం ఇంతటితోనే ఆగేలా లేదు. త్వరలో జరగబోయే మరికొన్ని పరీక్షలను కూడా వాయిదా వేయాలనుకుంటోంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్లే దేవతావస్త్రాలన్న అభిప్రాయం ఉంది. అప్పుడప్పుడూ ఊరించేందుకు ఒకటీ అరా నోటిఫికేషన్లు ఇస్తుంటే వాటిలో మళ్లీ లీకేజీలగోల. నమ్మినవాళ్లే మోసం చేశారని స్వయానా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ చెప్పడం పెద్ద దివాలాకోరుతనం. లక్షలమంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడ్డ పరీక్షల్లో ఎవర్నో గుడ్డిగా నమ్మేయడమేంటి వాళ్లు అందరినీ ముంచేయడమేంటి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం ఇది. పైగా ఇలాంటి లీకేజీలు తెలంగాణలోనే కాదు దేశమంతా ఉన్నాయన్నట్లు ప్రభుత్వ అధికారిక మీడియాలో కథనం ఇవ్వడంకంటే దిగజారుడుతనం మరోటి ఉంటుందా.

పరీక్షల రద్దు కాదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఈపాటికి సంస్కరణలు మొదలై ఉండాలి. ఛైర్మన్‌ నిజాయితీగా తప్పుకుని ఉండాలి. సెక్రటరీని ఈపాటికి తప్పించి ఉండాలి. కనీసం ప్రభుత్వంనుంచి నిరుద్యోగులకు ఊరడింపు ప్రకటన లేదు. జరిగిన పొరపాటుకు ప్రభుత్వ పెద్దల్లో పశ్చాత్తాపమన్నదే కనిపించడంలేదు. ఈమధ్య అసోంలో లీకేజీలకు అక్కడి ముఖ్యమంత్రి స్వయానా క్షమాపణలు కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి పారదర్శకత సమర్ధపాలన కంటే రాజకీయం ఎక్కువైపోయింది. కవితపై కేసు ముందు ఇలాంటివన్నీ చిన్నవిగా కనిపిస్తున్నట్లున్నాయి. ఇంత జరిగాక నిరుద్యోగుల ఆక్రోశాన్ని విపక్షాలు సొమ్ముచేసుకోకుండా ఉంటాయా సర్కారు దుమ్ము దులపకుండా ఉంటాయా.